– డెవలపర్ల నిధుల దుర్వినియోగం ఫలితంగా నిలిచిపోయిన వైనం
– వీటిలో దాదాపు 5 లక్షలకు పైగా యూనిట్లు
– జాబితాలో అగ్రభాగాన గ్రేటర్ నోయిడా
– 44 నగరాలు.. 2వేల ప్రాజెక్టులు
– ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడి
దేశవ్యాప్తంగా 44 నగరాల్లో దాదాపు 2వేలకు పైగా ప్రాజెక్టులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. వీటిలో దాదాపు 5 లక్షలకు పైగా యూనిట్లు ఉన్నాయి. డెవలపర్లలో ఆర్థిక క్రమశిక్షణ లోపించడం, నిధులు దుబారా చేయడం, సామర్థ్యాల కొరత ఇందుకు ప్రధాన కారణాలు అని డేటా విశ్లేషణ సంస్థ ప్రాప్ ఈక్విటీ తాజా నివేదికలో వెల్లడించింది. టైర్-1 నగరాలకు సంబంధించి గ్రేటర్ నోయిడాలో అత్యధికంగా 17 శాతం (167 ప్రాజెక్టుల్లో 74,645 యూనిట్లు) నిలిచిపోగా.. థానే 13 శాతం (186 ప్రాజెక్టుల్లో 57,520 యూనిట్లు), గురుగ్రామ్ 12 శాతం (158 ప్రాజెక్టుల్లో 52,509 యూనిట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నిలిచిపోయిన ప్రాజెక్టులుపరంగా ముంబై (234 ప్రాజెక్టుల్లో 37,883 యూనిట్లు) తొలి స్థానంలో ఉండగా.. బెంగళూరు (225 ప్రాజెక్టుల్లో 39,908 యూనిట్లు), థానె (186 ప్రాజెక్టులు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కోల్ కతా (82 ప్రాజెక్టుల్లో 24,174 యూనిట్లు), చెన్నై (92 ప్రాజెక్టుల్లో 21,867 యూనిట్లు), హైదరాబాద్ (25 ప్రాజెక్టుల్లో 6,169 యూనిట్లు), పుణె (172 ప్రాజెక్టుల్లో 24,129 యూనిట్లు) నిలిచిపోయిన జాబితాలో ఉన్నాయి.
ఆగస్ట్ 15 న విడుదల చేసిన నగరాలవారీ డేటాలో ఆగిపోయిన యూనిట్ల సంఖ్య 5.08 లక్షలకు పెరిగిందని, 2018లో ఉన్న 4.65 లక్షల యూనిట్లతో పోలిస్తే 9 శాతం పెరిగిందని ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. మొత్తమ్మీద 14 టైర్-1 నగరాల్లో 1636 ప్రాజెక్టుల్లో 4,31,946 యూనిట్లు, 28 టైర్- II నగరాల్లో 345 ప్రాజెక్టుల్లో 76,256 యూనిట్లు నిలిచిపోయాయి. టైర్-2 నగరాల విషయానికి వస్తే.. భివాడి గరిష్టంగా 18 శాతం (33 ప్రాజెక్టుల్లో 13,393 యూనిట్లు) అగ్రభాగంలో ఉంది. తర్వాత లక్నో 17 శాతం (48 ప్రాజెక్టుల్లో 13,024 యూనిట్లు), జైపూర్ 13 శాతం (37 ప్రాజెక్టుల్లో 9,862 యూనిట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టైర్-2 నగరాల్లో విశాఖపట్నం, విజయవాడ కూడా ఉన్నాయి.