poulomi avante poulomi avante

111 జీవో ఎత్తివేస్తే.. ప్లాట్ల ధరలు తగ్గుతాయ్‌!  

  • సీఎం ప్ర‌క‌ట‌నపై ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు విస్మ‌యం
  • నీటి ప్ర‌వాహాన్ని అడ్డుకునే అంశంపై
  • సుప్రీం కోర్టు అనేక తీర్పుల్ని ఇచ్చింది
  • అభివృద్ధిలో రైతుల్ని భాగ‌స్వామ్యుల్ని చేయ‌లేదు
  • జీరో ఎమిష‌న్‌, జీరో గ్రావిటీతో నీటి స‌ర‌ఫ‌రా
  • ఇందుక‌య్యే ఖ‌ర్చు కేవ‌లం ఐదు పైస‌లే
  • ప్ర‌పంచంలోనే ఇది అరుదైన ఘ‌న‌త‌
  • ప్ర‌క‌ట‌న‌పై 84 గ్రామాల రైతులు ఆనందం
  • ఒక‌వేళ ఎత్తివేస్తే.. అక్క‌డ రేట్లు పెరిగే అవ‌కాశం
  • మిగ‌తా ప్రాంతాల్లో మాత్రం ధ‌ర‌లు త‌గ్గుముఖం

కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌:

వీడికి గండిపేట్ నీళ్లు ప‌డ్డ‌య్‌..

భాగ్య‌న‌గ‌రానికి కొత్త‌గా ఎవ‌రొచ్చినా.. వారికి ఇక్క‌డి నీళ్లు అల‌వాటు అయ్యాయ‌ని.. వారి రంగు కూడా కొంత మారింద‌ని.. చాలామంది గ‌తంలో అనుకునేవారు. 1908లో వరదలు రావడంతో సుమారు 15 వేల మంది మరణించారు. దీంతో, జంట రిజర్వాయర్ల నిర్మాణాన్ని మోక్షగుండం విశ్వేశరయ్య చేపట్టారు. అప్ప‌ట్నుంచి కృష్ణా నీళ్లు రానంత‌వ‌ర‌కూ హిమాయ‌త్ సాగ‌ర్‌, ఉస్మాన్ సాగ‌ర్లే భాగ్య‌న‌గ‌రం దాహార్తిని తీర్చాయి. అందుకే, అవి హైద‌రాబాద్ బ్రాండ్ గా.. న‌గ‌రానికే స‌రికొత్త షాన్ గా అవ‌త‌రించాయి. ఫిబ్రవరి 26న నదుల మీద జాతీయ సదస్సు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం, నీటి వనరుల్నిపెంపొందించ‌డానికి ప్రయత్నిస్తామని చెప్పిన రెండు వారాలకే జీవో 111ను ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించ‌డం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హైద‌రాబాద్‌కి షాన్ అయిన గండిపేట్ నీళ్లు నిజంగానే అక్క‌ర్లేదా? రియ‌ల్ ఎస్టేట్ మాఫియా కోస‌మే ట్రిపుల్ వ‌న్ జీవోను ఎత్తివేస్తున్నారా? ట్రిపుల్ వ‌న్ జీవో ఎత్తివేత ప్ర‌క‌ట‌న వ‌ల్ల ప్లాట్ల ధ‌ర‌లు త‌గ్గుతాయా?

ట్రిపుల్ వ‌న్ జీవో ఎత్తివేత‌కు సంబంధించిన కొంద‌రు ప్రముఖులు ప్ర‌త్యేక‌ చ‌ర్చా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఇందులో పాల్గొన్న డాక్ట‌ర్ సుబ్బారావు మాట్లాడుతూ.. మ‌న ప్ర‌ధాన‌మంత్రి ప్యారిస్ అగ్రిమెంట్ మీద సంతకం చేసి 35 శాతం ఎమిష‌న్స్ త‌గ్గ‌స్తామ‌న్నార‌ని.. దేశంలో క్లైమెట్ ఫ్రెండ్లీ వాతావ‌ర‌ణం ఏర్పాటు చేస్తామ‌ని అన్నార‌ని తెలిపారు. మ‌న ఉస్మాన్ సాగ‌ర్‌, హిమాయ‌త్ సాగ‌ర్‌లు.. ఎలాంటి ఎమిష‌న్స్ లేకుండా.. నాలుగు ల‌క్ష‌ల కుటుంబాల‌కు మంచినీరును అందిస్తున్నాయని వివ‌రించారు. ఈ రిజ‌ర్వాయ‌ర్లు జీరో ఎమిష‌న్ క్లైమెట్ ఫ్రెండ్లీ అర్బ‌న్ వాట‌ర్ సిస్ట‌మ్ అని.. ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి తీసుకెళ్లాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌పంచంలో ఎక్క‌డా కేవ‌లం ఐదు పైస‌ల‌కే మంచినీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్న జ‌లాశ‌యాలు లేవ‌ని వివరించారు. భూముల ధ‌ర‌లు పెరిగాయ‌ని వంద రూపాయిలు పెట్టి బాటిల్ నీరు కొంటామా? అని విమ‌ర్శించారు.

2000 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు..

హిమాయ‌త్ సాగ‌ర్‌, ఉస్మాన్ సాగ‌ర్ ప‌రివాహ‌క ప్రాంతాల్ని క‌లుషితం కాకుండా చేసేందుకే 111 జీవోను తీసుకొచ్చార‌ని నిపుణులు అంటున్నారు. వీటి ప‌రివాహ‌క ప్రాంతాలైన‌.. శంషాబాద్, మొయినాబాద్, షాబాద్, శంకర్ పల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ల మండలాల్లోని 84 గ్రామాల పరిధిలోని దాదాపు 1.32 లక్షల ఎకరాల స్థలంలో.. 68 కాలుష్య పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, బహుళ అంతస్తుల భవనాల్ని నిర్మించడం నిషేధించారు. వాస్త‌వానికి, దీన్ని మొత్తం క్యాచ్‌మెంట్ ఏరియా దాదాపు రెండు వేల చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు. ప్ర‌స్తుతం కేవ‌లం ప‌ది కిలోమీట‌ర్ల మీద‌ చ‌ర్చ జ‌రుగుతోంది. కానీ, మిగ‌తా 1990 కిలోమీట‌ర్ల మీద కూడా చ‌ర్చ జ‌ర‌గాలి. జీవో 111 వ‌చ్చాక ఈ ప్రాంతాల్లో రాక్ మైనింగ్ తో పాటు క్ర‌షింగ్ యూనిట్లు ఆగ‌లేద‌ని.. 32 మిన‌ర‌ల్ వాట‌ర్ యూనిట్లు ఏర్ప‌డ్డాయని ఆరోపించారు.

ఎవ‌రికీ అవ‌గాహ‌న లేదు!

1995లో ఒక ప‌రిశ్ర‌మ ఆరంభం కావ‌డంతో జంట జ‌లాశ‌యాల‌కు కాలుష్యం ఏర్ప‌డుతుంద‌నే కార‌ణంతో.. భ‌విష్య‌త్తులో పరిశ్ర‌మల్ని అనుమ‌తించ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతో.. 1996 మార్చి 8న 111 జీవో విడుద‌ల చేశారు. ప‌ది కిలోమీట‌ర్ల క్యాచ్‌మెంట్ ప‌రిధిలో కాలుష్య‌కార‌క పరిశ్ర‌మ‌లు, నివాస స‌ముదాయాలు రాకుండా అడ్డుక‌ట్ట వేశారు. అయితే అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు అనుమ‌తినిస్తామ‌ని ఇందులో పేర్కొన్నారు. రెసిడెన్షియ‌ల్ జోన్లో నివాస స‌ముదాయాల్ని క‌ట్టుకునేందుకు జీవోలో వీలును క‌ల్పించారు. కానీ, ఈ విష‌యం ఎవ‌రికీ తెలియ‌దు. అస‌లు మొత్తం ప్లాట్ల సేల్ లేకుండా నిషేధించారు. 60 శాతం మేర‌కు టోట‌ల్ ఏరియాను ఓపెన్ స్పేస్‌గా వ‌దిలేయాలి. గ్రామంలోని లేఅవుట్ల‌లో రోడ్లు వేసేందుకు అనుమ‌తించారు. 90 శాతం స్థ‌లాన్ని రిక్రియేష‌న్‌, క‌న్వ‌ర్ష‌న్ జోన్‌గా కేటాయించారు.

  •  క‌న్జ‌ర్వేష‌న్ జోన్లో రిసార్టులు అభివృద్ధి చేసి ఉంటే బాగుండేది. ఈ జోన్‌లో ఎలాంటి అభివృద్ధిని అనుమ‌తిస్తార‌నే విష‌యంలో హెచ్ఎండీఏ ఎప్పుడూ చెప్పిన దాఖ‌లాల్లేవు.
  •  ఐదేళ్ల‌కోసారి క‌రువు వ‌స్తుంది. మ‌రి, క‌రువు వ‌స్తే ఏమిటీ ప‌రిస్థితి? వాట‌ర్ బ‌ఫ‌ర్ ఉండాలి క‌దా.
  •  111 జీవో కంటే ముందు.. 18.01.1989 నాడు అప్ప‌టి ప్ర‌భుత్వం జీవో నెం.50ను విడుద‌ల చేశారు. కానీ, అది ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేకుండా చేశారు.
  •  111 జీవోపై గ‌తంలో ఏర్పాటైన ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ పూర్తి స్థాయి నివేదిక‌ను అంద‌జేయ‌లేదు.
  •  84 గ్రామాల్లో నివ‌సించేవారిని అభివృద్ధిలో భాగస్వామ్యుల్ని చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే అస‌లైన స‌మ‌స్య ఏర్ప‌డుతోంది.

అవి మ‌న బ్రాండ్..

స‌హ‌జ‌సిద్ధ‌మైన నీటివ‌న‌రులకు, కృత్రిమంగా ఏర్పాటు చేసిన నీటి వ‌స‌తుల మ‌ధ్య ఎంతో తేడా ఉంటుంది. పైగా, నీటి వ‌న‌రుల్ని సంర‌క్షించుకునే అంశానికి ప్రాధాన్య‌త‌నిస్తూ సుప్రీం కోర్టు అనేక తీర్పుల్ని ఇచ్చాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌రిగిపోతున్న నీటి నిల్వ‌ల్ని పెంచుకునేందుకు దృష్టి సారించాల‌ని ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు చెబుతున్నారు. స‌హ‌జ‌సిద్ధ‌మైన రీతిలో ప‌ని చేసే నీటి స‌రస్సుల్ని మ‌రింత లోతుగా చేయాల‌ని, వాటి ప్ర‌వాహానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అభ్య‌ర్థిస్తున్నారు.

గిరాకీ, స‌ర‌ఫ‌రాలే ఆధారం..

ఇప్ప‌టికే ఇన్న‌ర్ రింగ్ రోడ్డులో ఎక‌రాల కొద్దీ స్థ‌లం అందుబాటులో ఉంది. ఔట‌ర్ రింగ్ రోడ్డులో వేలాది ఎక‌రాలు ఉండ‌నే ఉన్నాయి. కొత్త‌గా రీజిన‌ల్ రింగ్ రోడ్డు అంటున్నారు. మ‌ళ్లీ కొత్త‌గా ట్రిపుల్ వ‌న్ జీవోను ఎత్తివేస్తే 1.32 ల‌క్ష‌ల ఎక‌రాలు అందుబాటులోకి వ‌స్తుంది. మ‌రి, ఇంతింత భూమి అందుబాటులోకి వ‌స్తే.. రియ‌ల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి ప్ర‌భావం ప‌డుతుంది? రియ‌ల్ రంగంలో గిరాకీ, స‌ర‌ఫ‌రా సూత్ర‌మే కీల‌కం. ఇప్ప‌టివ‌ర‌కూ కోకాపేట్‌, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌, గ‌చ్చిబౌలి వంటి ప్రాంతాల్లో కొద్దిపాటి స్థ‌లం ఉండ‌టంతో.. ప్ర‌భుత్వం నిర్వ‌హించిన వేలం పాట‌ల‌కు కోట్ల రూపాయ‌లు వచ్చాయి. కానీ, వాటికి కేవ‌లం కూత‌వేటు దూరంలో ఉన్న 84 గ్రామాల్లో మాత్రం రేట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 111 జీవోను ఎత్తివేస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించ‌డంతో అక్క‌డా స్థ‌లాల ధ‌ర‌లు పెరుగుతాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ల్యాండ్ ప‌నికి రాదు. డెవ‌ల‌ప్‌మెంట్‌కి ప‌నికొస్తుంది. కొత్త‌గా మార్కెట్లోకి వ‌స్తుంది. కాక‌పోతే, ప‌శ్చిమ హైద‌రాబాద్‌లోని హాట్ లొకేష‌న్ల‌లో రేట్లు త‌గ్గిపోతాయి.

ఏడాదికి ఎన్ని ఎక‌రాలు కావాలి?

హైద‌రాబాద్‌లో ఏడాదికి సుమారు 25 వేల ఫ్లాట్లు అమ్ముడ‌వుతాయని నిపుణుల అంచ‌నా. ఒక్కో ఫ్లాట్ సుమారు 1500 చ‌ద‌ర‌పు అడుగులు ఉంద‌ని అనుకుందాం. కొంద‌రు బిల్డ‌ర్లు ఎక‌రానికి ఎంత‌లేద‌న్నా ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగులు క‌డ‌తార‌ని అనుకుంటే.. ఏడాదికి క‌నీసం 375 ఎక‌రాల భూమి అవ‌స‌రం అవుతుంది. ఇందులో ప‌శ్చిమ హైద‌రాబాద్ వాటా ఎక్కువ అని, ఎంత‌లేద‌న్నా 250 ఎక‌రాల దాకా ఉంటుంద‌ని నిపుణుల అంచ‌నా. ఈమ‌ధ్య బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు, ఆకాశ‌హ‌ర్మ్యాలు క‌ట్టేవారి సంఖ్య పెరిగింది కాబ‌ట్టి.. ఒక‌వేళ ఎక‌రానికి 2 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగులు క‌ట్ట‌డాన్ని లెక్కిస్తే.. సుమారు 187.5 ఎక‌రాల స్థ‌లం అవ‌స‌రం అవుతుంది.

* న‌గ‌రంలో ఐటీ భ‌వ‌నాలు క‌ట్టే డెవ‌ల‌ప‌ర్ల సంఖ్య త‌క్కువేం కాదు. ఏడాదికి ప‌ది మిలియ‌న్ చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని నిర్మిస్తార‌ని అనుకుందాం. ఎక‌రానికి ఎంత‌లేద‌న్నా 2.5 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని డెవ‌ల‌ప‌ర్లు నిర్మిస్తారు. అంటే వీటిని క‌ట్టేందుకు క‌నీసం 50 ఎక‌రాలు ప్ర‌తిఏటా కావాలి. ఇక ఇత‌ర‌త్రా వాణిజ్య స‌ముదాయాలు, షాపింగ్ మాళ్లు క‌ట్టేందుకు ఎంత‌లేద‌న్నా 25 ఎక‌రాలు ఏటా అవ‌స‌రం అని చెప్పొచ్చు.

క‌నీసం 60 ఏళ్ల‌కు స‌రిప‌డా భూములు..

మొత్తానికి, హైద‌రాబాద్ రియ‌ల్ రంగంలో అపార్టుమెంట్లు, ఐటీ స‌ముదాయాల్ని క‌ట్టేందుకు ప్ర‌తిఏటా ఎంత‌లేద‌న్నా 450 ఎక‌రాలు అవ‌స‌రం అవుతాయి. దీనికి యాభై ఎక‌రాలు అద‌నంగా జోడిస్తే మొత్తం 500 ఎక‌రాలు కావాల‌ని అనుకుందాం. ఒక‌వేళ ట్రిపుల్ జీవోను పాక్షికంగానే ఎత్తివేశార‌ని అనుకున్నా.. అందులో 65 వేల ఎక‌రాలే అందుబాటులోకి వ‌స్తాయ‌ని అనుకుందాం. రెసిడెన్షియ‌ల్, ఐటీ, క‌మ‌ర్షియ‌ల్ జోన్ల‌కు యాభై శాతం స్థ‌లాన్ని మాస్టర్ ప్లాన్‌లో కేటాయిస్తే.. 32.5 వేల ఎక‌రాలు అందుబాటులోకి వ‌స్తుంది. ఈ లెక్క‌న చూస్తే ట్రిపుల్ వ‌న్ జీవో ఎత్తేయ‌డం వ‌ల్ల వ‌చ్చే అర‌వై ఏళ్ల‌కు స‌రిప‌డా భూములు ల‌భిస్తాయ‌ని చెప్పొచ్చు. ఫ‌లితంగా, వ‌చ్చే అర‌వై ఏళ్ల అభివృద్ధికి అవ‌స‌ర‌మైన స్థ‌లం ల‌భించ‌డం వ‌ల్ల 84 గ్రామాల‌న్నీ క‌లిసి స‌రికొత్త న‌గ‌రంగా అభివృద్ది చెంద‌డానికి ఆస్కారముంది.

* ఒక‌వేళ ట్రిపుల్ జీవో ఎత్తివేస్తే.. ఆయా ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు అమాంతం పెరుగుతాయ‌న‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. కాక‌పోతే, ప‌శ్చిమ హైద‌రాబాద్‌లోని ఇత‌ర ప్రాంతాల్లో భూముల రేట్లు అమాంతం త‌గ్గిపోతాయి. ఫ‌లితంగా, అక్క‌డ క‌డుతున్న అపార్టుమెంట్ల రేట్లు త‌గ్గిపోతాయి. ఇప్ప‌టివ‌ర‌కూ యూడీఎస్‌, ప్రీలాంచుల్లో బ‌హుళ అంత‌స్తులు, ఆకాశ‌హ‌ర్య్మాలు క‌ట్టే ప్రాజెక్టుల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంది.

అభివృద్ధి ఇలాగైతే అద్భుత‌మే!

ట్రిపుల్ వ‌న్ జీవోను ఎత్తివేస్తారా? లేదా? అనే అంశాన్ని ప‌క్క‌న పెడితే.. ఒక‌వేళ ఈ జీవోను ఎత్తివేస్తే మాత్రం ఆయా ప్రాంతాన్ని కాంక్రీటు జంగిల్లా కాకుండా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా అభివృద్ధి చేయాలి.

  •  కంటోన్మెంట్ ఏరియా, బీహెచ్ఈఎల్‌, డీఆర్‌డీఎల్ వంటి అనేక కేంద్ర ప్ర‌భుత్వ సంస్థలు వందలాది ఎకరాల భూముల్లో ఉండటం.. నిర్మాణాలు తక్కువ ఏరియాలో.. చెట్లు అధిక సంఖ్యలో ఉండటం వల్ల.. న‌గ‌రంలో ప‌చ్చ‌ద‌నం వెల్లివిరిస్తోంది. టీఆర్ఎస్ ప్ర‌భుత్వమూ ముందునుంచీ ప‌చ్చ‌ద‌నం పెంపొందించేందుకు కృషి చేస్తోంది.
  •  111 జీవో ప్రాంతంలో ఇప్ప‌టికే గ్రీన‌రీ ఉంది. గండిపేట్, హిమాయత్ సాగర్ నిండిన‌ప్పుడు నాలుగైదు కిలోమీట‌ర్ల వ‌ర‌కూ భూగ‌ర్భ‌జ‌లాలు పెరుగుతాయి. ప‌చ్చ‌ద‌నం అధిక‌మ‌వుతుంది. ట్విన్ రిజ‌ర్వాయ‌ర్ల ప‌రిధిలో ట్రిపుల్ వ‌న్ జీవోను ఎత్తివేశాక‌.. అక్క‌డ ఏయే త‌ర‌హా నిర్మాణాల‌కు ఎలా అనుమ‌తినిస్తార‌నేది కీల‌కం.
  •  ఇక్క‌డ పావు ఎక‌రం, అర లేదా ఎక‌రం చొప్పున విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణానికి అనుమ‌తినివ్వాలి. అందులో కేవ‌లం 15 నుంచి 20 శాతం నిర్మాణాన్ని, మూడంతస్తుల వరకే అనుమ‌తించాలి.
  •  మిగ‌తా స్థ‌లంలో చెట్ల‌ను పెంచాల‌నే నిబంధ‌న‌ను తేవాలి.
  •  రోడ్ల‌ను కాంక్రీటు జంగిల్ త‌ర‌హాలో వేయకుండా.. మ‌ట్టి రోడ్ల‌ను మాత్ర‌మే అనుమ‌తించాలి. దాన్ని ప‌క్క‌నే చెట్ల‌ను పెంచాలి.
  •  ప్ర‌తి ఇంటికీ చిన్న ఎస్టీపీని ఏర్పాటు చేసే.. ఆయా ఇంటికే వినియోగించాల‌నే నిబంధ‌న‌ను తేవాలి. లేక‌పోతే కొత్త ఇళ్లు వ‌స్తే.. అక్క‌డి డ్రైనేజీ నీళ్లు తాగునీటితో క‌లిసిపోతాయ‌నే భ‌యం వ‌ల్లే క‌దా ఇంత‌వ‌ర‌కూ అక్క‌డ నిర్మాణాల్ని అనుమ‌తించ‌లేదు.
    * ఇలా చేస్తే.. ఓ ప‌దేళ్ల త‌ర్వాత ఈ ప్రాంతాన్ని పైనుంచి చూస్తే ఎంతో అందంగా క‌నిపిస్తుంది. భార‌త‌దేశంలోనే ల‌క్షకు పైగా ఎక‌రాల్లో ఇంత అందంగా ఏ ప్రాంత‌మూ క‌నిపించ‌దు. ఓఆర్ఆర్‌, ట్రిపుల్ ఆర్ మధ్యలో.. ట్విన్ రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండటం, ఇది అత్యంత అద్భుతమైన పచ్చటి నగరంగా కనిపిస్తుంది.
  •  హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి.. 111 జీవో పరిధిలో ఉన్న చెరువులు, కుంటల్ని ఏడాదికి రెండుసార్లు పైపుల ద్వారా నింపాలి. దీంతో ఇక్కడి భూగర్భజలాలు పెరుగుతాయి. తద్వారా పెద్దపెద్ద చెట్లు పెరుగుతాయి. అవి పెద్దగా అయితే, పది రెట్లు గ్రీనరీ పెరుగుతుంది.

– కె.ర‌వీంద‌ర్ రెడ్డి, ఛైర్మ‌న్‌, జ‌న‌ప్రియ ఇంజినీర్స్

ధ‌ర‌లు త‌గ్గుతాయి..

ఒక‌వేళ ట్రిపుల్ వ‌న్ జీవోను ఎత్తివేస్తే.. 1.32 ల‌క్ష‌ల ఎక‌రాల భూమి అందుబాటులో వ‌స్తుంది. ఫ‌లితంగా, అక్క‌డ ప్లాట్ల ధ‌ర‌లు పెరుగుతాయి. కాక‌పోతే, హైద‌రాబాద్‌లోని ఇత‌ర ప్రాంతాల్లో మాత్రం భూముల ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోతాయన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అప‌రిమిత ఎఫ్ఎస్ఐ మీద క్యాప్ పెట్టాల్సిన త‌రుణం వ‌చ్చేసింది. కాబ‌ట్టి, ప్ర‌భుత్వం ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. – ప్ర‌భాక‌ర్ రావు, అధ్య‌క్ష‌డు, టీబీఎఫ్‌

అస‌మాన‌త‌లు తొల‌గాలి..

ట్రిపుల్ వ‌న్‌ జీవో ఎత్తివేయ‌డం అనేది సుప్రీం కోర్టు ప‌రిధిలో ఉంది. కాబ‌ట్టి, దాన్ని గురించి ఇప్పుడేం మాట్లాడ‌కూడ‌దు. 84 గ్రామాల్ని 111 జీవో ప‌రిధిలోకి తెచ్చినా.. అనేక ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు, మెడిక‌ల్ కాలేజీలు, ఆస్ప‌త్రులు, లేఅవుట్లు వెలిశాయి. అంటే, అక్ర‌మ నిర్మాణాల్ని నిరోధించ‌డంలో ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మ‌య్యాయి. ఈ ప్రాంతాన్ని హ‌రిత‌మ‌యం చేసి ప‌రిర‌క్షిస్తూనే స‌రికొత్త రీతిలో అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఇందుకోసం ప్ర‌భుత్వం త‌గు నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని ఆశిస్తున్నాను. 111 జీవో వ‌ల్ల ఇక్క‌డి రైతుల‌కు కొన్నేళ్ల నుంచి తీర‌ని అన్యాయం జ‌రిగింది. ప‌క్క‌నే ఉన్న కోకాపేట్‌లో ఎక‌రం న‌ల‌భై కోట్లు ఉంటే.. ఇక్క‌డి ప్రాంతాల్లో క‌నీసం నాలుగు కోట్ల‌ను మించ‌ట్లేదు. ఈ అస‌మాన‌త‌ల్ని తొల‌గించేందుకై రాష్ట్ర ప్ర‌భుత్వం 111 జీవోను ఎత్తేయాల‌ని భావిస్తున్న‌ట్లు అనిపిస్తోంది. ఒక‌వేళ 111 జీవోను తొల‌గిస్తే.. అక్క‌డి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో రేట్లు పెరుగుతాయి. కోకాపేట్ ప‌రిస‌ర ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు త‌గ్గుతాయి.

– గుమ్మి రాంరెడ్డి, వైస్ ప్రెసిడెంట్‌, క్రెడాయ్ నేష‌న‌ల్‌

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles