తెలంగాణలో రియల్ వెంచర్లకు సంబంధించిన ఎల్ఆర్ఎస్ కు మోక్షం లభించనుందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. సంక్రాంతి తరువాత రెండు రోజుల పాటు ఎల్ఆర్ఎస్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలలైనా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి.. పెండింగులో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేయాలని సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రెవెన్యూ శాఖ ఆదేశాల్ని జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్‌కు సంబంధించి దాదాపు 25 లక్షలు దరఖాస్తులొచ్చాయి. అందులో కనీసం పది శాతం కూడా క్లియర్ అవ్వలేదు. ఎల్ఆర్ఎస్ ఛార్జీలను ఎంత మేర వసూలు చేయాలన్నదానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. వ్యక్తిగతమైన ఇంటి స్థలాలతో పాటు లేఅవుట్‌లోని ప్లాట్లపై.. చదరపు గజానికి కొంత మొత్తం ఫీజుగా వసూలు చేయాలా లేదంటే 7.5 శాతంగా ఉన్న రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీని రెండింతలుగా 14 శాతం వసూలు చేయాలా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. లేఅవుట్లలో ఇప్పటికే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు నేరుగా ఇంటి నిర్మాణాలకు మాత్రమే అనుమతి తీసుకునేలా నిబంధనల్ని తెస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎల్‌ఆర్‌ఎస్ ఛార్జీలతో పాటు 33 శాతం కాంపౌండ్ ఫీజులు కట్టాల్సి ఉంటుందని అధికారిక వర్గాల సమాచారం.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరిత గతిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేయాలని ఉన్నతాధికారులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినా ఫలితం లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఎల్ఆర్ఎస్ పై రెండు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతి పండగ తర్వాత ఎల్ఆర్ఎస్ పై.. స్పెషల్ డ్రైవ్ కోసం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్చింది. దీంతో ఎల్ఆర్ఎస్ కోసం ఎదురు చూస్తున్న రియల్ వెంచర్ల యజమానులు, ప్లాట్లు కొన్న వారికి బిగ్ రిలీఫ్ లభిస్తుందని చెప్పొచ్చు.
This website uses cookies.