ప్రముఖ నటి సన్నీ లియోన్ అలియాస్ కరెన్ జీత్ కౌర్ వెబర్ ముంబైలోని ఓషివారాలో రూ.8 కోట్లు వెచ్చించి ఆఫీస్ స్పేస్ కొనుగోలు చేశారు. వీర్ గ్రూప్ కమర్షియల్ ప్రాజెక్టు వీర్ సిగ్నేచర్ లో ఆమె ఆ ప్రాపర్టీ కొన్నారు. ఈ ప్రాజెక్టు లోఖండ్ వాలా కాంప్లెక్స్ సమీపంలో ఉంది. ప్రధాన రోడ్లతోపాటు ముంబై మెట్రోతో బాగా కనెక్టివిటీ కలిగి ఉన్న ఓషివారాలో ప్రాపర్టీలకు డిమాండ్ ఎక్కువ. సన్నీ లియోన్ కొనుగోలు చేసిన కమర్షియల్ ప్రాపర్టీ 1904.91 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కలిగి ఉంది. బిల్టప్ ఏరియా అయితే 2095 చదరపు అడుగులుగా ఉంది.
దీనికి మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఈనెలలో జరిగిన ఈ లావాదేవీకి రూ.30వేల రిజిస్ట్రేషన్ ఫీజు, రూ.35.01 లక్షల స్టాంపు డ్యూటీని సన్నీ చెల్లించారు. ఆనంద్ కమల్ నాయన్, రూప ఆనంద్ పండిట్ లకు చెందిన ఐశ్వర్య ప్రాపర్టీ అండ్ ఎస్టేట్స్ నుంచి సన్నీ లియోన్ ఈ ఆఫీస్ స్పేస్ కొనుగోలు చేశారు. ఆనంద్ పండిట్ ప్రముఖ చలనచిత్ర నిర్మాత, పంపిణీదారు, రియల్ ఎస్టేట్ డెవలపర్. కాగా, వీర్ గ్రూప్ వాణిజ్య ప్రాజెక్ట్ అయిన వీర్ సిగ్నేచర్ 0.53 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రెరా ప్రకారం 59.21 చదరపు మీటర్ల నుంచి 193.04 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆఫీస్ స్పేస్ లు అందిస్తోంది. అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్‌గన్, కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ వంటి ఇతర బాలీవుడ్ తారలు కూడా ఈ భవనంలో ఆస్తులు కలిగి ఉన్నారు.
This website uses cookies.