Categories: EXCLUSIVE INTERVIEWS

కొత్త ప్ర‌భుత్వం.. స‌రికొత్త అభివృద్ధి

రియల్ ఎస్టేట్ గురుతో
ఆర్క్ గ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఎలాంటి ఢోకా లేదని, కొత్త ప్రభుత్వంలోనూ హైదరాబాద్ అభివృద్ధి కొనసాగుతుందని ఆర్క్ గ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ గురుతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘రియల్ రంగం ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఎక్కువ, ఒక్కోసారి తక్కువ ఉండొచ్చు. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా.. ఈ రంగం ఏమవుతుందో అని కొందరిలో అపోహలు ఉండొచ్చు. పాత ప్రభుత్వం హైదరాబాద్ ను గత ఎనిమిదేళ్లలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసింది. అలాగే కొత్త ప్రభుత్వం కూడా హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగం గురించి తనకంటే ఎవరికి తెలుసు అని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి గురించి ఎంతో చక్కగా వివరించారు. అందువల్ల రియల్ ఎస్టేట్ రంగానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఎక్కడైనా సరే భూమి పరిమితం. కానీ జనాభా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ విలువ పెరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఇల్లు అనేది అవసరమే.

ఓ నగరం డెవలప్ కావాలంటే అన్ని వైపులా సమానమైన అభివృద్ధి చెందాలి. కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు. హైదరాబాద్ లో వెస్ట్, సౌత్ చూస్తే భూముల ధరలు బాగా పెరిగాయి. అందుబాటు ధర లేదు. సామాన్యుడు ఇల్లు కొనే పరిస్థితి లేదు. అందుకోసమే పాలసీల్లో కొన్ని మార్పులు తేవాలి. ఔటర్ గ్రోత్ కారిడార్ ను అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరికి సొంతింటి కల సాకారమవుతుంది. అక్కడ భూముల ధరలు తక్కువగా ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ అని చెప్పినా అమలు కాలేదు. అందువల్ల ఈ ప్రభుత్వం లుక్ ఆల్ ది డైరెక్షన్స్ అమలు చేయాలి. రింగు రోడ్డు చుట్టూ మొత్తం గ్రిడ్ రోడ్లు వేస్తే అక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగి సామాన్యుడికి ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది.

ఐటీ విషయానికి వస్తే గ్రోత్ లో హైదరాబాద్ నగరం బెంగళూరును మించిపోయింది. దేశంలో ఏ నగరం చూసినా ఏదో సమస్య ఉంది. చెన్నై వరదలు, ఢిల్లీ వాయు కాలుష్యం ఇలా ఏదో ఒక సమస్య ఉంది. కానీ హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ అన్నీ బావున్నాయి. అందువల్ల ఇక్కడ ఐటీ గ్రోత్ తగ్గే పరిస్థితి లేదు. 2023లో మొదటి ఆరేడు నెలలు ఐటీ అభివృద్ధి జరిగినా.. తర్వాత కాస్త నెమ్మదించింది. ఎన్నికలు రావడం వల్లే ఆ పరిస్థితి తప్ప.. మరొకటి కాదు. అంతే తప్ప రియల్ రంగానికి ఏమీ కాదు. ఏ ప్రభుత్వమైన రియల్ రంగానికి సహకరిస్తూ ముందుకెళుతుందనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రంగంపై చాలా రంగాలు ఆధారపడి ఉంటాయి. మౌలిక వసతుల కల్పనపై కచ్చితంగా ఈ ప్రభుత్వం దృష్టి సారిస్తుందనే ఆశిస్తున్నాం. 2024లో కొత్త ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న విధానాలను మరింత బెటర్ గా చేస్తుందని ఆశిస్తున్నాం. మొత్తమ్మీద 2024 సంవత్సరం రియల్ రంగానికి బాగుంటుందని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

This website uses cookies.