- ముంబైలో రూ.21.1 కోట్లతో కొనుగోలు
టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ముంబైలో రెండు లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేశారు. ముంబై డియోనార్ ప్రాంతంలోని గోద్రేజ్ స్కై టెర్రస్ లో తన భార్య దేవిషా యాదవ్ తో కలిసి రూ.21.1 కోట్లతో రెండు ఫ్లాట్లు కొన్నారు. రెండు వరుస అంతస్తుల్లో రెండు ఫ్లాట్లను వారు కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా తెలిసింది. వాటి మొత్తం కార్పెట్ ప్రాంతం సుమారు 4,222.7 చదరపు అడుగులు కాగా, మొత్తం బిల్ట్-అప్ ప్రాంతం 4,568 చదరపు అడుగులకు పైగా ఉంది. ఈ రెండు ఫ్లాట్లకు ఆరు కార్ పార్కింగ్ స్థలాలు వచ్చాయి. మార్చి 21న రిజిస్ట్రేషన్ జరగ్గా.. రూ.1.26 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. కాగా, గోద్రేజ్ స్కై టెర్రస్ 1.05 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ప్రాజెక్టు. ఇందులో అన్నీ 3 బీహెచ్ కే, 4 బీహెచ్ కే ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులో చదరపు అడుగు సగటు ధర రూ.52,433. కాగా, డియోనార్ అనేది ముంబై సబర్బన్ జిల్లా చెంబూర్ సమీపంలో తూర్పు ముంబైలో నివాస ప్రాంతం. ఇది హార్బర్ లైన్‌లోని చెంబూర్ రైల్వే స్టేషన్, ముంబై మోనోరైల్ మరియు తూర్పు ఎక్స్ ప్రెస్ హైవే, సియోన్-పన్వేల్ ఎక్స్ ప్రెస్‌వే వంటి కీలక రహదారులతో అనుసంధానం కలిగి ఉంది.