Categories: LEGAL

రెరా కీలక నిర్ణయం

  • ఆగిపోయిన ప్రాజెక్టు పూర్తి చేయడానికి ముందుకొచ్చిన సంస్థ
  • 600 మందికి పైగా కొనుగోలుదారులకు ప్రయోజనం

ఉత్తరప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథార్టీ (యూపీ రెరా) కీలక నిర్ణయం తీసుకుంది. ఏడేళ్లుగా ఆగిపోయిన ప్రాజెక్టును సొంతంగా పూర్తి చేయడానికి నడుం బిగించింది. తద్వారా 600 మందికి పైగా కొనుగోలుదారులు ప్రయోజనం పొందనున్నారు. నోయిడా సెక్టార్ 143లో మిస్ట్ డైరెక్ట్ సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఫెస్టివల్ సిటీ పేరుతో 2012లో ఓ ప్రాజెక్టు ప్రారంభించింది. 2015లోగా పూర్తి చేసి అప్పగించాల్సి ఉంది. అయితే, గడువులోగా నిర్మాణం పూర్తి చేయలేకపోయింది.

అనంతరం చేతులెత్తేసి నిర్మాణాన్ని నిలిపివేసింది. దీనిపై పలువురు కొనుగోలుదారులు యూపీ రెరాను ఆశ్రయించారు. రెరా పంపించిన నోటీసులకు ఆ కంపెనీ స్పందించకపోవడంతో డెవలపర్ ను బ్లాక్ లిస్టు లో పెట్టి, ప్రాజెక్టు గుర్తింపును రద్దు చేసింది. ‘ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొనుగోలు చేసినవారి అందరి అంగీకారంతో దీనిని పూర్తి చేయాలని నిర్ణయించాం. మిస్ట్ అవెన్యూ బయ్యర్స్ అసోసియేషన్, ఫెస్టివల్ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ లు ఇందుకు సుముఖత వ్యక్తంచేశాయి’ అని రెరా ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఈ ప్రాజెక్టులో మొత్తం 1600 యూనిట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణంలో ముందుకు వెళ్లే ముందు ఇందులో కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరి అంగీకారం తీసుకునే దిశగా రెరా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు దాదాపు 300 మంది అంగీకారం తీసుకోగా, మిగిలినవారి వివరాలు సేకరిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పనులు ప్రారంభిస్తుంది.

This website uses cookies.