- ఉపద్రష్ట కామేశ్వరరావును నియమించిన ప్రభుత్వం
- ఈనాడు, సాక్షి పత్రికల్లో పని చేసిన అనుభవం
- సిన్సియారిటీకి మారుపేరుగా జర్నలిస్టుల్లో గుర్తింపు
- ఏపీలో రెరా మరింత బలోపేతం చేయడానికి అడుగులు
రెరా అథారిటీని బలోపేతం చేయడంలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని చెప్పొచ్చు. రాష్ట్రంలో రెరా విభాగం ఏర్పాటు చేయడం, సభ్యుల ఎంపిక వంటి అంశాలపై ముందునుంచీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో సమర్థులైన వారికే రెరాలో పెద్దపీట వేసింది. తాజాగా, ముగ్గురు సభ్యుల్ని రెరా అథారిటీ కోసం ప్రత్యేకంగా నియమించింది. రాజశేఖర్ రెడ్డి, ఉపద్రష్ట కామేశ్వరరావు, జగన్నాథరావులను నియమిస్తూ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ జీవోను విడుదల చేశారు.
రెరా సభ్యులుగా నియమితులైన వారిలో ఉపద్రష్ట కామేశ్వరరావు సీనియర్ జర్నలిస్టుగా సుపరిచితమే. సిన్సియారిటీకి మారుపేరుగా జర్నలిస్టు వర్గాల్లో మంచి పేరు గడించిన ఆయన ఈనాడు, సాక్షిలో ఇన్‌ఛార్జీ హోదాలో పని చేశారు. ముఖ్యంగా, ఈనాడులో స్థిరాస్తి విభాగం ఇన్‌ఛార్జీగా సేవలు అందించారు. 2006లో మార్కెట్ ఒడిదొడుకులకు లోనైప్పుడు తన వరుస కథనాలతో మార్కెట్‌ను నిలబెట్టడంలో విజయం సాధించారు.
ఈనాడు ఎడిట్ పేజీలో ఎకానమి మీద ప్రత్యేక వ్యాసాలు రాసేవారు. సాక్షి దినపత్రిక ఏర్పడిన తర్వాత అందులో చేరి బిజినెస్ ఎడిటర్‌గా విధుల్ని నిర్వర్తించారు. మొత్తానికి, హైదరాబాద్ రియల్ రంగం అభివృద్ధి, తిరోగమనం, మళ్లీ పూర్వవైభవం వంటివన్నీ ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని.. ఆంధ్రప్రదేశ్ రెరా సభ్యుడిగా నియమించడం స్వాగతించాల్సిన విషయం. జగన్ ప్రభుత్వం రియల్ రంగం అభివృద్ధి కోసం ముందుచూపుగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఆయన ఎంపికే నిదర్శనమని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సందర్భంగా క్రెడాయ్ నేషనల్ మాజీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపద్రష్ట కామేశ్వరావు రెరా సభ్యుడిగా నియమితులు కావడాన్ని స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్‌లో రెరా మరింత బలోపేతం అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.