- నోటిఫికేషన్ విడుదల చేసిన హెచ్ఎండీఏ
- 44 ప్లాట్లకు డిసెంబర్ 2, 3వ తేదీల్లో వేలం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో.. బంజారాహిల్స్ లో గజం లక్ష రూపాయలు ఉండటమేమిటి? అని ప్రశ్నించిన పార్టీ.. సామాన్యులు హైదరాబాద్లో నివసించొద్దా అని నిలదీసిన పార్టీ.. ప్రస్తుతం ఉప్పల్లో ప్లాట్లను వేలం వేస్తోంది. నగరంలో ఇబ్బడి ముబ్బడిగా స్థలాల ధరలు పెరిగిన నేపథ్యంలో.. ఉప్పల్ లో ప్లాట్లను వేలంవేయడం బదులు.. సామాన్యలకు, ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగులు, జర్నలిస్టులకు..ఇలా అందరికీ ఉపయోగపడే విధంగా అందుబాటు ధరలో ఫ్లాట్లను నిర్మించి ఇవ్వొచ్చు కదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో మధ్యతరగతి, సామాన్య ప్రజానీకానికి సొంతిల్లు కొనుక్కునే పరిస్థితి కల్పించకపోతే.. మనం ఏం సాధించనట్లు? సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం హైదరాబాద్లో సొంతిల్లు కొనుక్కునే అవకాశం లేకుండా చేస్తే ఎలా? నగరం నుంచి వీరందరినీ దూరంగా తరిమి కొట్టడమే లక్ష్యంగా పని చేస్తే ఎలా?
హైదరాబాద్ లో మరోసారి ప్రభుత్వ భూముల వేలానికి రంగం సిద్ధమైంది. ఉప్పల్ భగాయత్ లో 44 ప్లాట్లకు ఈ వేలంనిర్వహించడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబర్ 2, 3వ తేదీల్లో వేలం నిర్వహించనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ కోసం నవంబర్ 30 చివరి తేదీ. గతంలో హెచ్ఎండీఏ ల్యాండ్ పూలింగ్ కింద ఉప్పల్ భగాయత్ లోరైతుల నుంచి 733 ఎకరాలు సేకరించింది. మెట్రో రైలు, ఇతర సంస్థలకు కొంత భూమిని కేటాయించిన తర్వాత 400 ఎకరాల్లో మొదటి దశలో భారీ లేఅవుట్ వేసింది. రెండో దశలో మరో 70 ఎకరాల్లో లే అవుట్ వేసింది. 2019 ఏప్రిల్ లో 67 ప్లాట్లు, అదే ఏడాది డిసెంబర్ లో 124 ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. మొత్తం 191 ప్లాట్లకు 155 అమ్ముడయ్యాయి. తద్వారా రూ.1057 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం మరికొంత స్థలాన్ని లే అవుట్ గా వేసి 44 ప్లాట్లను వేలానికి ఉంచారు. ఇందులో కనిష్టంగా 150 చదరపు గజాల నుంచి గరిష్టంగా 10 వేల గజాలు, 15 వేల గజాల ప్లాట్లు కూడా ఉన్నాయి. మొత్తమ్మీద 1.35 లక్షల చదరపు గజాల స్థలాన్ని విక్రయానికి సిద్ధం చేశారు. గతంలో గజం అత్యధికంగా రూ.82 వేలు పలకగా.. ఈసారి మరింత ఎక్కువ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చదరపు గజానికి నిర్ధారిత ధరగా రూ.35 వేలు నిర్ణయించారు. ప్రస్తుత వేలం ద్వారా రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.
సామాన్యులకు ఇళ్లు కట్టించాలి (బాక్స్)
ఉప్పల్, ఎల్ బీనగర్, వనస్థలిపురం వంటిప్రాంతాల్లో నిన్నటి వరకూ ఫ్లాట్ల ధరలు అందుబాటులో ఉండేవి. ప్రజలు రూ.35 నుంచి రూ.40 లక్షలకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కొనుక్కునేవారు. కానీ, నేడా పరిస్థితి లేనేలేదు. సామాన్యులు ఫ్లాట్లు కొనాలంటే కనీసం రూ.50 నుంచి 60 లక్షల దాకా పెట్టాల్సిందే. పోనీ, ఈ రెండు మూడేళ్లలో జీతాలు భారీగా పెరిగాయా? అంటే అదీ లేదు.మెట్రో రైలు రావడం, ఉప్పల్ లో గతంలో వేలం పాటల్ని నిర్వహించం వల్లే ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్యులు సొంతిల్లు కొనుక్కోలేని దుస్థితి ఏర్పడింది. మరి, ఇలాంటప్పుడు తెలివైన ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకోవాలి. ఉప్పల్ భగాయత్లో వేలం పాటల్ని నిర్వహించడంబదులు అందుబాటు ధరలో ఇళ్లను కట్టించాలి.