నగరంలో పెరుగుతున్న
విల్లామెంట్స్ నిర్మాణం
ఒక్కో ఫ్లాట్ కి 8 వేల చ.అ.
నుంచి 16 వేల చ.అ. విస్తీర్ణం
స్కై విల్లా ధర 8 కోట్ల నుంచి 20 కోట్లు
ఒక అపార్ట్ మెంట్ లో ఒక్క ఫ్లోర్ కు ఒక్క ఫ్లాట్ మాత్రమే.. ఒక్కో ఫ్లాట్ 6 వేల చదరపు అడుగులు నుంచి మొదలు 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణం.. ఎంటీ వింటేనే ఔరా అనిపిస్తుంది కదా. అవును హైదరాబాద్ నిర్మాణరంగంలో ఇప్పుడు ట్రెండ్ మారింది. అపార్ట్ మెంట్ ప్లస్ విల్లాను మిక్స్ చేస్తూ విల్లా మెంట్స్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. స్కై విల్లాలుగా పిలుస్తున్న ఈ ఫ్లాట్స్ భారీ విస్తీర్ణంతో పాటు సకల సౌకర్యాలతో నిర్మిస్తుండగా ధర 8 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. ఈ మధ్య హైదరాబాద్ లో విల్లా మెంట్స్ కు డిమాండ్ పెరుగుతుండటంతో నిర్మాణ సంస్థలు వీటి నిర్మాణంపై దృష్టి సారించాయి.
ఒకప్పుడు అపార్ట్‌మెంట్లలో ఒక్కో ఫ్లాట్ నాలుగైదు వేల విస్తీర్ణంలో విలాసవంతంగా కడుతుంటే అబ్బో అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు హైదరాబాద్ లో 8 వేల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఫ్లాట్స్ నిర్మిస్తున్నారు. అత్యధికంగా 16వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకే ఒక ఫ్లాట్‌ను అత్యంత విలాసవంతంగా నిర్మిస్తున్నారు. అపార్ట్ మెంట్స్ లో ఎక్కువగా డబుల్, ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్స్ నిర్మిస్తుండటం సాధారణం. హైదరాబాద్ సహా దేశంలోని చాలా మెట్రో నగరాల్లో ఇలాంటి నిర్మాణాల వాటా సుమారు 80 శాతం పైగా ఉంటుంది.
అయితే మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుతం నాలుగు, అంతకంటే ఎక్కువ బెడ్రూం ఫ్లాట్లు కొనేవారు ఉన్నారు. ఆ తరువాత అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కావాలనుకునేవారు సాధారణంగా విల్లాల వైపు మొగ్గు చూపేవారు. విల్లాల్లో ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణం వరకు త్రిఫ్లెక్స్ లో కడుతుంటారు. అయితే ప్రస్తుతం అపార్ట్‌మెంట్స్ లో భారీ విస్థీర్ణంతో విల్లాలను తలపించేలా ఫ్లాట్స్ ను నిర్మిస్తున్నారు. మరీ ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్ లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఐటీ కారిడార్ చుట్టుపక్కల, కోకాపేట్, నార్సింగి, పుప్పాలగూడలో ఎక్కువగా ఇలాంటి ప్రాజెక్టులు వస్తున్నాయి.
విశాలంగా విలాసవంతంగా నిర్మిస్తున్న ఈ తరహా స్కై విల్లా ఫ్లాట్లలో ప్రత్యేకతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కో ఫ్లోర్‌కు నాలుగు ఫ్లాట్లు ఉంటే.. పదివేలు, పదహారు వేల విస్తీర్ణంలో ఉన్నవైతే అంతస్తుకు ఒకటే ఫ్లాట్ మాత్రమే ఉంటుంది. విశాలమైన కారిడార్‌తో ఫ్లాట్‌లో కాకుండా విల్లాలో ఉన్న అనుభూతి కలిగించేలా గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేస్తున్నారు.
శ్లాబ్ ఎత్తును సైతం పెంచి.. ఇంకొన్నిచోట్ల రెండు అంతస్తుల ఎత్తులో శ్లాబ్ ఉండేలా కడుతున్నారు. ప్రతి ఫ్లాట్‌కు ప్రత్యేకంగా లిఫ్ట్ సదుపాయం కల్పిస్తున్నారు. పని మనుషుల కోసం విడిగా గదులు ఉంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాజభవనాలను తలపించేలా స్కై విల్లాస్ ను నిర్మిస్తున్నారు. నాలుగైదు పడక గదులతో పాటు, పొడి, తడి వంట గదులు, కార్యాలయానికి ఒక గది, హోం థియేటర్, జిమ్, అతిథుల కోసం ప్రత్యేకంగా గదులతో పాటూ విశాలమైన సిట్ అవుట్, బాల్కనీ నుంచి నగరం మొత్తం కనిపించేలా.. పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
30 నుంచి 50 అంతస్తుల భవనాల్లో ఇలాంటి స్కై విల్లాలు నిర్మాణమవుతున్నాయి. ప్రాజెక్ట్‌ను లాభసాటిగా మార్చుకునేందుకు ఈ తరహా నిర్మాణాలను బిల్డర్లు చేపడుతున్నారని రియల్ రంగ వర్గాలు అంటున్నాయి. ఆకాశహర్మ్యాల్లో ఎత్తుకు వెళ్లేకొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది. అందుకే ఖర్చును తగ్గించుకునేందుకు ఎనిమిది వేల నుంచి పదహారు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకటే ఫ్లాట్ ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు.
అపార్ట్ మెంట్ లోని పై అంతస్తుల్లో ఈ తరహా స్కై విల్లాలను కడుతున్నారు. వ్యాపార సంస్థలు, వ్యాపారులు, సినీ ప్రముఖులు ఎక్కువగా వీటిపై మొగ్గు చూపుతున్నారు. సౌకర్యాలకు లోటు లేకుండా ఆకాశహర్మ్యాల్లో ప్రతి గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్నట్లే క్లబ్‌హౌస్‌తో పాటూ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. ఒక్కో క్లబ్ హౌస్‌ని 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. సకలం కమ్యూనిటీల్లోనే అందుబాటులో ఉంటాయి. సినిమాలు సైతం మినీ థియేటర్‌లో ఇక్కడే చూసుకోవచ్చు. బిజినెస్ లాంజ్‌లు, కేఫ్‌లు, బార్‌లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. వేడుకల కోసం బాంక్వెట్ హాల్, టెర్రస్ పైనే స్విమ్మింగ్ ఫూల్, ఇతర ఇండోర్ గేమ్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. స్కైవిల్లాలుగా, విల్లామెంట్స్‌గా పిలుస్తున్న ఈ తరహా ఫ్లాట్స్ 8 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయలుగా ధరలున్నాయి.