Categories: TOP STORIES

హెచ్ఎండీఏలో ప్రస్తుత ఆస్తి పన్ను విధానమే !

ఆస్తి పన్ను చెల్లింపుదారులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథార్టీ (హెచ్ఎండీఏ) ఊరట కలిగించే వార్త చెప్పింది. ఆస్తి పన్ను మదింపులో ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఆస్తి పన్ను మదింపులో ప్రస్తుత విధానాన్నే అనుసరించాలని ఈనెల 17న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎన్. సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పన్ను మదింపులో యూనిట్ రేట్ ఆధారిత విధానం ఉండగా.. మూలధన విలువ మదింపు (సీవీ) విధానానికి మార్చాలని నిర్ణయించారు. అయితే కొత్త విధానంలో ఆస్తి పన్నులు దాదాపు రెండు రెట్లు పెరిగాయి. తెల్లాపూర్ మున్సిపాలిటీలో సీవీ విధానం అమలు చేయగా.. అద్దె అధారిత విధానం అమలు చేయాలని అక్కడి నివాసితులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి పాత విధానమే కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ విలువలను రెండు సార్లు పెంచిన నేపథ్యంలో కొత్త విధానం అమలు చేసేముందు తగిన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని.. లేకుంటే మధ్య, స్వల్ప ఆదాయ వర్గాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఉత్తర్వుల్లో సత్యనారాయణ పేర్కొన్నారు.

This website uses cookies.