- 2024లో రికార్డు స్థాయిలో 81.7 మిలియన్ చదరపు అడుగులు నమోదు
- సీఆర్ఈ మ్యాట్రిక్స్, క్రెడాయ్ సంయుక్త నివేదిక వెల్లడి
ఆఫీస్ లీజింగ్ లో ఇండియా అదరగొట్టింది. గతేడాది దేశంలో రికార్డు స్థాయిలో 81.7 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ కార్యకలాపాలు నమోదైనట్టు సీఆర్ఈ మ్యాట్రిక్స్, క్రెడాయ్ సంయుక్త నివేదిక వెల్లడించింది. 2024లో దేశంలో పెద్ద పెద్ద లావాదేవీల్లో కూడా డిమాండ్ పెరిగింది. లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ పరిమాణంలో జరిగిన లీజింగ్ లావాదేవీలు మొత్తం డిమాండ్ లో 41 శాతం మేర ఉన్నాయి. ముఖ్యంగా బెంగళూరు, పుణెలో అధిక వృద్ధితో దేశవ్యాప్తంగా పెద్ద పరిమాణపు లీజింగ్ కార్యకలాపాలు 2023 కంటే 2024లో 13 శాతం మేర పెరిగాయి.
కాగా, భారతదేశ ఆఫీస్ లీజింగ్ మార్కెట్ 2024 క్యాలెండర్ సంవత్సరంలో ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుందని, 81.7 మిలియన్ చదరపు అడుగులతో 19 శాతం వార్షిక పెరుగుదలను నమోదు చేసిందని నివేదిక వెల్లడించింది. ఈ లీజింగ్ లో ఐటీ, ఐటీఈఎస్ రంగం అతిపెద్ద వాటా కలిగి ఉన్నట్టు తెలిపింది. మొత్తం లీజింగ్ డిమాండ్‌లో ఈ విభాగం 42 శాతం వాటా కలిగి ఉంది. ఇది 2023లో 28 శాతంగా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి అగ్ర మెట్రోలు ఆఫీస్ లీజింగ్‌లో ఆధిపత్యం చెలాయించాయి. మొత్తం డిమాండ్‌లో ఇవి 62 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2024లో సగటు డిమాండ్ సప్లై నిష్పత్తి 1:5 ఉండటం వల్ల ఢిల్లీలో, ముంబై, చెన్నై మైక్రో మార్కెట్లలో ఖాళీ రేట్లు తగ్గాయని.. దీనివల్ల పాన్ ఇండియా ఖాళీ రేటు 15.7 శాతానికి తగ్గింది. ఇది 2023లో 17.7 శాతంగా ఉంది. 2024 నాలుగో త్రైమాసికంలో ఆఫీస్ లీజింగ్ డిమాండ్ 17.9 మిలియన్ చదరపు అడుగులు కాగా, సరఫరా 12.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.
అలాగే కో-వర్కింగ్ లేదా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ లీజింగ్ విభాగం 2024 క్యాలెండర్ సంవత్సరంలో ఆఫీస్ లీజింగ్ డిమాండ్ 13 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. గత మూడేళ్లలో సగటున 10 మిలియన్ చదరపు అడుగులతో పోలిస్తే.. 30 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అలాగే కో-వర్కింగ్ ఆపరేటర్ల నుంచి డిమాండ్ సంవత్సరానికి 25 శాతం పెరిగింది. పాన్-ఇండియా ఆఫీస్ అద్దె రేట్లు చదరపు అడుగుకు రూ. 106కి చేరుకున్నాయి. ఇది 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. బెంగళూరు, హైదరాబాద్ అతిపెద్ద సరఫరాదారులుగా మారాయి. 2023లో నమోదైన 51 శాతంతో పోలిస్తే 2024లో 55 శాతానికి పెరిగింది. 2024లో దేశంలోని ఏడు అగ్ర సూక్ష్మ మార్కెట్లలో మొత్తం 53.3 మిలియన్ చదరపు అడుగుల సరఫరా జరిగింది. ఇక 2027 నాటికి భారతదేశం 295.7 మిలియన్ చదరపు అడుగుల తాజా గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ సరఫరాను కలిగి ఉంటుందని అంచనా.