Categories: TOP STORIES

బీహార్ ను చూసి నేర్చుకోవాల్సిందే

భూముల సరిహద్దు వివాదాలను తగ్గించడానికి, భూ సర్వేలను మరింత పారదర్శకంగా నిర్వహించడానికి బీహార్ ప్రభుత్వం ఈ మ్యాపీ పేరుతో ఓ పోర్టల్ ప్రారంభించింది. భూ యజమానులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుని నిర్దేశిత ఫీజు చెల్లిస్తే చాలు.. పారదర్శకంగా సర్వే పూర్తవుతుంది. సర్వే కోసం ప్రభుత్వం నియమించే అమిన కోసం భూ యజమానులు బ్లాక్, సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదని బీహార్ మంత్రి అలోక్ కుమార్ మెహతా చెప్పారు.

భూ యజమానులు తమ భూమి వివరాలు, ఫోన్ నెంబర్ తో ఈ పోర్టల్ లో దరఖాస్తు చేసుకుంటే, సర్కిల్ ఆఫీసర్ తొలుత ఆ భూమి వివరాలను పరిశీలించి సదరు భూమికి సరిహద్దుల్లో ఉన్నవారికి నోటీసుల జారీ చేస్తారని వివరించారు. సర్వే ఏ రోజు నిర్వహిస్తున్నామో అందులో తేదీని పొందుపరుస్తారు. అనంతరం ఆ తేదీన రెవెన్యూ అధికారి భూమి కొలతలు తీసుకుంటారని.. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే సర్కిల్ ఆఫీసర్ కు తెలియజేయాలని సూచించారు. ప్లాటుకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.500, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.1000గా ఫీజు నిర్దేశించినట్టు చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియ 30 పని దినాల్లో పూర్తవుతుందన్నారు. విదేశాలలో ఉండేవారి కోసం తత్కాల్ స్కీము కూడా ప్రవేశపెట్టినట్టు మంత్రి వెల్లడించారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ప్లాటుకు రూ.1000, పట్టణ ప్రాంతాల్లో ప్లాటుకు రూ.2వేలు ఫీజుగా నిర్ణయించినట్టు తెలిపారు. ఈ పథకంలో దరఖాస్తు చేసుకున్నవారికి గరిష్టంగా ఏడు పనిదినాల్లో ప్రక్రి య పూర్తవుతుందన్నారు. చాలా అంశాల్లో ముందున్న మనం.. ఈ విషయంలో బీహార్ ను చూసి నేర్చుకోవాల్సిందేగా.

This website uses cookies.