వారసత్వంగా సంక్రమించిన హైదరాబాద్‌ను కాపాడుకుంటూ ఆధునిక సాంకేతిక అందిపుచ్చుకుని భవిష్యత్తు తరాలకు మెరుగైన హైదరాబాద్‌ను అందించాలన్నదే తమ లక్ష్యమని.. ప్రజల దయ, ఆశీర్వాదం ఉంటే హైదరాబాద్‌ను డెవలప్ చేసి చూపెడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. శుక్రవారం హెచ్ఐసీసీ నొవాటెల్‌లో జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మిట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం సిద్ధించిన వందేళ్ల నాటికి అనగా 2047లోపు హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యంత ప్రభావంతమైన నగరంగా అభివృద్ధి చేయాలన్నది తమ లక్ష్యమన్నారు.
2040 లోపు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలన్నారు. బడా రహదారుల్లో సైకిళ్లను వినియోగించాలని సూచించారు. మెట్రో స్టేషన్లకు 3 నుంచి 4 కిలోమీటర్ల లోపు ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచుతామని తెలిపారు. నగరంలో మరిన్ని హరిత భవనాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ఇప్పటికే ఐజీబీసీ కొంత ప్రయత్నం ఆరంభించిందని కితాబునిచ్చారు. విద్యుత్తు వినియోగాన్ని తగ్గించే నిర్మాణాల సంఖ్య హైదరాబాద్‌లో పెరగాలని అభిలషించారు. ఇప్పటికే నిర్మాణమైన కట్టడాల్లోనూ ఇంధన వినియోగం తగ్గించేందుకు ప్రాపర్టీ అధ్యయన సంస్థలు తమ వంతు కృషి చేయాలని కోరారు. హెచ్ఎండీఏ పరిధిలో 977 అర్బన్ పార్కులను డెవలప్ చేశామని వెల్లడించారు. 500, 1000 గజాలు, అర్థ ఎకరాల పార్కులను అభివృద్ధి చేయాలని సూచించారు. వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతిఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాల్ని వినియోగించాలని మంత్రి కేటీఆర్ కోరారు.
హైదరాబాద్ నగరాన్ని సేఫ్ సిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. సైబర్ నేరాల్ని తగ్గించేందుకు నల్సర్ యూనివర్శిటీతో కలిసి కఠినమైన నిబంధనల్ని రూపొందిస్తున్నామని అన్నారు. అగ్నిప్రమాదాల్ని నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని.. ఇందుకోసం ఎమర్జన్సీ సిస్టమ్‌ను మెరుగుపరుస్తామని తెలిపారు. చిన్న చిన్న గల్లీల్లో పెద్ద అగ్నిప్రమాదాన్ని నిరోధించే వాహనాలు వెళ్లలేవు కాబట్టి ఆధునిక పరికరాల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. 24/7 హైదరాబాద్‌లో స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్న లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
హైదరాబాద్ విశ్వనగరంగా మారాలంటే మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే, వచ్చే పదేళ్లలో హైదరాబాద్‌లో సుమారు 415 కిలోమీటర్ల మేరకు మెట్రో రైళ్ల నిర్మాణాన్ని చేపడతామని వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో మాత్రం 250 కిలోమీటర్ల మేరకు మెట్రో రైలును నిర్మిస్తామన్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకూ ఏర్పాటు చేసే మెట్రో రైలు టెండర్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ దాకా 26 కిలోమీటర్లు, నాగోలు నుంచి ఎల్‌బీనగర్ 5 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా 5.5 కిలోమీటర్ల మేరకు డెవలప్ చేస్తామని వెల్లడించారు. ఫేజ్ 3లో భాగంగా బీహెచ్ఈఎల్ ఓఆర్ ఆర్ నుంచి ఇస్నాపూర్, ఎల్‌బీనగర్ నుంచి పెద్ద అంబర్‌పేట్, శంషాబాద్ నుంచి కొత్తూరు మీదుగా షాద్ నగర్, ఉప్పల్ ఘట్‌కేసర్ నుంచి బీబీ నగర్ , శంషాబాద్-మహేశ్వరం-కందుకూరు, తార్నాకా- ఈసీఐఎల్, జేబీఎస్ నుంచి తూముకుంట, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ దాకా చేపడతామని తెలిపారు. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైలు వ్యవస్థను డెవలప్ చేస్తామన్నారు. ఇలా మొత్తానికి 415 కిలోమీటర్ల మేరకు మెట్రోను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్‌ను డెవలప్ చేసేందుకు కేంద్రం కొత్త చట్టం తెచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని ఏ ప్రాంతానికైనా గంటలోపు ప్రయాణం చేసేలా ర్యాపిడ్ రైలును అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు గంటన్నర లోపు వెళ్లేలా ఆర్ఆర్‌టీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసే రెండు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ర్యాపిడ్ రైలు గంటకు 120- 160 కిలోమీటర్ల స్పీడులో వెళుతుందన్నారు. హైదరాబాద్‌తో అనుసంధానంగా ఉన్న ఎనిమిది ప్రధాన రహదారుల్లో ఆర్ఆర్‌టీఎస్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. శామీర్‌పేట్ మీదుగా కరీంనగర్, ఘట్‌కేసర్ మీదుగా వరంగల్, కండ్లకోయ నుంచి నిజామాబాద్ వంటి ప్రాంతాలకు గంటలోపు వెళ్లాలి. అదే విజయవాడ అయితే గంటన్నలోపు వెళ్లగలిగేలా ర్యాపిడ్ రైలును డెవలప్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. శంషాబాద్ నుంచి మహబూబ్‌నగర్, టీఎస్‌పీఏ నుంచి వికారాబాద్, జహీరాబాద్ కు నలభై ఐదు నిమిషాల్లో వెళ్లేలా కొత్తరైలు వ్యవస్థను ఏర్పాటు చేస్తే మెరుగ్గా ఉంటుందన్నారు. ఈ వ్యవస్థను అందుబాటులోకి తెస్తే గనక తెలుగు రాష్ట్రాలకు ఒక గేమ్ ఛేంజర్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు.
This website uses cookies.