ఖరీదైన ఫ్లాట్లలో నివసించడం ఎందుకు..
డబ్బులు ఎంతయినా ఫర్వాలేదు..
బడా సైజులో విల్లాను కొనుక్కుందాం..
ఎంచక్కా కలకాలం సంతోషంగా నివసిద్దాం..
నిన్నటి వరకూ ఇలాగే భావించారా కొనుగోలుదారులు.. మోకిలాలో ముచ్చటైన విల్లాల్ని మాత్రమే చూశారు తప్ప.. మూసీ పరివాహక ప్రాంతంలో కొంటున్నామనే విషయాన్ని తెలుసుకోలేకపోయారు. కొందరికి తెలిసినా.. మూసీ ఉగ్రరూపాన్ని ఎప్పుడూ చూడలేదు. కొద్ది రోజుల క్రితం కాస్త వర్షం పడగానే.. జంట రిజర్వాయర్ల గేట్లు ఎత్తివేశారు. ఫలితంగా, మోకిలాలోని ఖరీదైన లా పలోమా విల్లాస్ కమ్యూనిటీ
కాస్త గోదారిని తలపించింది. ఇదొక్కటే కాదు.. మూసీ పరివాహక ప్రాంతంలో కట్టిన కొన్ని విల్లాలు, అపార్టుమెంట్లు, ఇంజినీరింగ్ కాలేజీలు, రిసార్టులు మూసీ నీళ్లతో నిండిపోయాయి.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో అనేక మంది డెవలపర్లు.. స్థానిక సంస్థల్ని ఏదో రకంగా మచ్చిక చేసుకుని.. అమ్యామ్యాల్ని అందజేసి.. కాస్త ఖరీదైన లగ్జరీ విల్లాల్ని, అపార్టుమెంట్లను నిర్మించారు. రిసార్టులను అభివృద్ది చేశారు. వాటిని పెద్ద సైజుల్లో నిర్మించి.. బడా బాబులకు విక్రయించారు. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు.. జంట రిజర్వాయర్ల గేట్లను ఎత్తివేయడంతో.. మూసీ ప్రవాహానికి అడ్డుగా, దానికి పక్కనే ఎఫ్‌టీఎల్ భూముల్లో కట్టిన కొన్ని గేటెడ్ కమ్యూనిటీలన్నీ ఒక్కసారిగా మునిగిపోయాయి. కొద్దిపాటి వర్షానికే విల్లాలు, అపార్టుమెంట్లలోకి నీరు వస్తే.. కాస్త బడా వర్షం కురిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది?
ప్రభుత్వం ఎంతో తెలివిగా 111 జీవోలో కొన్ని పేరాలను ఇటీవల మార్చి వేసి చేతుల్ని దులిపేసుకుంది. కొత్త జీవోను విడుదల చేసింది. ఇక, మూసీ పరివాహక ప్రాంతాల్లో కొత్త కట్టడాలకు అనుమతినిస్తే.. అవన్నీ నీట మునగడం ఖాయమని కచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి, మూసీ ప్రవహించే ప్రాంతంలో అత్యాశతో పలువురు బిల్డర్లు కట్టే విల్లాలు, అపార్టుమెంట్లలో ఎట్టి పరిస్థితిలో కొనుగోలు చేయవద్దు. అవి తక్కువ రేటుకు వచ్చినా అస్సలు తీసుకోవద్దు. పర్యావరణం అంటే ఏమాత్రం ప్రేమ ఉన్నవారు ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాల్లో కట్టే విల్లాలు, ఫ్లాట్లను కొనుగోలు చేయకూడదు.
This website uses cookies.