- పశ్చిమంలోనే బడా ఆకాశహర్మ్యమని
గొప్పలు చెప్పుకున్న సంస్థ నిర్వాకమిది!
- శంషాబాద్ శాతంరాయిలో కొత్త ప్రాజెక్టు
- అనుమతి రాకముందే, ప్రీలాంచ్ సేల్స్
- బడా కంపెనీలే ప్రీలాంచ్లో అమ్మితే ఎలా?
(కింగ్ జాన్సన్ కొయ్యడ)
హైదరాబాద్‌లో కొందరు డెవలపర్లు.. పెట్టుబడిదారులు, కొనుగోలుదారులతో డేంజర్ గేమ్ ఆడుతున్నారు. రియల్ రంగంలో అమ్మకాలపై అధ్యయనం చేయకుండా.. అనాలోచితంగా.. ఆవేశంగా.. ఆకాశహర్మ్యాల్ని ఆరంభిస్తున్నారు. వాటిని పూర్తి చేసేందుకు మరో చోట ప్రీలాంచ్ స్కీములో ఫ్లాట్లను విక్రయిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. అసలు చేతిలో సొమ్ము లేనప్పుడు ప్రజల సొమ్ముతో భవనాల్ని కట్టడమెందుకు? ఇలా వ్యవహరించడం వల్లే కదా.. ఢిల్లీలోని ఎన్‌సీఆర్ రీజియన్‌లో బడా బిల్డర్లు పోలీసు స్టేషన్ల మెట్లు ఎక్కారు. జైలుపాలయ్యారు. వారి కుటుంబం పరువు బజారున పడింది. అత్యుత్తమ నిర్మాణ సంస్థ అని కీర్తించిన వారే.. ఆతర్వాత చీదరించుకోవడం మొదలెట్టారు. తాజాగా, సుమధురమైన ప్రాజెక్టుల్ని నిర్మించే ఓ సంస్థ పెట్టుబడిదారులు, కొనుగోలుదారుల్నుంచి ముందస్తుగా అక్రమంగా సొమ్ము వసూలు చేస్తోంది. పశ్చిమ హైదరాబాద్లో ఓ బడా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఇలా సొమ్మును సమీకరిస్తోందా అనే సందేహం పరిశ్రమలో వ్యక్తమవుతోంది.
భాగ్యనగరంలో పేరెన్నిక గల ఓ నిర్మాణ సంస్థ.. స్థానిక సంస్థ నుంచి అనుమతి తీసుకోకుండానే.. శంషాబాద్‌లోని శాతంరాయిలో ప్రీలాంచ్ ఆఫర్లో ఫ్లాట్లను విక్రయిస్తోంది. ఈ కంపెనీ ఎంత తెలివిగా వ్యవహరిస్తోందంటే.. ఎక్కడా తమ పేరు బయటికి రాకుండా అన్నిరకాల జాగ్రత్తల్ని తీసుకుంటుంది. కాకపోతే, కొనుగోలుదారులు అడిగితే మాత్రం.. సంస్థ పేరు చెబుతోంది తప్ప ఎక్కడా తమ ఆనవాలు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. వీరి వద్ద ఫ్లాట్లు కొనాలా? వద్దా? అని పలువురు బయ్యర్లు రియల్ ఎస్టేట్ గురును సంప్రదించడంతో ప్రీలాంచ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఈ సంస్థ కొనుగోలుదారులకేం చెబుతుందో తెలుసా? 1285 చదరపు అడుగుల విస్తీర్ణం గల రెండు పడక గదుల ఫ్లాటు సైజును చదరపు అడుక్కీ రూ.4200 చొప్పున విక్రయిస్తోంది. అంటే, మొత్తం ఫ్లాటు రేటు దాదాపు రూ.53.97 లక్షలు అవుతోంది. ఈ ప్రాజెక్టు చుట్టుపక్కల కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రస్తుతం అమ్మే ధర.. రూ.5,900 దాకా ఉంది. అంటే, అనుమతులన్నీ వస్తే.. తమ ప్రాజెక్టులో ఫ్లాటు ధర ఇంతే పెడతామని చెప్పకనే చెబుతోంది. దీనికి ఓ పది లక్షల్ని జోడించి.. మొత్తం ఫ్లాట్ రేటు రూ.85.81 లక్షలు అవుతుందని లెక్కలేసి చెబుతోంది. అంటే, 59 శాతం అప్రిసియేషన్ లిభిస్తుందని బయ్యర్లకు ఊరిస్తోంది. 2024 నాటికి ఆ ప్రాంతంలో ఫ్లాటు ధర ఎంతలేదన్నా చదరపు అడుక్కీ రూ.7000కు చేరితే.. ఇప్పుడు కొన్న ఫ్లాట్ విలువ.. సుమారు రూ.99.95 లక్షలౌతుందని ఆశ పెడుతోంది. అంటే, రెండేళ్లలో 85.20 శాతం అప్రిసియేషన్ అందుకోవచ్చని పెట్టుబడిదారులతో పాటు కొనుగోలుదారుల్ని ఊరిస్తోంది. 2.5 పడక గదుల ఫ్లాట్ అయితే 83.43 శాతం, 3 పడక గదుల ఫ్లాట్ అయితే 84.25 శాతం అప్రిసియేషన్ అందుకోవచ్చని బయ్యర్లను బుట్టలో వేస్తోంది.
ఇంతటి సుమధురమైన ఆఫర్‌ను గమనించి.. బయ్యర్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఇంత బడా సంస్థకు ఇదేం పోయే కాలమంటూ కొందరు కొనుగోలుదారులు విస్తుపోతున్నారు. బెంగళూరులో అనుభవమున్న సంస్థలూ హైదరాబాద్‌లో ఇలాంటి వేషాలు వేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో, ఈ సంస్థ ఆర్థిక బలంపై బయ్యర్లలోనూ సందేహం ఏర్పడుతోంది. దీని వల్ల కంపెనీ తన పరువును పోగొట్టుకుంటోందనే విషయం అర్థం కావట్లేదు. కొనుగోలుదారులకు ఆర్థికంగా మేలు చేయాలన్న లక్ష్యం నిజంగానే ఉంటే.. రెరా నిబంధనలకు వ్యతిరేకంగా.. ఇలా అక్రమ మార్గంలో ఫ్లాట్లను విక్రయించరని బయ్యర్లు అంటున్నారు. మరి, ఇలాంటి సంస్థలు హైదరాబాద్‌లో ఎన్ని ఉన్నాయి? వాటి పూర్వాపరాలేమిటి? ఎంతమంది వద్ద సొమ్మును ఇప్పటివరకూ సమీకరించారు? వంటి అంశాల్ని తెలంగాణ రెరా అథారిటీ లోతుగా పరిశీలించాల్సిన అవసరముంది. అప్పుడే, ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ తరహాలో మన హైదరాబాద్ కాకుండా ఉంటుంది.