దేశ రాజధాని ఢిల్లీలో ప్రాపర్టీ ధరలు చుక్కలను తాకుతున్నాయి. తాజాగా ఢిల్లీ సుందర్ నగర్ ప్రాంతంలోని 900 చదరపు గజాల బంగ్లా దాదాపు రూ.100 కోట్ల ధర పలికింది. దేశంలోని అగ్రశ్రేణి న్యాయవాదులు, వ్యాపారవేత్తలకు ప్రాధాన్యపరమైన ఎంపికగా ఉండే ఈ ప్రాంతంలోని బంగ్లాలన్నీ దాదాపు ఐదు దశాబ్దాల నాటివే. అయినప్పటికీ ధర మాత్రం తగ్గదు. సునీల్, రవి సచ్ దేవ్ లకు చెందిన 867 చదరపు గజాల బంగ్లా రూ.96 కోట్లకు అమ్ముడైందని స్థానిక బ్రోకర్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ఈ బంగ్లా విక్రయంలో కీలక పాత్ర పోషించింది.
6వేల నుంచి 7వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా గ్రౌండ్, మొదటి అంతస్తు కలిగి ఉందని.. చదరపు గజానికి రూ.11 లక్షల ధర పలికిందని పేర్కొన్నారు. ఇక్కడ చాలా బంగ్లాలు గ్రౌండ్, మొదటి అంతస్తుతోపాటు 800 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నాయని, రెండో అంతస్తులో బార్సతి ఒక పడకగది ఇల్లుగా ఉంటుందని తెలిపారు. కాగా, ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, ఆయన భార్య వసుధ ఢిల్లీ సుందర్ నగర్‌లోని బంగ్లాను అదే ప్రాంతానికి చెందిన విక్రమ్ గోయల్‌కు రూ.100 కోట్లకు విక్రయించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. అలాగే వారు 2023లో ఢిల్లీలోని గోల్ఫ్ లింక్స్ లో రూ.160 కోట్లకు 2,160 చదరపు గజాల బంగ్లాను కొనుగోలు చేశారు.
ఇక మెట్రోపాలిస్ హెల్త్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ అమీరా షా 2022లో సుందర్ నగర్ ప్రాంతంలో రూ.64 కోట్లతో 9,896 చదరపు అడుగుల బంగ్లాను కొనుగోలు చేశారు.
This website uses cookies.