మహారాష్ట్రలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను గ్రేడింగ్ చేయాలంటూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మహా రెరా ఉపసంహరించుకుంది. రియల్ ఎస్టేట్ రెగ్గులేటరీ యాక్ట్-2016 ప్రకారం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను గ్రేడ్ చేయడానికి రెగ్యులేటర్లకు అధికారం లేదని సీనియర్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టులను గ్రేడ్ చేసే ప్రణాళిక ప్రస్తుతానికి నిలిపివేశామని వెల్లడించారు. మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ గతేడాది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను గ్రేడింగ్ చేయడం ప్రారంభించింది. దీనివల్ల గృహ కొనుగోలుదారులు సరైన నిర్ణయం తీసుకోవడం వీలవుతుందని పేర్కొంది.
డెవలపర్లు అప్‌లోడ్ చేసిన సమాచారం ఆధారంగా రెగ్యులేటరీ అథారిటీ నాలుగు పారామితులను ఎంచుకుంది. వీటిలో సాంకేతిక, ఆర్థిక, చట్టపరమైన వివరాలతోపాటు ప్రాజెక్ట్ అవలోకనం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ కేసు విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు కొన్ని సందేహాలు లేవనెత్తింది. కొనుగోలుదారులు తగిన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా డెవలపర్లను రేట్ చేయడం లేదా వర్గీకరించడం కుదురుతుందా అని ప్రశ్నించింది. దీనికి మహా రెరా గ్రేడింగ్ మ్యాట్రిక్స్ ప్రతిపాదించింది. ప్రాజెక్టుల గ్రేడింగ్ కు చట్టం అనుమతించడంలేదని..
అందువల్ల ఈ విషయంలో తాము ముందుకు వెళ్లడంలేదని మహా రెరా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘మేం ప్రాజెక్టులను గ్రేడింగ్ చేయబోవడంలేదు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ చట్టం వర్గీకరణపరంగా దానిని అనుమతించదు. ఈ నేపథ్యంలో మేం గ్రేడింగ్‌తో ముందుకు వెళితే, దీనిని ఎవరైనా సవాల్ చేసే అవకాశం ఉంది. అందుకే మేం దీనిని నిలిపివేశాం’ అని వివరించారు.
This website uses cookies.