తెలంగాణ రియల్టర్ల డిమాండ్
దేశవ్యాప్త ప్రజల దృష్టి ప్రస్తుతం హైదరాబాద్ మీద కేంద్రీకృతమైంది. నగరంలోని హెచ్ఐసీసీలో బీజేపీ పార్టీ సమావేశం జరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ కార్యక్రమానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరవుతారు. ఆయన ఇక్కడే నోవాటెల్‌లో బస చేస్తారు. సుమారు రెండు రోజుల పాటు నగరంలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ బీజేపీ పార్టీ వైఖరిని చెప్పాలని డిమాండ్ చేస్తోంది. రియల్టర్లతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలియజేసింది. వీటికి పరిష్కారాల్ని చూపెట్టాలని కోరుతోంది.
- తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు దాదాపు 26 లక్షల మంది ఉన్నారు. కాబట్టి, వెంటనే ఈ ఎల్ఆర్ఎస్ ని రద్దు చేయాలి. రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలి.
- దాదాపు పది లక్షల మంది రైతులు ధరణి పోర్టల్ వల్ల రకరకాల సమస్యలను బాధపడుతున్నారు. కాబట్టి, ధరణి పోర్టల్‌ని వెంటనే రద్దు చేయాలి.
- సాదా బైనామాలు ఉండి భూమి దున్నుకుంటున్న లక్షల మంది రైతులు ఉన్నారు. వారి పేర్ల పై ఫీజు లేకుండా భూమిని మార్చాలి.
- గ్రామ పంచాయితీ లేఅవుట్ల లోని ప్లాట్లను ( కొత్తవి) రిజిస్ట్రేషన్ చేయాలి, ఎల్ఆర్ఎస్ లేని గ్రామ పంచాయితీలోని ప్లాట్ల కు ఇండ్లు కట్టు కోవడానికి అనుమతినివ్వాలి.
- 25 లక్షల అసైన్డ్ భూమి సుమారు 15 లక్షల మంది రైతుల చేతిలో ఉంది. వారికి శాశ్వత హక్కు అంటే అమ్ముకునే హక్కునివ్వాలి.
- పోడు భూములకు పట్టాలివ్వాలి.
- 60 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు, రాష్ట్రం లో పంట పండించేది వారే. కాబట్టి, వారి కష్టానికి తగిన ఫలితం లభించడం లేదు. అందుకే, వారికేం సహాయం చేస్తారో తెలియజేయాలి.
- రాష్ట్రంలో 12 లక్షల మంది రియల్టర్లున్నారు. వారికి గుర్తింపును ఇవ్వాలి, ప్రతి జిల్లాకు రియల్ ఎస్టేట్ భవనం కట్టు కోవడానికి భూమి కేటాయించాలి.