- 1.56 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకున్న కంపెనీ
- నెలకు రూ.1.43 కోట్ల అద్దె
గ్లోబల్ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డొనాల్డ్స్ కంపెనీ ఇండియాలో తన తొలి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభిస్తోంది. హైటెక్ సిటీలో 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆఫీస్ స్పేస్ ను ఐదేళ్ల పాటు లీజుకు తీసుకుంది. హైటెక్ సిటీలోని ఆర్ఎంజెడ్ నెక్స్ట్ టవర్-20లో ఉన్న ఈ ప్రాపర్టీ నెలవారీ అద్దె రూ.1.43 కోట్లు అని ప్రాప్ టెక్ వెల్లడించింది. ప్రహిత కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి దీనిని తీసుకున్నారని, లీజు ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రారంభమైందని పేర్కొంది. మొత్తం నాలుగు అంతస్తుల్లో 1.56 లక్షల చదరపు అడుగులు స్పేస్ ఉంది. చదరపు అడుగుకు రూ.92 చొప్పున అద్దె చెల్లించినట్టు అవుతోంది. ఈ లావాదేవీ కోసం సెక్యూరిటీ కింద రూ.8.6 కోట్లు డిపాజిట్ చేశారు. 2028 ఫిబ్రవరి ఒకటి నుంచి అద్దె 15 శాతం పెరుగుతుంది.
ALSO READ: కస్టమర్ల సంతృప్తి.. నిర్మాణాల్లో నాణ్యతే ధ్యేయంగా 30 ఏళ్లుగా రియల్ సేవలు
* గతేడాది మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హైదరాబాద్ సమీపంలో రూ.181.25 కోట్లకు 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమిని నాట్కో ఫార్మా లిమిటెడ్ మరియు టైమ్ క్యాప్ ఫార్మా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేశారు. అలాగే గతేడాది డిసెంబర్‌లో, ఫేస్‌బుక్ హైదరాబాద్‌లో 3.7 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలానికి నెలవారీ అద్దెకు రూ.2.8 కోట్లకు రెండు వేర్వేరు లావాదేవీలలో తన లీజును పునరుద్ధరించింది. మరోవైపు దేశంలోని మొత్తం ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్ ప్రస్తుతం 15% వాటా కలిగి ఉంది. అందులో 18% కంటే ఎక్కువ గ్రీన్-సర్టిఫైడ్ ఆఫీస్ స్టాక్ అని సీబీఆర్ఈ నివేదిక తెలిపింది. టెక్నాలజీ సంస్థలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల నుంచి డిమాండ్ పెరగడంతో, 2030 నాటికి నగరంలో ఆఫీస్ స్పేస్ ఇన్వెంటరీ 200 మిలియన్ చదరపు అడుగులకు మించి ఉంటుందని అంచనా.