Categories: TOP STORIES

జంట‌గా లోన్ తీసుకుంటే.. ప్ర‌యోజ‌నాలేమిటి?

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. సొంతింట్లో ఉన్న సంతృప్తి అద్దె ఇంట్లో ఉండదు. స్వేఛ్చ, భద్రత, మనశ్శాంతి, బంధువుల రాకపోకలు.. ఇలా అన్ని అంశాల్లోను సొంతిట్లో ఉండే సౌలభ్యమే వేరు. అందుకే నేటితరం బ్యాంకు రుణంతో అతి త్వరగా సొంతింటి వైపు అడుగులు వేస్తొంది. అయితే ఒక్కరు కాకుండా భార్యా భర్తలు జంటగా బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కుంటే చాలా అంశాలు కలిసివస్తాయని అంటున్నారు ఆర్ధికరంగ నిపుణులు.

ఉద్యోగాలు చేసే దంపతులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కోసం ఇంట్లోనే తమకంటూ ప్రైవేటు స్థలం ఉండాలని భావిస్తున్నారు. మారుతున్న అవసరాల నేపథ్యంలో సొంతింటికి ప్లాన్‌ చేసుకునే వారు కనీసం ట్రిపుల్ బెడ్‌ రూమ్‌ ఉండాలని కోరుకుంటున్నారు. ఇల్లు విశాలంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎక్కువ మొత్తమే చెల్లించాలి. అందుకే, భార్యాభర్తలు ఇద్దరూ ఉమ్మడిగా గృహ రుణం తీసుకోవడం మంచి ఆప్షన్ అని నిపుణులు అంటున్నారు. ఒక వ్యక్తి తన తండ్రితో లేదంటే భార్యతో కలసి ఉమ్మడిగా బ్యాంకు రుణం తీసుకోవచ్చు.

తండ్రి కూడా తన కుమారుడు, పెళ్లి కాని కుమార్తెతో కలసి హోమ్ లోన్ తీసుకోవచ్చు. ఇద్దరు సోదరీమణులు, ఒక సోదరి ఒక సోదరుడు, వివాహిత అయిన కుమార్తెతో కలసి తండ్రి, స్నేహతులు ఉమ్మడిగా గృహ రుణం పొందడానికి అర్హత లేదని బ్యంకు నిబంధనలు చెబుతున్నాయి. జాయింట్‌ హోమ్‌ లోన్‌లో ప్రధాన రుణ గ్రహీత, సహ రుణ గ్రహీత ఉంటారు. బ్యాంకు రుణానికి ఇద్దరు దరఖాస్తు చేసుకుంటుంటే, ఆ ప్రాపర్టీకి ఇద్దరూ సహ యజమానులుగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒక ప్రాపర్టీకి భార్య, భర్త సహ యజమానులుగా ఉండేట‌ట్టు అయితే అప్పుడు బ్యాంకులు ఇద్దరి పేరిట జాయింట్‌ హోమ్‌ లోన్‌ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి.

జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటే ఎక్కువ మొత్తంలో రుణం లభిస్తుంది. మంచి ఖరీదైన ఇంటికి ప్లాన్‌ చేసుకునే దంపతులు ఇద్దరూ ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేస్తుంటే బ్యాంకులు పిలిచి మరీ రుణం ఇస్తున్నాయి. ఒక్కరి పేరు మీద రుణంతో పోలిస్తే ఇద్దరి పేరిట రుణం ఇవ్వడానికి బ్యాంకులు ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే ఒకరి నుంచి కాకపోయినా, మరొకరి నుంచి అయినా రికవరీ చేసుకోవచ్చన్న ధీమాతో పాటు, ఇలా జాయింట్‌ హోమ్ లోన్‌లో ఎగవేతలు చాలా తక్కువని లెక్కలు చెబుతున్నాయి.

ఒకరికి ఇబ్బందులు వచ్చినా మరొకరు ఈఎంఐ చెల్లించే అవకాశం ఉంటుంది. అందుకే బ్యాంకులకు, రుణగ్రహీతలకు ఇది అనుకూల ఆప్షన్‌ అవుతుంది. అంతేకాదు ఉమ్మడిగా గృహరుణం తీసుకుంటే.. ఇద్దరికీ ఆదాయపన్ను ప్రయోజనం ఉంటుంది. విడిగా ఎవరికి వారు ఆదాయ పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్‌ చేసుకోవాలని అనుకుంటే.. ముందుగానే ఈఎంఐలో ఎవరి వాటా ఎంతో తేల్చుకోవాలి. విడిగా ఒక్కరే గృహరుణం తీసుకుంటే, అసలు, వడ్డీకి పూర్తిగా ఆదాయపన్ను ప్రయోజనం పూర్తిగా పొందలేని పరిస్థితి ఉండొచ్చు. అటువంటప్పుడు ఇరువురు కలసి తీసుకోవడం వల్ల మిగులు ప్రయోజనాన్ని వేరొకరు సొంతం చేసుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా ఈఎంఐ వాటా మార్చుకుంటే సరిపోతుంది.

ఇంటి రుణానికి ఒక ఏడాదిలో చేల్లించే వడ్డీలో 2 లక్షల వరకు సెక్షన్‌ 24 కింద పన్ను చెల్లించక్కర్లేదు. ఇక అసలుకు చేసే చెల్లింపులు 1.5 లక్షలను సెక్షన్‌ 80సీ కింద మినహాయించి చూపించుకోవచ్చు. ఈ పరిమితి ఎవరికి వారికే విడిగా అమలవుతుంది. చాలా బ్యాంకులు మహిళా రుణ గ్రహీతలకు రుణ రేటులో కొంత తగ్గింపును ఇస్తున్నాయి. కాబట్టి భార్యా భర్తలు జంటగా హోమ్ లోన్ తీసుకుంటే ఈ ప్రయోజనం కూడా పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

This website uses cookies.