రూ.22,527 కోట్ల విలువైన ప్రాపర్టీ విక్రయాలతో గోద్రేజ్ టాప్
భారత్ లో ప్రాపర్టీ విక్రయాలు దుమ్ము రేపాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 18 రియల్ ఎస్టేట్ సంస్థలు రూ.1.17 లక్షల కోట్ల అమ్మకాలు జరిపాయి. రూ.22,527 కోట్ల విలువైన అమ్మకాలతో గోద్రేజ్ ప్రాపర్టీస్ టాప్ లో నిలిచింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే కొద్ది రియల్ సంస్థలు మినహా అన్ని పెద్ద డెవలపర్లు అమ్మకాలు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో లగ్జరీ ఇళ్లు సహా రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు పెరిగిన డిమాండ్ తో ఇది సాధ్యమైంది.
కొనుగోలుదారుల సెంటిమెంట్ బలంగా ఉండటంతో చాలా మంది డెవలపర్లు అమ్మకాల్లో తమ పాత రికార్డులను తామే తిరగ రాసుకున్నారు. రెగ్గులేటరీ ఫైలింగ్స్ లో వెల్లడించిన సమాచారం ప్రకారం. 18 లిస్టెడ్ సంస్థలు 2023-24లో రూ.1,16,635 కోట్ల ప్రాపర్టీ అమ్మకాల బుకింగులు జరిపాయి. అంతకుముందు ఏడాది జరిగిన రూ.88వేల కోట్ల కంటే ఇది 33 శాతం ఎక్కువ. ఇందులో రెసిడెన్షియల్ సెగ్మెంట్ అమ్మకాలే అధికం. కంపెనీల పరంగా రూ.22,527 కోట్ల విలువైన ప్రాపర్టీ అమ్మకాల బుకింగులతో గోద్రేజ్ ప్రాపర్టీస్ అగ్రస్థానంలో ఉండగా.. రూ.21,040 కోట్ల బుకింగులతో ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ రెండో స్థానంలో నిలిచింది.
దేశంలోనే అతిపెద్ద రియల్ సంస్థ డీఎల్ఎఫ్ రూ.14,778 కోట్ల విలువైన ప్రాపర్టీ బుకింగులతో మూడో స్థానంలో ఉంది. లోధా బ్రాండ్ తో అమ్మకాలు జరిపే మాక్రోటెక్ డెవలపర్స్ రూ.14,520 కోట్ల అమ్మకాలు జరిపింది. సిగ్నేచర్ గ్లోబల్ సంస్థ రూ.7,270 కోట్లతో, శోభా లిమిటెడ్ రూ.6,644 కోట్లతో, బ్రిగేడ్ ఎంటర్ ప్రైజెస్ రూ.6,013 కోట్లతో, పూర్వాంకర లిమిటెడ్ సంసథ రూ.5,914 కోట్లతో, ఓబెరాయ్ రియల్టీ సంస్థ రూ.4,007 కోట్లతో, కొల్టే-పాటిల్ సంస్థ రూ.2,822 కోట్లతో తర్వాతి స్థానాలో ఉన్నాయి. లిస్టెడ్ జాబితాలో లేని కంపెనీల్లో టాటా రియల్టీ, అదానీ రియల్టీ,, పిరమల్ రియల్టీ, హీరానందని గ్రూప్, ఎంబసీ గ్రూప్, కె.రహేజా గ్రూప్ వంటివి ప్రధాన ప్లేయర్లుగా ఉన్నాయి.