Categories: LEGAL

పుణె బిల్డ్ టెక్ లో సీబీఐ సోదాలు

పంజాబ్ నేషనల్ బ్యాంకును 2013-16 మధ్య కాలంలో రూ.30 కోట్ల మేరకు మోసం చేసిన కేసులో పుణె బిల్డ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సీబీఐ సోదాలు జరిపింది. ముంబైలోని మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిపారు. సంస్థతోపాటు దాని ప్రమోటర్లపై కేసు నమోదు చేసిన అనంతరం ఈ మేరకు తనిఖీలు నిర్వహించారు. గతంలో డైనమిక్స్ బల్వాస్ రిసార్ట్స్ పేరుతో ఉన్న పుణె బిల్డ్ టెక్ సంస్థ కార్యాలయంతోపాటు ప్రమోటర్లు ఇషాక్ యూసుఫ్ బల్వా, జావర్ధన్ వినోద్ గోయెంకా ఇళ్లలో సోదాలు జరిపినట్టు అధికారులు వెల్లడించారు.

ఫైవ్ స్టార్ హోటల్స్, రిసార్టుల నిర్మాణం కోసం పుణె బిల్డ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ 1997లో ఏర్పాటైంది. ఈ క్రమంలో ఎరవాడలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం సంస్థ పనులు ప్రారంభించింది. దీనికి పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.102 కోట్లు, అలహాబాద్ బ్యాంకు (ప్రస్తుతం ఇండియన్ బ్యాంకు) రూ.102 కోట్లు రుణం ఇవ్వాల్సి ఉంది. అయితే, 2011 వరకు పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.30.50 కోట్ల మేర రుణం ఇచ్చి.. ఆపై నిలిపివేసింది. పుణె మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతులు రావడంలో జాప్యం కావడం, ఈ సంస్థ 2జీ స్పెక్ట్రం కేసులో ఆరోపణలు ఎదుర్కోవడంతో ప్రాజెక్టు నిలిచిపోయింది. అనంతరం ఆ ప్రాజెక్టును రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా మార్చి, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణం తీసుకున్నారు. కానీ పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణాన్ని చెల్లించలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ.. తాజాగా సోదాలు నిర్వహించింది.

This website uses cookies.