హెచ్ఎండీఏ అంటే అందరికీ ఒక నమ్మకం. వారి వద్ద కొంటే, ఆయా భూముల్లో న్యాయపరంగా ఎలాంటి వివాదాలు ఉండవనే భరోసా. అందుకే, చాలామంది హెచ్ఎండీఏ వద్ద వేలం పాటల్లో కొనేందుకు వేలంవెర్రిలా ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో కొందరు తొర్రూరు వెంచర్ చూద్దామని వెళ్లి షాక్ అయ్యారు. అక్కడ రాళ్లు, రప్పలు తప్ప లేఅవుట్‌ని అభివృద్ధి చేయలేదు. రహదారులు కూడా వేయలేదు. అసలు ఎలాంటి డెవలప్‌మెంట్ పనుల్ని చేయకుండా.. ఎలా వేలం వేస్తున్నారని ప్రజలు విస్తుపోతున్నారు. హెచ్ఎండీఏకి, ఇతర ప్రైవేటు సంస్థల మధ్య తేడా ఏముందని ప్రశ్నిస్తున్నారు. హెచ్ఎండీఏ చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారమా? అని నిలదీస్తున్నారు.
సాధారణంగా హెచ్ఎండీఏ అనగానే రహదారులన్నీ అభివృద్ధి చేస్తే.. ప్లాట్లను మార్కింగ్ చేసి.. ఎక్కడిక్కడ ఎమినిటీస్‌కు స్థలం కేటాయించి.. ఒక ప్రణాళికాబద్ధంగా వెంచర్‌ను అభివృద్ధి చేసి అమ్ముతారని ఆశించిన ప్రజలకు తొర్రూరు లేఅవుట్ స్థలం చూడగానే ఆశ్చర్యపోయారు. యూడీఎస్, ప్రీలాంచులు చేసే వారి వద్ద కొనకూడదని నిర్మాణ సంఘాలు చెబుతున్నాయి.
మరి, హెచ్ఎండీఏ చేసేదేమిటని ప్రజలు నిలదీస్తున్నారు. ఎవరైనా ప్రైవేటు రియల్టర్ హెచ్ఎండీఏ వద్ద ప్రాథమిక అనుమతి తీసకుని.. లేఅవుట్ మొత్తం డెవలప్ చేశాక.. తుది అనుమతి కోసం వెళితే.. సరిహద్దు రాళ్లు సరిగ్గా లేవనో.. మరే ఇతర చిన్న చిన్న కారణాలు చూపిస్తు.. తుది అనుమతిని మంజూరు చేయట్లేదు. అలాంటిది, ప్రస్తుతం హెచ్ఎండీఏ చేస్తోందేమిటి? రెండు, మూడు నెలల పాటు లేఅవుట్‌ని పూర్తిగా అభివృద్ధి చేశాక.. వేలం పాట వేయొచ్చు కదా.. అప్పుడే అంత తొందరేమొచ్చిందంటూ నిలదీస్తున్నారు.
హెచ్ఎండీఏ అలా రైతుల్నుంచి భూముల్ని తీసుకుని.. ఇలా వేలం వేయడమేమిటి? వేలం పూర్తయ్యాక ఎన్నేళ్ల తర్వాత ఆయా లేఅవుట్లను డెవలప్ చేస్తారు? అందుకెంత సమయం తీసుకుంటారు? కాబట్టి, ఇకనైనా వేలం వేసే ముందు.. లేఅవుట్లను పూర్తిగా డెవలప్ చేయాలి. అప్పుడే, ప్రజలు హర్షిస్తారు. లేకపోతే ప్రైవేటు రియల్టర్లకు, హెచ్ఎండీఏకు పెద్ద తేడా ఉండదు.