రెరా చట్టం అమలుకు సంబంధించిన సమస్యలపై నాలుగు వారాల్లో సమాధానమివ్వాలని, లేకుంటే హౌసింగ్ శాఖల ప్రధాన కార్యదర్శులు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ సహా 11 రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో దీనిపై సమాధానం ఇవ్వకుంటే ఆయా రాష్ట్రాల హౌసింగ్ శాఖల ప్రధాన కార్యదర్శులు సుప్రీంకోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే రెరా చట్టం, 2016 నిబంధనల అమలుపై కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు సూచించింది.
రియల్ రంగంలో పారదర్శకత పెంపొందించడం, మోసాలను తగ్గించడం, కొనుగోలుదారుల సౌలభ్యం కోసం మోడల్ బిల్డర్-బయ్యర్ అగ్రిమెంట్, మోడల్ ఏజెంట్-బయ్యర్ అగ్రిమెంట్ రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. రెరాకు సంబంధించిన నిర్థిష్టమైన సమాచారం ఇవ్వాలని ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిక ప్రాంతాలను ఆదేశించింది. అయితే, ఇప్పటివరకు కేవలం ఐదు రాష్ట్రాలే స్పందించాయని పేర్కొంది.
కాగా, మోడల్ అగ్రిమెంట్ ను అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్యవర్య భాటి, అమికస్ క్యూరీ దేవాశిష్ భారుకా ధర్మాసనానికి సమర్పించారు. ఇందులో కొనుగోలుదారుల రక్షణ కోసం రెరా నిబంధనలతో కూడిన పార్ట్-ఏ.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా నిబంధనలను కలిగి ఉండే పార్ట్-బి ఉన్నాయి. దీనిని పరిశీలించిన ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేసింది.
This website uses cookies.