Categories: LATEST UPDATES

12 ఏళ్లైనా పూర్తికాని ప్రాజెక్టుపై 12 కేసులు

12 ఏళ్లు గడిచినా పూర్తికాని ప్రాజెక్టుపై 12 ముంది చేసిన ఫిర్యాదుల మేరకు 12 కేసులు నమోదయ్యాయి. సాధారణంగా ఒకే వ్యక్తి లేదా సంస్థలపై వచ్చే ఒకే రకమైన ఫిర్యాదులపై ఒకే కేసు నమోదు చేస్తారు. కానీ శ్రద్ధా స్కైలైన్ బిల్డర్, దాని భాగస్వాములపై 12 ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడం విశేషం.

ముంబై ఘట్కోపర్ లోని పంత్ నగర్ కు చెందిన ఓ అపార్ట్ మెంట్ వాసులు తమ భవనాన్ని రీ డెవలప్ చేయడానికి 2010లో స్వస్తిక్ వెంచర్స్ తో ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు అందులో ఉంటున్న 16 మందికి ఫ్లాట్లు ఇవ్వడంతోపాటు బహిరంగ మార్కెట్ లో అమ్ముకోవడానికి వీలుగా మరికొన్ని ఫ్లాట్లు కట్టించి ఇవ్వాలని కోరారు. అప్పటివరకు ఆ యజమానులకు నెలకు రూ.37వేల అద్దె చెల్లించడంతోపాటు 28 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని షరతు విధించారు.

అలాగే ప్రతి ఆరు నెలలకు అద్దె 10 శాతం పెంచాలని నిబంధన పెట్టారు. అయితే, 12 ఏళ్లు గడిచినా ప్రాజెక్టు పూర్తి కాలేదు. పైగా 2016లో సంస్థ నలుగురు భాగస్వాముల్లో విభేదాలు తలెత్తి.. ఇద్దరు విడిపోయారు. శ్రద్ధా స్కైలైన్ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టు తాము చేపడుతున్నట్టు సమాచారం ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ప్లాట్లు అప్పగించలేదు. ఈ నేపథ్యంలో 16 మంది యజమానుల్లో 12 మంది బిల్డర్ పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు 12 కేసులు నమోదు చేశారు. ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయడంతో 12 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని.. చార్జిషీటు వేసే సమయంలో అన్నింటినీ కలిపి నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

This website uses cookies.