* నేషనల్ రియల్ ఎస్టేట్ కాన్ క్లేవ్ తో కలిపి 26న నిర్వహణ
భారత్ లో రియల్ ఎస్టేట్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అపెక్స్ బాడీ.. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) సిల్వర్ జూబ్లీ ఫౌండేషన్ డే వేడుకలను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. మాదాపూర్‌లోని హోటల్ ట్రిడెంట్ లో శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. నేషనల్ రియల్ ఎస్టేట్ కాన్ క్లేవ్-2023తో కలిపి ఈ వేడుకల్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నరెడ్కో, నైట్ ఫ్రాంక్ కలసి సంయుక్తంగా రూపొందించిన విజన్-2047ని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ వైద్య, ఆరోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తదితరులు హాజరవుతారు. ఈ సందర్భంగా ప్యానెల్ చర్చలు, ముఖ్యుల ప్రసంగాలు, ఇంటరాక్టివ్ సెషన్లు ఉంటాయి. రియల్ రంగానికి చెందిన నిపుణులు, నాయకులు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఐదేళ్లలో రెరా విజయాలు, వైఫల్యాలు కూడా చర్చిస్తారు. గత 25 ఏళ్లలో నరెడ్కో రియల్ ప్రయాణం ఎలా సాగిందనే అంశంపైనా మాట్లాడతారు.