తెలంగాణకు మరో మణిహారం కానున్న రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా చర్యలు చేపట్టాయి. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి మూడు రకాల సర్వేలు చేసి.. చివరికి ఒక అలైన్ మెంట్ ను ఖరారు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. మిగతా రెండు చోట్లా ప్రతిపాదిత భూముల్లో.. ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇలా సుమారు 2000 మంది ఇంటి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు ఎలాగోలా నిర్మాణాలు చేపట్టడంతో అక్రమ నిర్మాణాలంటూ సంబంధిత అధికారులు నోటీసులు ఇస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌లో క్రమబద్ధీకరించుకోవాలంటూ స్థానికులపై అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిస్థితి నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలతో పాటు.. ఆయా గ్రామ పంచాయతీల్లో నెలకొంది.
నర్సాపూర్ మునిసిపాలిటీ పరిధిలో గతంలో సంగారెడ్డి మార్గంలోని రుస్తుంపేట కమాన్ సమీపంలో నుంచి, మెదక్ మార్గంలోని సీతారాంపూర్, గోకుల్ కాలనీ మీదుగా, వెల్దుర్తి మార్గంలో ఖండసారి షుగర్ ఫ్యాక్టరీ వరకూ ట్రిపుల్ ఆర్ వెళ్తుందని సర్వే చేశారు. ఆయా ప్రాంతాల్లో హద్దులు కూడా ఏర్పాటు చేశారు. రెండోసారి.. నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి మండలాల్లోని బ్రాహ్మణపల్లి, నాగ్సన్‌పల్లి, శివ్వంపేట మండలం పిల్లుట్ల తదితర ప్రాంతాల మీదుగా సర్వే చేశారు. ఆ తరవాత మూడవ సారి.. పై రెండింటిని పక్కన పెట్టి రెడ్డిపల్లి సమీపంలోంచి ట్రిపుల్ ఆర్ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ మిగతా రెండు అలైన్ మెంట్స్ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణాలకు అధికారులు అనుమతుల్ని మంజూరు చేయట్లేదు. ఆన్‌లైన్‌లో ఈ ప్రాంతాలను హెచ్‌ఎండీఏ డీనోటిఫై చేయాల్సి ఉండగా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
This website uses cookies.