హెచ్ఎండీఏకు వెళ్లి డైరెక్టర్ బాలకృష్ణను ప్రసన్నం చేసుకుంటే చాలు.. ఎలాంటి ప్రాజెక్టుకైనా అనుమతి లభిస్తుందనేది బహిరంగ రహస్యం. ఈ విషయాన్ని సాక్షాత్తు పురపాలక శాఖ సిబ్బంది స్వయంగా చెబుతుంటారు. ఇక బాలకృష్ణ ఉన్నాడంటే అధిక శాతం మంది రియల్టర్లు తడిగుడ్డ వేసుకుని పడుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి ప్రాజెక్టుకైనా అనుమతిని ఇప్పించగల తెలివితేటలున్న అధికారి అని డెవలపర్లే స్వయంగా అంగీకరిస్తారు. చట్టంలోని లొసుగుల్ని ఆధారం చేసుకుని.. అనుమతి రాని అపార్టుమెంట్లకు సైతం అనుమతిని ఇప్పించడంలో దిట్ట అని పురపాలక శాఖ సిబ్బంది తరుచూ చెప్పుకుంటారు. ఎందుకంటే, ఎలా దరఖాస్తు చేసుకుంటే ప్రాజెక్టుకు అనుమతి వస్తుందో ఆయనే స్వయంగా చెప్పేవాడు. అందుకు తగ్గ బహుమానాన్ని కూడా అందుకునేవాడనేది అందరికీ తెలిసిందే.
బాలకృష్ణ డెవలపర్లతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడంటే.. ఎవరైనా బడా కంపెనీల నుంచి బిల్డర్లు సచివాలయానికి వస్తుంటే.. ఆయనే స్వయంగా వాళ్లకు గేట్‌పాసు కూడా పంపిస్తాడు. అంత సరదాగా బిల్డర్లతో ఉండే వ్యక్తి.. అటు పురపాలక శాఖ ఇటు హెచ్ఎండీఏ.. రెండింటికీ ఆయనే డైరెక్టర్ కావడం పూర్తిగా కలిసొచ్చింది. పైగా, అతని మీదే మాజీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పూర్తిగా ఆధారపడటంతో.. ఇక బాలకృష్ణ అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. ఒకానొక దశలో మాజీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఇతని మీద పూర్తిగా అసంతృప్తితో ఉండేవాడని సమాచారం. అయినా, అనుభవజ్ఞుడు కావడంతో అతన్ని కొనసాగించేవారు. దీంతో, బాలకృష్ణ ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది.
* వాస్తవానికి, అతని మీద ఏసీబీ దాడులు గతంలో జరుగుతాయని పురపాలక శాఖ మొత్తం కోడై కూసింది. కాకపోతే, అప్పటి ప్రభుత్వం మీద మచ్చ వస్తుందనే ఉద్దేశ్యంతో.. అందుకు అనుమతించలేదని సమాచారం. ఏదీఏమైనప్పటికీ, ఆయన ఎప్పుడు నేరుగా లంచాలు తీసుకునేవాడు కాదు. కాకపోతే, ఇంటికి వెళ్లేటప్పుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లోని కేబీఆర్ పార్కు వద్ద.. ఆయన్నే దూరం నుంచి కార్ లాక్ తెరిస్తే.. ఆయనకు సొమ్ము ఇచ్చేవారు నేరుగా కారులో పెట్టి వెళ్లిపోయే వారిని రియల్టర్లు బాహాటంగానే చెప్పుకుంటారు. మొత్తానికి, ఆయనపై ఏసీబీ దాడి వల్ల గత ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ బయటికొచ్చే అవకాశముందని సమాచారం. పురపాలక శాఖతో పాటు హెచ్ఎండీఏలో అక్రమాలు చేసిందెవరు? ఏయే జీవోలను ఎలా మార్చారు? వాటిని ఎవరికి ప్రయోజనం కలిగించేందుకు మార్చివేశారు? ఏయే రియల్టర్ల నుంచి విల్లాలు, ఖరీదైన ఫ్లాట్లను బహుమతిగా తీసుకున్నారు? ఇలాంటి అనేక విషయాలు ఆయన్ని లోతుగా విచారిస్తే తెలుస్తుందని పురపాలక శాఖ సిబ్బంది స్వయంగా చెబుతున్నారు. మొత్తానికి, జీహెచ్ఎంసీలో చీఫ్ సిటీ ప్లానర్‌గా పని చేసిన రఘును మించిపోయి అక్రమాస్తుల్ని సంపాదించాడా? లేదా? అనే విషయం త్వరలో తేలుతుంది.
This website uses cookies.