- 48 ప్లాట్లు వేలానికి పెడితే
- 12 ప్లాట్లకు మాత్రమే బిడ్డర్లు
- ఈ ప్లాట్లకు గిరాకీ ఎందుకు తగ్గింది?
తొర్రూరులో హెచ్ఎండీఏ నిర్వహించిన ప్లాట్ల వేలం తుస్సుమన్నది. సోమవారం ఉదయం 25 ప్లాట్లకు వేలం ప్రక్రియ నిర్వహిస్తే.. కేవలం ఐదు ప్లాట్లకు మాత్రమే బిడ్డింగ్ జరిగింది. సాయంత్రం 23 ప్లాట్లకు గాను కేవలం ఏడు ప్లాట్లకు మాత్రమే బిడ్డింగ్ జరిగింది. మొత్తం 48 ప్లాట్లకు గాను కేవలం 12 ప్లాట్లను మాత్రమే బయ్యర్లు ఎంపిక చేసుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వేలానికి మాత్రమే కొనుగోలుదారుల నుంచి స్పందన కరువైంది. ఇక్కడి మార్కెట్ రేటు కంటే కనీస ధర ఎక్కువ పెట్టారా? లేక మార్కెట్లో ప్లాట్లకు గిరాకీ తగ్గిందా? వంటి అంశాల్ని హెచ్ఎండీఏ అధికారులు విశ్లేషిస్తున్నారు. అమెరికాలో మాంద్యం ప్రభావం ఐటీ రంగం మీద క్రమక్రమంగా పడుతోందని.. అందుకే, ఐటీ నిపుణులు ప్లాట్లు, ఫ్లాట్లలో పెట్టుబడులు పెట్టేందుకు వెనకంజ వేస్తున్నారని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.