- ఎత్తుగా కడితే ఎవరికి ఉపయోగం?
- కొన్ని ప్రాంతాల్లోనే ఆకాశహర్మ్యాలకు
అనుమతిని మంజూరు చేయాలి - ఆవేశంగా ఆరంభించి.. అవి పూర్తి కాకపోతే
అందులో కొన్నవారికి తప్పవు తిప్పలు! - ఘోస్ట్ టవర్లుగా మిగిలిపోయే ప్రమాదం
నిన్నటివరకూ.. నానక్ రాంగూడ ఓఆర్ఆర్ చౌరస్తాలో.. శ్లాబులు వేసి ఒక బడా నిర్మాణం ఖాళీగా కనిపించేది. కొన్ని నెలల పాటు ఆయా నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేకుండా.. కేవలం టవర్లు మాత్రం దర్శనమిచ్చేవి. మళ్లీ ఏమైందో తెలియదు కానీ, ఈమధ్యే ఎలివేషన్ పనులు ఆరంభించారు. కోర్ ఏరియాలో ఉన్న ఐటీ, వాణిజ్య సముదాయాల్ని నిర్మిస్తారు కాబట్టి, పెట్టుబడిదారులకు కొదవ ఉండకపోవచ్చు. కానీ, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న రెసిడెన్షియల్ ప్రాంతాల్లో.. నలభై, యాభై అంతస్తులు కట్టడం ఎంతవరకూ సమంజసం? ఆర్థిక మాంద్యం బుసలు కొడుతున్న నేపథ్యంలో.. అనువు కాని చోట ఆకాశహర్మ్యాల్ని కడితే ఎలా?
రాష్ట్రంలో ఉన్న అపరిమిత ఎఫ్ఎస్ఐ నిబంధన కారణంగా.. కొందరు స్థల యజమానులు గొంత్తెమ్మ కోరికలు కోరుతుండటంతో ప్రొఫెషనల్ డెవలపర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. పది అంతస్తులు కట్టే చోట ఇరవై అంతస్తులు.. పదిహేను అంతస్తులు నిర్మించే చోట 30 నుంచి నలభై అంతస్తుల్ని కట్టాలని కండీషన్లు పెడుతున్నారు. అధిక ఎస్ఎఫ్టీ కట్టాలంటూ పట్టుబడుతున్నారు. దీంతో సందిట్లో సడేమియాలా కొందరు నడిమంత్రపు వ్యక్తులు.. బిల్డర్లుగా అవతారం ఎత్తి.. స్థలయజమానుల డిమాండ్లను తీరుస్తామంటూ ఫోజులు కొడుతూ.. ముప్పయ్ నుంచి యాభై అంతస్తులు కట్టేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఇలాంటి వారే ఎక్కువగా యూడీఎస్, ప్రీలాంచ్ స్కీములను ప్రకటిస్తూ.. సరికొత్త స్కాములకు తెరలేపుతున్నారు. నగరం నాలుగు వైపులా స్థలం కొరతే లేని హైదరాబాద్‌లో.. నలభై, యాభై అంతస్తులు కట్టడమేమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల భాగ్యనగరంలోని మౌలిక సదుపాయాలపై ఎక్కడ్లేని ఒత్తిడి పడుతుందని అభిప్రాయపడుతున్నారు.
భాగ్యనగరం అంతర్జాతీయ నగరాల సరసన నిలబడాలంటే.. నగరంలో ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులు రావాల్సిందే. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. కాకపోతే పది, పదిహేను అంతస్తుల అపార్టుమెంట్లు కట్టాల్సిన ప్రాంతంలో.. ముప్పయ్, నలభై అంతస్తుల అపార్టుమెంట్లు కట్టడమే తప్పని నిపుణులు అంటున్నారు. తమ స్వలాభం కోసం కొందరు స్థలయజమానులు, మరికొందరు డెవలపర్లు కలిసి.. గిరాకీ పెద్దగా లేని చోట కూడా ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తుండటం దారుణమన్నారు. దీని వల్ల వీరు తాత్కాలికంగా కొంత సొమ్ము సంపాదించొచ్చు. కాకపోతే, ఆయా ప్రాంతంలో మౌలిక సదుపాయాల గురించి ఆలోచించి ప్రణాళికలను రచించాలని సూచిస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్, పచ్చదనం వంటి అంశాల్ని బేరీజు వేసుకున్నాకే.. ఆకాశహర్మ్యాల గురించి ఆలోచించాలి. అంతేతప్ప, స్థలం దొరికింది కదా అని.. అధిక బిల్టప్ ఏరియా కోసం.. ముప్పయ్, నలభై అంతస్తుల అపార్టుమెంట్లను ఆరంభిస్తే.. వాటిని పూర్తి చేయలేక నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పైగా అనువు కాని చోట ఎంత ఎత్తుకు వెళితే, అంత నిర్మాణ వ్యయం పెరుగుతుంది. అమ్మకాల్లేనప్పుడు అంతంత ఎత్తులో కట్టడం తలకు మించిన భారమవుతుంది. ఆయా ప్రాజెక్టును మధ్యలో నిలిపివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.