సొసైటీ ఆవరణలోని పార్కింగ్ స్లాట్లను బిల్డర్ విక్రయించడానికి వీల్లేదని ముంబైలోని అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తేల్చి చెప్పింది. బెలాపూర్ లోని కిల్లే గౌథాన్ లోని ఓ హౌసింగ్ సొసైటీలో అలా విక్రయించిన 13 పార్కింగ్ స్లాట్లను వెనక్కి తీసుకుని బైలాస్ కు అనుగుణంగా తొలుత వచ్చినవారికి తొలుత ప్రాతిపదికన కేటాయించాలని సూచించింది. అంతేకాకుండా ఈ విషయంలో ఫిర్యాదుదారుకి రూ.10వేలు చెల్లించాలని సొసైటీని ఆదేశించింది.
ద కామ్స్ ఎన్ క్లేవ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో 2018లో రవీంద్ర సింగ్ రావల్ ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. అనంతరం దానిని అద్దెకు ఇవ్వగా.. సదరు అద్దెదారు పార్కింగ్ ప్లేస్ వినియోగించుకునే విషయంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో రావల్ వినియోగదారులు వివాద పరిష్కార కమిషన్ ను ఆశ్రయించారు. తనకు పార్కింగ్ స్లాట్ కేటాయించడంతోపాటు తాను అనుభవించిన మానసిక క్షోభకు పరిహారం ఇప్పించాలని కోరారు.
ఆ సొసైటీలో మొత్తం 17 ఫ్లాట్లు ఉండగా..13 పార్కింగ్ స్లాట్లు మాత్రమే ఉన్నాయి. అయితే, రావల్ చేసుకున్న ఒప్పందంలో పార్కింగ్ స్లాట్ కేటాయింపు గురించి ప్రత్యేకంగా ఎలాంటి ప్రస్తావనా లేదు. ఈ నేపథ్యంలో సొసైటీ వాదనలు వినిపిస్తూ.. పార్కింగ్ స్లాట్లను నేరుగా బిల్డరే విక్రయించాడని, ఒక్కో స్లాట్ కి రూ.25వేలు తీసుకున్నాడని, ఇందులో సొసైటీకి ఎలాంటి పాత్రా లేదని పేర్కొంది. దీనిని కమిషన్ తప్పుబట్టింది. మహారాష్ట్ర ఓనర్ షిప్ ఫ్లాట్స్ చట్టం ప్రకారం డెవలపర్ లేదా ప్రమోటర్ కు పార్కింగ్ స్పేస్ విక్రయించే అధికారం లేదని పేర్కొంది. డెవలపర్ కేవలం కేటాయింపు పత్రాలు మాత్రమే ఇవ్వాలని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఆ 13 పార్కింగ్ స్లాట్లను వెనక్కి తీసుకుని సొసైటీ బైలాస్ ప్రకారం ముందు వచ్చినవారికి ముందు ప్రాతిపదికన తిరిగి కేటాయించాలని సూచించింది.
This website uses cookies.