- సెప్టెంబరులో ప్రాజెక్టు ఆరంభం
- మే నుంచే మార్కెట్లో హడావిడి
- ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నం
- ప్రీలాంచ్ సేల్స్‌లో ఆరి తేరిన ఐరా
మాదాపూర్‌లో ట్రంప్ టవర్స్ నిర్మిస్తున్నారనే ప్రచారం ఆమధ్య గట్టిగానే వినిపించింది. వాటిని నిర్మించాలని ప్రయత్నించిన సంస్థ ముందస్తుగానే ఇన్వెస్టర్ల నుంచి సొమ్ము వసూలు చేసినా ప్రాజెక్టు మాత్రం ప్రారంభం కాలేదు. ఇప్పుడు మళ్లీ కోకాపేట్‌లో ట్రంప్ టవర్స్ వస్తున్నాయంటూ ప్రచారం ఊపందుకుంది. మరి, ఈ సంస్థ కూడా నిజంగానే ట్రంప్ టవర్స్‌ను ఆరంభిస్తుందా? లేదా ప్రీలాంచ్ సేల్స్ లేదా వన్ టైమ్ పేమెంట్ కింద ఇన్వెస్టర్ల నుంచి సొమ్ము వసూలు చేసి చేతులెత్తుస్తుందా? లేక నిజంగానే ప్రాజెక్టును మొదలెట్టి సకాలంలో పూర్తి చేస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ALSO READ: హైదరాబాద్‌లో ప్రప్రథమంగా.. లేక్‌వ్యూ ప్రీమియం ప్రాజెక్టు..
హైదరాబాద్ నిర్మాణ రంగంలో బహుళ అంతస్తులు, ఆకాశహర్మ్యాల్ని హ్యాండోవర్ చేయని ఐరా రియాల్టీ అనే నిర్మాణ సంస్థ.. ఈ 63 అంతస్తుల ప్రాజెక్టును చేపడుతోందని తెలిసింది. ఒకవేళ అంతా సవ్యంగా సాగి.. ట్రంప్ టవర్ ఆరంభమైతే.. ఇదే హైదరాబాద్‌లో అతి ఎత్తైన ప్రాజెక్టు అవుతుంది. అసలే మార్కెట్ మెరుగ్గా లేదు.. ఇలాంటి తరుణంలో కోకాపేట్‌లో చదరపు అడుక్కీ రూ.15,000 పెడితే.. కొనేవారు ఎంతమంది ఉన్నారనేది ప్రశ్నార్థకమేనని చెప్పాలి. అయితే, ఇప్పట్నుంచి పర్మిషన్ వచ్చేలోపు అంతకంటే తక్కువకే ఫ్లాట్లను విక్రయిస్తామంటూ ముందుస్తు అమ్మకాల్ని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
* సెప్టెంబరులో ట్రంప్ టవర్లను ఆరంభించాలని సంస్థ భావిస్తున్నప్పుడు.. నాలుగు నెలల ముందే ఈ విషయాన్ని బయటికి వెల్లడించడమంటే.. కేవలం ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికే ఈ మార్కెటింగ్ టెక్నిక్ అని చెప్పొచ్చు. ఏదీఏమైనా, ట్రంప్ టవర్స్ అనగానే ఇన్వెస్టర్లు పోటీపడేలా ముందుకొచ్చి ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తారా? లేదా? అనే విషయం త్వరలో తేలుతుంది.