Categories: LATEST UPDATES

సంజయ్ చాబ్రియా కస్టడీ పొడిగింపు

యస్ బ్యాంకు-డీహెచ్ఎఫ్ఎల్ లోన్ మోసం కేసులో అరెస్టు అయిన బిల్డర్ సంజయ్ చాబ్రియా కస్టడీని కోర్టు పొడిగించింది. తన శాంతాక్రజ్ ప్రాజెక్టులో క్లబ్ హౌస్ నిర్మాణం కోసం డీహెచ్ఎఫ్ఎల్ నుంచి రూ.678 కోట్ల రుణం పొందిన చాబ్రియా.. ఆ నిధులను మళ్లించారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన కస్టడీని పొడిగించాలని న్యాయస్థానాన్ని కోరగా.. అందుకు కోర్టు అంగీకరించింది. చాబ్రియ కస్టడీని శుక్రవారం వరకు పొడిగించింది. అయితే, చాబ్రియా లయార్ దీనిని వ్యతిరేకించారు. ఏడు రోజుల ఈడీ కస్టడీలో చాబ్రియా పూర్తిగా సహకరించారని, అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ఇచ్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో కస్టడీ పొడిగింపు అవసరం లేదని వాదించారు.

శాంతాక్రజ్ ప్రాజెక్టుతో సంబంధం లేని ఫ్లాగ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో చాబ్రియా రూ.678 కోట్ల రుణం తీసుకున్నారని ఈడీ పేర్కొంది. గతంలో రెండు జాయింట్ కంపెనీల పేరు మీద తీసుకున్న రూ.2100 కోట్ల రుణానికి ఇది అదనమని వివరించింది. అయితే, ఈ మొత్తాన్ని తన గ్రూప్ కంపెనీల రుణాలు చెల్లించడానికి వినియోగించారని తెలిపింది. నిధుల మళ్లింపునకు సంబంధించిన వివరాలను చాబ్రియా చెప్పడంలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన కస్టడీ పొడిగించాలని కోరింది. ఇందుకు కోర్టు అంగీకరించింది.

This website uses cookies.