హైదరాబాద్‌లో బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాల సంఖ్య గణనీయంగా పెరిగింది. వెస్ట్ హైదరాబాద్‌లోని కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రాం గూడ, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో గత మూడు నాలుగేళ్లలో అధికమయ్యాయి. అయితే, కువైట్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో.. కొనుగోలుదారుల ఆలోచన ఒక్కసారిగా మన బహుళ అంతస్తుల మీద పడింది. మన నగరంలో నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాలు.. అగ్నిప్రమాదాల్ని నిరోధించేందుకు పటిష్టమైన చర్యల్ని తీసుకుంటున్నాయా? ముఖ్యంగా స్కై స్క్రేపర్లలో ఎలాంటి డోర్లను వినియోగించాలి? అగ్నిప్రమాదం వ్యాపించకుండా ఉండేందుకు నేషనల్ బిల్డింగ్ కోడ్ 2016 ప్రకారం ఎలాంటి డోర్లను వాడాలో ఇప్పుడు తెలుసుకుందామా
అగ్గి అనేది సోషలిజం లాంటిది. దీనికి తమపర అనే భేదాలుండవు. ఒక్కసారి అగ్గి రాజుకుందంటే దానిని ఆర్పేంత వరకూ తన పవరేంటో చూపిస్తుంది. అందుకే, అపార్టుమెంట్లలో అగ్నిప్రమాదాల్ని సంభవించకుండా బిల్డర్లు ఎక్కడ్లేని జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాల నిర్మాణం హైదరాబాద్‌లో అధికంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో.. ఫ్లాట్లను కొనుగోలు చేసేవారు.. అగ్ని ప్రమాదాల నివారణ గురించి బిల్డర్లు తీసుకునే జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఫ్లోరింగ్ ఎలా చేస్తున్నారు? ఏయే ఎమినిటీఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు వంటి అంశాలే కాకుండా.. అగ్నిప్రమాదాల్ని నిరోధించేందుకు ఎలాంటి తలుపుల్ని వినియోగిస్తున్నారనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఈ క్రమంలో నేషనల్ బిల్డింగ్ కోడ్ 2016 ప్రకారం.. బహుళ అంతస్తుల భవనాల్లో ఎలాంటి తలుపుల్ని వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్‌బీసీ 2016 కోడ్ ప్రకారం.. బహుళ అంతస్తుల భవనాల్లో.. ఇన్సులేటెడ్ & అన్-ఇన్సులేటెడ్ డోర్లుగా విభజించారు. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఫైర్ రేటెడ్ డోర్లను వినియోగించాల్సిందే. మీరు హై రైజ్ బిల్డింగ్స్‌లో ఫ్లాట్ కొనడానికి వెళ్లినప్పుడు ఫైర్ రేటెడ్ డోర్లను వినియోగిస్తున్నారా? లేదా? అని తప్పకుండా తెలుసుకోండి. ఒకవేళ రెరా చట్టం ప్రకారం.. అగ్రిమెంట్‌లో ఫైర్ రేటెడ్ డోర్లు అని మీరు చెప్పకపోయినా.. కొనుగోలుదారుల భద్రత దృష్ట్యా ఫైర్ రేటెడ్ డోర్లను వినియోగించేందుకు ప్రయత్నం చేయండి.
ఎగ్జిట్ ఎగ్రెస్‌లోని అన్ని తలుపులు ఇన్సులేటెడ్ ఫైర్ డోర్స్‌గా ఉండాలి, అంటే 30 నిమిషాల థర్మల్ ఇన్సులేషన్‌తో 120 నిమిషాల ఫైర్ రేటింగ్‌ని కలిగి ఉండాలి.
120 నిమిషాల ఫైర్ డోర్ కోసం కనిష్ట షీట్ మందం ఫ్రేమ్‌లు & షట్టర్ రెండింటికీ 1.2 మిమీ మందం కలిగి ఉండాలి
ఎగ్జిట్ ఇగ్రెస్‌లో.. ఇన్సులేటెడ్ ఫైర్ డోర్ కోసం గరిష్ట విజన్ ప్యానెల్ పరిమాణం 0.06 చదరపు మీటర్ ఉండాలి.
అన్-ఇన్సులేటెడ్ డోర్ కోసం 0.12 చదరపు మీటర్ ఉండటం తప్పనిసరి. అద్దాలు కూడా ఫైర్ రేటింగ్ ఉండాలి. అంతేతప్ప ల్యామినేటెడ్, ఇంటర్ లేయర్డ్ వంటివి వాడకూడదు.
అన్ని అగ్ని తలుపులకు మూడు వైపులా స్మోక్ డిటెక్టర్లను తప్పనిసరిగా పొందుపర్చాలి.
అగ్నిమాపక తలుపుపై తయారీదారు, డోర్ రకం, అగ్నిమాపక రేటింగ్, డోర్ సీరియల్ నెంబర్, తయారీ సంవత్సరం, సర్టిఫికేట్ రిఫరెన్స్ నంబర్ సమాచారాన్ని అందించే సరైన లేబుల్‌లు తప్పనిసరిగా ఉండాలి.
లాచ్డ్ కండిషన్‌లో పరీక్షించిన డోర్‌లను అసలు సైట్ కండిషన్‌లో అన్‌లాచ్డ్ డోర్‌లతో (డెడ్‌బోల్ట్ & హ్యాండిల్) భర్తీ చేయడం సాధ్యం కాదు. లాచ్డ్ మరియు అన్‌లాచ్డ్ డోర్‌ల కోసం స్వతంత్ర పరీక్ష అవసరం.
పరీక్ష సర్టిఫికేట్ లేదా నివేదిక యొక్క చెల్లుబాటు డోర్ పరీక్ష తేదీ నుండి గరిష్టంగా 5 సంవత్సరాలు ఉండాలి.
డోర్ తయారీదారు మొత్తం అసెంబ్లీకి బాధ్యత వహించాలి అంటే డోర్, హార్డ్‌వేర్ మరియు సరఫరా ఒక యూనిట్‌గా ఉండాలి.