Categories: TOP STORIES

వెల్ నెస్ హోమ్స్ కు పెరిగిన డిమాండ్..

ఒకప్పుడు బడ్జెట్ ఇళ్లు.. ఆ తరువాత లగ్జరీ గృహాలు.. ఇప్పుడు వెల్ నెస్ ఇళ్ల ట్రెండ్ వచ్చేసింది. ఔను.. హోమ్ బ‌య్య‌ర్లు.. అన్ని హంగులు, సౌకర్యాలతో పాటు వెల్ నెస్ హోమ్ కావాలంటున్నారు. దీంతో డిమాండ్ మేరకు హైదరాబాద్ లో చాలామంది బిల్డర్లు వెల్ నెస్ హోమ్ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఇంతకీ వెల్ నెస్ హోమ్స్ అంటే ఏమిటీ.. మిగతా ఇంటి ప్రాజెక్టులతో పోలిస్తే వెల్ నెస్ గృహ ప్రాజెక్టులు ఎందులో స్పెషల్…

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. అందులోను నివాస సంబంధ నిర్మాణాలలో ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతోంది. ఇంటి కొనుగోలుదారుల అభిరుచి మేరకు బిల్డర్లు ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. గతంలో కేవలం బడ్జెట్ ఇళ్లు మాత్రమే నిర్మాణం జరుపుకున్న హైదరాబాద్లో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. హైరైజ్ అపార్ట్మెంట్స్ నుంచి మొదలు లగ్జరీ ఇళ్ల వరకు భారీగా నిర్మాణాలు జరుపుకుంటున్నాయి. గృహ నిర్మాణ ప్రాజెక్టులను ఒక్కో టైంలో ఒక్క థీమ్ తో చేపట్టడం హైదరాబాద్‌ మార్కెట్లో సర్వసాధారణం. ఒక్కో థీమ్‌ ఒక్కో సమయంలో ట్రెండ్ అవుతోంది. గేటెడ్ కమ్యునిటీ ప్రాజెక్టులు, కిడ్ ఫ్రెండ్లీ ప్రాజెక్టులు, రిటైర్మెంట్ హోమ్ ప్రాజెక్స్.. ఇలా చాలా థీమ్స్ తో నివాస ప్రాజెక్టులు నిర్మాణం జరుపుకున్నాయి.

హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రస్తుతం గ్రేటర్ సిటీలో వెల్ నెస్ హోమ్ ప్రాజెక్టుల ట్రేండ్ ప్రారంభమైంది. ప్రధానంగా మానసిక, శారీరక ఆరోగ్యహిత‌మైన వాతావరణం, సౌకర్యాలతో కూడిన నివాస ప్రాజెక్టులనే వెల్ నెస్ హోమ్ ప్రాజెక్టులుగా పిలుస్తున్నారు. నివాస సముదాయంలో విలాసవంతమైన సౌకర్యాలున్నా అందులో ఉంటున్న వారు ఆరోగ్యంగా లేకపోతే.. ఆ హంగులు, ఆర్భాటాలు ఎందుకన్న ఆలోచనలో ఉన్నారు చాలా మంది. అందుకే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు అనువైన వాతావరణం ఉన్న గృహ నిర్మాణ ప్రాజెక్టులను కోరుకుంటున్నారు. వీరి కోసమే హైదరాబాద్ లో చాలా మంది బిల్డర్లు వెల్‌నెస్‌ ఇళ్లను నిర్మిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి మొదలు పెద్ద వాళ్ల వరకు అహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛ‌మైన గాలి, ఫిట్ నెస్ కు కావాల్సిన ఏర్పాట్ల వంటి ఎన్నో సౌకర్యాలను వెల్ నెస్ హోమ్ ప్రాక్టుల్లో కల్పిస్తున్నారు.

ప్రధానంగా వెల్ నెస్ హోమ్ ప్రాజెక్టుల్లో పచ్చదనానికి పెద్ద పీట వేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టులో సుమారు 80 శాతం విస్తీర్ణంలో పచ్చదనంతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తున్నారు. ఇక యోగా, ధ్యానం కోసం ప్రత్యేక గది, స్పా, ఇండోర్ అండ్ ఔట్ డోర్ జిమ్, టెన్నిస్‌ కోర్టులు, జాగింగ్‌ ట్రాక్‌లు, స్మిమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్, సౌక్లింగ్ ట్రాక్ వంటివి వెల్ నెస్ హోమ్ ప్రాజెక్టుల్లో ప్రధానమైనవి. అంతే కాదు ఆర్ట్‌ స్టూడియోలు, హాబీ రూమ్స్‌, జెన్‌ గార్డెన్స్‌ను నిర్మిస్తున్నారు. ఇంట్లో చిన్నారులను సైతం దృష్టిలో పెట్టుకుని వారి కోసం ఇండోర్‌ స్టేడియం, సైకిల్‌ ట్రాక్‌, ఇంట్లో కిడ్స్ ఫ్రెండ్లీ రూమ్, టాయిలెట్‌ కమోడ్‌, పిల్లల భద్రత వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీంతో పిల్లల నుంచి మొదలు పెద్దవాళ్ల వరకు అహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూనే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని బిల్డర్లు చెబుతున్నారు. ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో సుమారు 20కి పైగా వెల్ నెల్ హోమ్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. మిగతా ఇళ్లతో పోలిస్తే వెల్ నెసె హోమ్స్ కు కొంత మేర ధర ఎక్కువైనా.. ఆరోగ్యం, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని వీటిని కొనేందుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.

This website uses cookies.