- రూ.12.5 లక్షలు పెట్టుబడి పెడితే
- నెలకు 12000- 21600 అద్దె ఖాయమట
- జీహెచ్ఎంసీ, రెరా అనుమతి తీసుకోలేదు
- అమాయకులకు కుచ్చుటోపి పెడుతున్న రియల్టర్
- అసలే కరోనా థర్డ్ వేవ్ సిగ్నళ్లు
- షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్సులకు తగ్గిన గిరాకీ
- చివరికీ ఆరు గజాలేనా మిగిలేది?
హైదరాబాద్ నిర్మాణ రంగంలో వింత పోకడలు కనిపిస్తున్నాయి. నిన్నటివరకూ ప్రణాళికాబద్ధంగా డెవలపర్లు నిర్మాణాలు చేపట్టేవారు. కొన్ని రోజుల్నుంచి జనం సొమ్ముతోనే జబర్దస్త్ నిర్మాణాల్ని చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా పలువురు డెవలపర్లు ముందు కొంతమంది కొనుగోలుదారులతో ఒప్పందం కుదుర్చుకుని అపార్టుమెంట్లను ఆరంభించిన సంఘటనలున్నాయి. బంధుమిత్రుల్ని ఒప్పించి ముందే కొంత సొమ్ము తీసుకుని నిర్మాణాల్ని కట్టిన బిల్డర్లు పూర్వాశ్రమంలో ఉన్నారు. టెక్నాలజీ మారినట్టుగా ఇప్పుడేమో అమ్మకాల్లోనూ సరికొత్త పోకడలు కనిపిస్తున్నాయి. మరి, దీని వల్ల బిల్డర్లకు ప్రయోజనమో.. కొనుగోలుదారులకు లాభమో తెలియదు కానీ.. హైదరాబాద్ నిర్మాణ రంగం వికృత పోకడలకు చిరునామాగా మారుతోందని కచ్చితంగా చెప్పొచ్చు.
హైదరాబాద్లో నిర్మాణాలు కట్టిన చరిత్ర లేనటువంటి ఒక కొత్త నిర్మాణ సంస్థ ఏకంగా షాపింగ్ మాల్ కమ్ మల్టీప్లెక్స్ కడుతున్నట్లుగా ప్రకటనల్ని గుప్పించింది. ఈ సంస్థ అందజేసే ఆఫర్ చూస్తే నిర్మాణ రంగంలో నిష్ణాతులైన వారికీ మతిపోవాల్సిందే. ఇరవై, ముప్పయ్యేళ్ల నుంచి హైదరాబాద్ నిర్మాణ రంగం మీదే ఆధారపడి అపార్టుమెంట్లు కడుతున్నవారికీ ఇలాంటి ఆలోచన రాలేదంటే నమ్మండి. సికింద్రాబాద్లోని బోయిన్పల్లి వద్ద సదరు సంస్థ నాలుగు ఎకరాల స్థలాన్ని సేకరించింది. అందులో షాపింగ్ మాల్ కమ్ మల్టీప్లెక్స్ నిర్మిస్తుందట. ప్రీ లాంచ్ ఆఫర్లో భాగంగా.. ఇందులో 120 చదరపు అడుగుల స్థలాన్ని రూ.12.50 లక్షలకే అందజేస్తోంది. ముందుగా రూ.9 లక్షలు కడితే.. ఆరు గజాల స్థలాన్ని యూడీఎస్ కింద తక్షణమే రిజిస్టర్ చేసిస్తారట. మిగతా నాలుగున్నర లక్షాల్ని మూడు సమాన వాయిదాల్లో నిర్మాణం జరిగే సమయంలో కట్టాలట. జీవితాంతం నెలకు రూ.12 వేల నుంచి రూ.21,600 అద్దె వస్తుందని ఆ సంస్థ చెబుతోంది. సెబీ మార్గదర్శకాల ప్రకారం.. ఫలానా మొత్తం సొమ్ము పెడితే ఇంత రాబడి వస్తుందని చెప్పడానికి వీల్లేదు. మరి, ఇలాంటి మోసపూరిత ప్రకటనల్ని చూసి ఎంతమంది మోసపోతున్నారో?