బ్రోకర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. భూముల ధరలు, స్థలాల రేట్లు పెంచుతారు. బిల్డర్లేమో ఫ్లాట్ల రేట్లను పెంచేస్తారు. అంతేతప్ప, కండ్లకోయలో ప్రస్తుతం ఐటీ పార్కు రావడం వల్ల ఒనగూడే ప్రయోజనమేమీ లేదు. ఎందుకంటే, ఆయా నిర్మాణం పూర్తయ్యి.. అందులో కంపెనీలు ఏర్పాటై.. అక్కడ ఉద్యోగులొచ్చేసరికి ఎంతలేదన్నా మరో నాలుగైదేళ్లయినా పడుతుంది. అంటే, దీర్ఘకాలంలో ప్రయోజనం అయితే ఎంతోకొంత ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.
కానీ, ఈ లోపు రియల్టర్లు ఏం చేస్తారంటే.. అక్కడేదో రాత్రికి రాత్రే అద్భుతం జరుగుతుందనే రీతిలో బిల్టప్ ఇస్తారు. అలాంటి మోసపూరిత రియల్టర్ల మాటల్ని నమ్మకండి. హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ నిర్మాణం పూర్తయ్యాక.. అక్కడ ఉద్యోగులొచ్చి.. స్థలాల ధరలు పెరిగేసరికి ఎంతలేదన్నా ఐదారేళ్లు పట్టింది. మరికొన్ని సంస్థలు ఐటీ సముదాయాల్ని కట్టడంతో మరికొంత సమయం పట్టింది. ఆతర్వాతే ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు మాదాపూర్ బాట పట్టారు. కాబట్టి, కండ్లకోయలో ఐటీ పార్కు వచ్చిందని చెప్పగానే.. ఎవరైనా ఎక్కువ రేటుకు ప్లాట్లు, ఫ్లాట్లు అమ్మడానికి విక్రయిస్తే పట్టించుకోకపోవడమే ఉత్తమం.
దుండిగల్‌లో ఐటీ పార్కు వస్తుందనే ప్రచారం ఇప్పటికే జోరుగా జరుగుతోంది. కండ్లకోయ ఐటీ పార్కు శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దుండిగల్ వంటి ప్రాంతాల్లో ఐటీ పార్కు ఏర్పాటు చేయడాన్ని ప్రస్తావించారు. దీంతో, ఒక్కసారిగా రియాల్టీ బ్రోకర్లకు మంచి అవకాశం లభించినట్లయ్యింది. దుండిగల్‌లో ఐటీ పార్కు వస్తుందంటూ ప్రచారం చేస్తూ.. ఇప్పటికే బ్రోకర్లు రియల్ దందా చేస్తున్నారు. తాజాగా, కేటీఆర్ ప్రకటనతో వీరికి మరింత ఊతం లభించింది.
మరి, దుండిగల్‌లో ఐటీ పార్కు ఎప్పుడొస్తుందో తెలియదు కానీ దాన్ని పేరు చెప్పుకుని ఈ బ్రోకర్లు భూముల రేట్లను పెంచేస్తారు. కాబట్టి, అలాంటి వాటిలో కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి కొనుగోలు చేయాలి. రాత్రికి రాత్రే రేట్లు పెంచేస్తే మాత్రం క్షుణ్నంగా ఆలోచించాకే అడుగు ముందుకేయాలి. ఎందుకంటే, గత కొంతకాలం నుంచి మార్కెట్లో ఫ్లాట్ల అమ్మకాలు తగ్గాయి. నగరంలో పెరిగిన స్థలాలు, ఫ్లాట్ల ధరల్ని చూసి ఇల్లు కొనడాన్ని కొంతకాలం వాయిదా వేస్తున్నారు.
This website uses cookies.