- నగరాన్ని పీడిస్తున్న ప్రీలాంచ్ వైరస్
- ప్రీలాంచ్‌లు తొలుత చేసేవారికి మేలే..
- అడ్వాన్స్ స్టేజీలో అమ్మకాలుండవు..
- అప్పుడు ప్రీలాంచ్ ఆఫర్లు ఉండటమే కారణం
- ప్రీలాంచ్ వైరస్‌కు రెరా అడ్డుకట్ట వేయాలి!
2018 నుంచి హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ల వ్యాపారం ఉపందుకుంది. కరోనా తర్వాత మరింత ఉదృతమైంది. ఇప్పుడు కరోనా వైరస్ పరారైనా.. ప్రీలాంచ్ వైరస్ మాత్రం సామాన్య, మధ్యతరగతి ప్రజల్ని శారీరికంగా, మానసికంగా దెబ్బ తీస్తుంది. ఈ రెండు వైరస్‌ల మధ్య తేడా ఏమిటంటే.. కరోనా వస్తే నయం అవుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రాణం పోతుంది. అదే ప్రీలాంచ్ వైరస్ బారిన పడిన వారు ఆర్థికంగా, మానసికంగా చితికిపోక తప్పదు. మళ్లీ, నిలదొక్కుకోవాలంటే ఎంతకాలం పడుతుందో తెలియదు.
అంటే, కరోనా కంటే డేంజర్.. ఈ ప్రీలాంచ్ వైరస్. అందుకే, దీన్ని బారిన పడకూడదని రెరా అథారిటీ ఎంత మొత్తుకుంటున్నప్పటికీ.. అత్యాశ, దురాశ గల ప్రజలు పట్టించుకోవట్లేదు. ప్రజల్లో దాగి ఉన్న ఈ లక్షణాల్ని గుర్తించిన కొందరు సిగ్గుమాలిన బిల్డర్లు.. ప్రజల్లోకి ప్రీలాంచ్ వైరస్‌తో ఆడుకుంటున్నారు. వారి సొమ్మును అప్పన్నంగా దోచేస్తున్నారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ప్రీలాంచ్లో తొలుత నలభై, యాభై కోట్లను వసూలు చేసే బిల్డర్లు సైతం ఆతర్వాత ఇబ్బంది పడక తప్పదు. ఎలాగో తెలుసా?
ప్రీలాంచుల్లో తక్కువ రేటుకు ఫ్లాట్లను కొన్నవారు.. ఏడాది అయ్యిందో లేదో వాటిని అమ్మకానికి పెడతారు. అప్పుడే, బిల్డర్ ప్రాజెక్టును ప్రారంభించి.. అపార్టుమెంట్ నిర్మాణ పనుల్ని జరిగిస్తున్న తరుణంలో.. అతని కంటే తక్కువ రేటుకు ఈ ప్రీలాంచ్ బయ్యర్లు మార్కెట్లో అమ్మకానికి పెడితే డెవలపర్ వద్ద ఫ్లాట్లను కొనడానికి ఎవరూ ముందుకు రారు. అవన్నీ పూర్తయితే తప్ప బిల్డర్ తన ఫ్లాట్లను విక్రయించలేడు. ఒకవేళ, అమ్మకాల్ని పూర్తి చేయాలన్నా కుదరదు. ఎందుకంటే, ఈ ప్రాజెక్టులో ప్రీలాంచుల్లో ఫ్లాట్లు పూర్తయినా.. పక్కన ఎవరో ఒకరు ప్రీలాంచుల్లో విక్రయిస్తూనే ఉంటారు. ఈ కారణం వల్ల కొన్ని నిర్మాణాలు సగంలో ఉండగా పెద్దగా అమ్మకాలు జరగడం లేదు.
కోకాపేట్ పరిస్థితి ఏమిటి?
హెచ్ఎండీఏ వేలం పాటల్ని విడతలవారీగా నిర్వహిస్తుంది. ఇప్పటికే కోకాపేట్‌లో రెండు విడతలుగా స్థలాల్ని విక్రయించిన హెచ్ఎండీఏ మూడో విడతలో కూడా ప్లాట్లను అమ్ముతోంది. అయితే, ఇప్పుడు ప్రీలాంచ్‌లో అమ్మే బిల్డర్లు.. కోకాపేట్‌లోని మూడో విడత వేలం నాటికి ప్రాజెక్టును కొంత అడ్వాన్స్ స్టేజీకి తీసుకెళతారు కాబట్టి, అప్పుడీ బిల్డర్‌కు రెగ్యులర్ సేల్స్ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే, మూడో విడత వేలం పాటలో భూముల్ని కొనేవారు ప్రీలాంచ్ ఆఫర్ పెట్టే అవకాశాన్ని కొట్టిపారెయ్యలేం. అలాంటప్పుడు, రెగ్యులర్ సేల్స్ మీద నెగటివ్ ప్రభావం పడుతుంది. కాబట్టి, ఇప్పుడు ప్రీలాంచ్ చేసే బిల్డర్ తర్వాత రెగ్యులర్ సేల్స్‌లో ఇబ్బంది పడక తప్పదు. కాబట్టి, ప్రీలాంచ్ వైరస్ వల్ల తొలుత మేలు జరిగినప్పటికీ.. దీర్ఘకాలంలో మొత్తం ఇండస్ట్రీయే నాశనం అవుతుంది.