Categories: TOP STORIES

మూసీ ప్ర‌క్షాళ‌నకు రూ.141 కోట్లే

మూసీ ప్ర‌క్షాళ‌న‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్న ప్ర‌భుత్వం.. ప్ర‌తిప‌క్ష చేస్తున్న ఆరోప‌ణ‌లు, సృష్టిస్తున్న అపోహ‌ల‌ను నివృత్తి చేసేందుకు శ్రీ‌కారం చుట్టింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్‌ను వేదిక‌గా చేసుకున్నారు. సుధీర్ఘ‌మైన ఈ ప్రెస్‌మీట్ పూర్తిగా మూసీపైనే సాగింది. ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా త‌మ ప్ర‌భుత్వ ఉద్దేశ్యాన్ని వివ‌రిస్తూనే, ప్ర‌తిప‌క్ష పార్టీ బీఆరెస్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న త‌న‌దైన శైలిలో స్పందించారు. ఇందులో అంద‌రినీ మ‌మేకం చేసే ప్ర‌య‌త్నం చేశారు. మీడియా కూడా ఈ విష‌యంలో త‌ప్పుదోవ ప‌ట్టింద‌న్నారాయ‌న‌. ప్ర‌తిప‌క్షాల‌ను కూడా నిల‌దీస్తూనే , ప్ర‌శ్నిస్తూనే మూసీ బాధితుల జీవితాల్లో వెలుగులు రావ‌డం మీకు ఇష్టం లేదా అని ఆయ‌న చ‌ర్చ‌కు తెర తీశారు.

రెండు రోజులు .. అంటే ఈ శ‌నివారం వ‌ర‌కు ప్ర‌తిప‌క్షాల‌కు ఆయ‌న గడువిచ్చాడు. మీ స‌ల‌హాలేమిటీ, ప్ర‌భుత్వం ఇంకా ఏమీ చేయాలి..? అనే విష‌యాల‌పై నిర్మాణాత్మ‌క సూచ‌న‌లు ఇవ్వండ‌ని ఆయ‌న పిలుపునిచ్చి వారిని ఇర‌కాటంలో పెట్టిన‌ట్టు చేశారు. మీడియాను కూడా సీఎం రేవంత్‌రెడ్డి నిల‌దీసినంత పని చేశారు. మీరు కూడా దీనిపై ఇన్విస్టిగేష‌న్ చేయండి.. సూచ‌న‌లివ్వండి.. త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తుంద‌ని వారిలో కూడా చ‌ర్చ‌కు తెర‌తీశారు రేవంత్‌. ఇక ఇది కేటీఆర్ గోబెల్స్ ప్ర‌చారం చేస్తున్న‌ట్టగా ల‌క్ష‌న్న‌ర కోట్ల ప్రాజెక్టు కాద‌ని, 141 కోట్ల రూపాయ‌ల‌తో ఇదంతా చేసి చూపెడ‌తామ‌న్నారు. ప్ర‌పంచంలోనే పేరెక‌గ‌న్న ఐదు క‌పెంనీల‌ను మూసీ పున‌రుజ్జీవం కోసం వినియోగించుకుంటున్నామ‌ని, వాటి నేప‌థ్యాన్ని చ‌రిత్ర‌ను వివ‌రించారాయ‌న‌.

ఏడాదిన్న‌ర పాటు ఈ ప్రాజెక్టులు డీపీఆర్ రూపొందించేందుకే టైమ్ తీసుకుంటార‌ని, ఐదేండ్ల పాటు మూసీ పున‌రుజ్జీవం సాగుతుందన్నారు. దీనిపై చ‌ర్చ‌కు అన్ని పార్టీల నేత‌ల‌ను ఆహ్వానించేందుకు ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాల‌ను కూడా ఏర్పాటు చేయిస్తాన‌ని, న్యాయ కోవిదుల స‌ల‌హాలు తీసుకుని రాష్ట్ర ఎంపీల‌ను కూడా భాగ‌స్వామ్యం చేయిస్తాన‌ని కూడా అన్నారు. మూసీ పున‌రుజ్జీవం ద్వారా టూరిజం డెవ‌ల‌ప్మెంట్ అవుతుంద‌ని, త‌ద్వారా ఆదాయంపెరుగుతుంద‌న్నారు. ఆదాయం పెరిగిన‌ప్పుడే ప్ర‌భుత్వానికి సంక్షేమ ప‌థ‌కాలను అమ‌లు చేసేందుకు వీల‌వుతుంద‌ని కూడా క్లారిటీ ఇచ్చారు ఈ వేదిక‌గా. త్వ‌ర‌లో మీడియా సంపాద‌కుల‌తో కూడా ఈ విష‌య‌మై భేటీ అవుతాన‌ని,వారి స‌ల‌హాలు తీసుకుంటాన్న‌న్నారు.

మంత్రుల స‌బ్ క‌మిటీ వేసి ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌ల స‌ల‌హాలు కూడా తీసుకుంటాన‌న్నారు. రాజ‌కీయ నాయ‌కులంతా ఈ కేబినెట్ స‌బ్ క‌మిటీలో త‌మ అభిప్రాయాలు వెల్ల‌డించ‌వ‌చ్చ‌న్నారు. మూసీ ప‌రివాహాక ప్రాంత ప్ర‌జ‌ల‌ను నిరాశ్ర‌యుల‌ను , అనాథ‌ల‌ను చేయ‌డం త‌మ ఉద్దేశ్యం అస‌లే కాద‌న్నారు. వారికి మంచి జీవితాలు ప్ర‌సాదించ‌డంతో పాటు ప‌రిహారం, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌న్నారు.

This website uses cookies.