కింగ్ జాన్సన్ కొయ్యడ : కోకాపేట్‌లో వేలం రికార్డుల మోత మోగించింది. నియోపోలిస్ ఫేజ్-2లో గల 3.6 ఎకరాల ప్రైమ్ ప్లాట్‌ను హ్యాపీ మొబైల్స్ కంపెనీ సొంతం చేసుకుంది. వేలంలో పోటీ పడి.. ఎకరానికి రూ.100 కోట్లు పెట్టి ఈ ప్లాటును కొనుగోలు చేసింది. తర్వాత ఈ భూమిని నగరానికి చెందిన రాజపుష్ప ప్రాపర్టీస్‌కు డెవలప్‌మెంట్ నిమిత్తం అందజేస్తారని సమాచారం. అయితే, రాజపుష్ప సంస్థ అభివృద్ధి చేయడానికి ముందుకొస్తేనే.. వేలంలో పాల్గొంటామని సదరు మొబైల్ సంస్థ ముందే చెప్పినట్లు సమాచారం. దీనికి రాజపుష్ప సంస్థ అంగీకరించడంతోనే వేలంలో పాల్గొన్నదని తెలిసింది.
అసలీ ప్లాటుకు ఎందుకు అంత ధర పెట్టాల్సి వచ్చిందనే అంశాన్ని పరిశీలిస్తే.. ఈ 3.6 ఎకరాల చిన్న ప్లాటుకు సరిగ్గా గండిపేట్ లేక్ వ్యూ ఉండటమే ప్రధాన కారణం. అందుకే వేలంలో ఒక్కసారిగా పోటీ పెరిగింది. అయినా, సదరు మొబైల్ సంస్థ తగ్గేదేలేదంటూ ఎకరానికి రూ.100 కోట్లు పెట్టి ఎట్టకేలకు సొంతం చేసుకుంది. మరి, ఇంత సొమ్ము పెట్టి కొన్న స్థలంలో ఏం కడతారనే సందేహం ప్రతిఒక్కరికీ కలగడంలో సందేహం లేదు. కోకాపేట్లోని నియోపోలిస్ ఫేజ్ 2 ప్రాంతం చూడటానికి భలే ఆకర్షణీయంగా కనిపిస్తుందనే విషయం తెలిసిందే. ఇక్కడ్నుంచి ఉస్మాన్ సాగర్ ఎంతో చక్కగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ కొనుగోలు చేసిన 3.6 ఎకరాల్లో ఎంతలేదన్నా 200కు పైగా ఫ్లాట్లను కట్టే అవకాశముంది. టవర్ల విస్తీర్ణం దాదాపు యాభై అంతస్తుల దాకా ఉంటుందని అంచనా. ఒక్కో ఫ్లాటు విస్తీర్ణం దాదాపు పది వేల చదరపు అడుగుల దాకా ఉంటుందని సమాచారం.
This website uses cookies.