ఔను.. హైదరాబాద్లో గత రెండు నెలల్నుంచి ఫ్లాట్ల అమ్మకాలు తగ్గాయి. ఈ విషయాన్ని సాక్షాత్తు బడా బిల్డర్లు సైతం అంగీకరిస్తున్నారు. స్థానిక సంస్థలు, రెరా వద్ద అనుమతి తీసుకుని ప్రాజెక్టుల్ని ఆరంభించిన అనేక సంస్థలు ఫ్లాట్ల అమ్మలేక చేతులెత్తేస్తున్నాయి. ఇదే కొనసాగితే రియల్ రంగం భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. మరి, నిన్నటివరకూ జోర్దార్ అనుకున్న హైదరాబాద్ ఎందుకిలా కుప్పకూలే పరిస్థితిని ఎదుర్కొంటుంది? ఈ రంగం నిలదొక్కుకోవాలంటే ఏం చేయాలి?
కారణాలైతే తెలియదు కానీ.. హైదరాబాద్లో అనేక నిర్మాణ సంస్థలు 2019లో ఒక్కసారిగా ఫ్లాట్ల ధరల్ని అనూహ్యంగా పెంచేశాయి. చదరపు అడుక్కీ 3,000కు దొరికే ఫ్లాట్లు 4వేలు దాటేశాయి. చ.అ.కీ. 4 వేలకు లభించే ఫ్లాట్లు 6 వేలకు చేరుకున్నాయి. ఇలా, ప్రాంతాన్ని బట్టి ప్రతి ఏరియాలో ఫ్లాట్ల రేట్లు చదరపు అడుక్కీ రూ.1000 నుంచి రూ.2500 దాకా పెరిగాయి. అంటే, అంతకుముందు వరకూ రూ. 40 లక్షలకు దొరికే డబుల్ బెడ్రూం ఫ్లాట్ కొన్ని ప్రాంతాల్లో 50 లక్షలు దాటేస్తే.. 60 లక్షల ఫ్లాట్లు కాస్త రూ.80 లక్షలయ్యాయి. కానీ, కొనుగోలుదారుల జీతాలు మాత్రం అంతగా పెరగలేదు. ఫ్లాట్ మీద సుమారు రూ.20 లక్షలు పెరగడం వల్ల చాలామంది కొనలేని పరిస్థితి నెలకొంది. పశ్చిమ హైదరాబాద్లో అయితే డబుల్ బెడ్రూం ఫ్లాట్ కోసం కనీసం కోటి రూపాయలు పెడితే కానీ దొరకని దుస్థితి. అయితే, నిర్మాణ వ్యయం పెరగడం వల్లే ఫ్లాట్ల ధరలు పెరిగాయని ఈమధ్య పలువురు డెవలపర్లు అంటున్నారు. కానీ, ఈ రేటు గత రెండేళ్ల క్రితం నుంచే పెరుగుతూ వచ్చిందనే విషయం తెలిసిందే.
ఫ్లాట్ల ధరలు పెరగడంతో అంతంత రేటు పెట్టి కొనలేని వారు మార్కెట్లో అనేకమంది ఉన్నారని కొందరు బిల్డర్లు గుర్తించారు. తక్కువ రేటుకే ఫ్లాటును అందజేస్తామంటూ ప్రచారాన్ని మొదలెట్టారు. దీనికి సింగిల్ పేమెంట్.. ప్రీలాంచ్.. యూడీఎస్.. ఇలా రకరకాల పేర్లు పెట్టారు. ఇది నిజమేనని నమ్మి చాలామంది గుడ్డిగా అందులో సొమ్ము పెడుతున్నారు. ప్రాజెక్టును హ్యండోవర్ చేస్తారా? లేదా? అనే విషయాన్ని పట్టించుకోకుండా.. కేవలం రేటు తక్కువనే అంశం మీదే ఫోకస్ పెడుతున్నారు. అందుకే, కొనుగోలుదారులు ఏ ప్రాజెక్టుకు వెళ్లినా.. ప్రీలాంచ్, హండ్రెడ్ పర్సంట్ పేమెంట్ ఉందా? అని అడుగుతున్నారు. ఇలా, కొనుగోలుదారులు అడుగుతున్నారంటే.. డెవలపర్లు పెంచిన అంతంత రేటు పెట్టి కొనలేరు కాబట్టే స్కీముల గురించి అడుగుతున్నారని తెలిసింది. అయితే, ఇలా బయ్యర్లు అడుగుతున్నారని చెప్పి మోసపూరిత డెవలపర్లు ఆకర్షణీయమైన పథకాలతో అసలైన బయ్యర్లను బోల్తా కొట్టిస్తున్నారు.
ఎవరు తీసిన గోతిలో వారు పడతారన్నట్లుగా.. 2019లో మార్కెట్ యమజోరుగా ఉందనే అపోహలో.. రెండేళ్ల క్రితం రేటు పెంచిన డెవలపర్లు ప్రస్తుతం తగ్గించలేకపోతున్నారు. కొందరేమో కొనుగోలుదారులు అడిగినంత తగ్గింపునిస్తున్నారు. మరికొందరేమో రేటు తగ్గిస్తే.. తమ బ్రాండ్ నేమ్ పోతుందనే అపోహలో ఉన్నారు. ఫ్లాట్ల అమ్మకాలు జరిగినా, జరగకున్నా.. నిర్మాణ పనుల్ని జరిపించాలంటే వెండార్లకు పేమెంట్లు చేయాల్సిందే. లేకపోతే, వీరికి మరింత చెడ్డ పేరు వస్తుందనే విషయాన్ని చాలామంది బిల్డర్లు అర్థం చేసుకోవట్లేదు. మొత్తానికి, మార్కెట్ డౌన్ కావడంతో.. అమ్మకాలు లేక మార్కెట్ కునారిల్లిపోతుంది. రెండు నెలల్నుంచి కొందరు చిన్న డెవలపర్లయితే ఈగలు తోలుకుంటున్నారు. ఉద్యోగులకు నెలసరి జీతాలివ్వలేక.. కొందరిని తొలగించి మిగతా వారితో పనులు చేయించుకుంటున్న దుస్థితి ఏర్పడింది. ఏదీఏమైనా, హైదరాబాద్లో రెండు నెలల్నుంచి సేల్స్ డౌన్ అయిన మాట వాస్తవమే.
‘
This website uses cookies.