- బయ్యర్లను నిట్టనిలువున మోసం చేస్తున్న డెవలపర్లు
- ప్రీ లాంచ్‌లు, యూడీఎస్ అంటూ దగా
- రెరాకు పూర్తి స్థాయి ఛైర్మన్‌ను నియమించాలి
- కనీసం రిటైరైన ఐఏఎస్ అధికారిని అయినా ఏర్పాటు చేయాలి
- ముక్తకంఠంతో కోరుతున్న ఇంటి కొనుగోలుదారులు
తమిళనాడు రెరా అథారిటీని చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. కొనుగోలుదారుల్ని పరిరక్షించేందుకు తామెప్పుడు ముందంజలో ఉంటామని తెలియజేసింది. ఈ క్రమంలో ఆ రెరా అథారిటీ విడుదల చేసిన ప్రకటన అక్కడి బయ్యర్లలో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. రెరా అనుమతి లేకుండా కొనుగోలుదారులతో అమ్మకం మరియు నిర్మాణ ఒప్పందం కుదుర్చుకోవడం చట్టవిరుద్ధమని ప్రకటించింది.
చెన్నైలో సెనోటాఫ్ డెవలపర్స్ ఎల్ఎల్పీ మరియు ఒలంపియా టెక్ పార్కులు కలిసి 2016లో కొనుగోలుదారుల నుంచి సొమ్ము వసూలు చేసింది. కొంతకాలం తర్వాత ఒక కొనుగోలుదారుడు ఆ ప్రాజెక్టు నుంచి వెనక్కి వెళ్లినప్పుడు సదరు సంస్థ రూ.12.8 లక్షలు సర్వీ ట్యాక్స్ కింద కోత విధించింది. దీనిపై, అతను అక్కడి రెరా అథారిటీలో ఫిర్యాదు చేశాడు. ఈ ఆరోపణను డెవలపర్లు ఖండించారు. ఫిర్యాదుదారు నుండి అందుకున్న మొత్తంలో, డెవలపర్లు తాము సేవా పన్ను, స్వచ్ఛ భారత్ సెస్ మరియు కృషి కళ్యాణ్ సెస్ కోసం 12.8 లక్షలు చెల్లించామని మరియు మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇచ్చామని చెప్పారు. ఇరు వాదనలు విన్న తర్వాత డెవలపర్లు అమ్మకం లేదా నిర్మాణ ఒప్పందంలో ప్రవేశించకుండానే 80% సొమ్ము వసూలు చేయడం రెరా చట్టంలోని సెక్షన్ 13 యొక్క స్పష్టమైన ఉల్లంఘన అని రెరా అథారిటీ తేల్చి చెప్పింది. 10.2 శాతం వడ్డీతో సహా సొమ్ము వెనక్కి ఇచ్చేయాలని తీర్పునిచ్చింది.
పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో రెరా అథారిటీ ఇళ్ల కొనుగోలుదారుల సమస్యల్ని వింటూ పరిష్కారాలు చూపెడుతుంటే.. తెలంగాణలో మాత్రం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని ప్రభుత్వం ఎంచక్కా నిద్రపుచ్చుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి రాజేశ్వర్ తివారీ పదవీవిరమణ తర్వాత ఈ విభాగాన్ని అప్పటి వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతల్ని చూసే సోమేష్ కుమార్ కి ప్రభుత్వం అప్పచెప్పింది. ఆతర్వాత ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవ్వడంతో పని భారం పెరిగింది. ఫలితంగా, తెలంగాణ రెరా అథారిటీ మీద పెద్దగా దృష్టి సారించలేకపోతున్నారు. ఇందుకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడం లేదు. దీంతో కొనుగోలుదారుల సమస్యలు పరిష్కారం కావడం లేదు.
మరో అంశమేమిటంటే.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా.. అధిక శాతం సంస్థలు రెరా అనుమతి లేకుండా ప్రీలాంచుల్లో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తున్నాయి. స్థానిక సంస్థల అనుమతుల్లేకుండా తక్కువ రేటు అంటూ చెబుతూ ముందే వంద శాతం సొమ్మును సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం నుంచి కొందరు డెవలపర్లు వసూలు చేస్తున్నారు. సందిట్లో సడేమియాలా.. అసలు నిర్మాణ రంగంతో సంబంధం లేనివారూ ఈ తతంగం షురూ చేశారు. కనీసం ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్లు తెరుచుకోవాలి. తెలంగాణ రియల్ రంగంలో జరుగుతున్న కొందరు రియల్టర్లు చేస్తున్న అక్రమవసూళ్లకు అడ్డుకట్ట వేయాలి. తెలంగాణ రెరా అథారిటికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సేవల్ని అయినా వినియోగించుకునేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే చర్యలు తీసుకోవాలి.