ప్రపంచ అగ్రశ్రేణి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని సిఎం రేవంత్ రెడ్డి మరోసారి ఎక్స్ వేదికగా పునరుద్ఘాటించారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. పరిపాలనా సౌలభ్యం, ఆర్థిక సామాజిక పరిస్థితులు, స్థిరాస్తి (రియల్టీ), మౌలిక సదుపాయాలు ఇందుకు కలిసి వస్తున్నాయంటూ ఈ నివేదికలో పేర్కొంది.
ఈ నివేదిక కథనాలను ఎక్స్‌లో పోస్టు చేసిన సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు తాము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని, ఈ నివేదిక తమ ప్రయత్నాలకు, దృష్టికి గొప్ప సానుకూలతను అందించిందని సిఎం రేవంత్ తెలిపారు. మనమందరం కలసి హైదరాబాద్‌ను ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా మార్చగలమని, దేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందన్న శుభవార్తను ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్క హైదరాబాదీ చురుకైన గొంతుక కావాలని తాను కోరుతున్నానని ఎక్స్‌లో సిఎం రేవంత్ రాసుకొచ్చారు.