దేశీయ నిర్మాణ దిగ్గజం నిరంజన్ హీరాందానీ ప్రశంస
(కింగ్ జాన్సన్ కొయ్యడ)
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అద్భుతంగా అభివృద్ధి చెందిందని భారత నిర్మాణ దిగ్గజం నిరంజన్ హీరానందానీ ప్రశంపించారు. శనివారం నరెడ్కో రజతోత్సవ వేడుక సందర్భంగా నగరానికి విచ్చేసిన ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. విద్యుత్తు, ఐటీ, మంచినీరు, రహదారులు.. ఇలా ప్రతి అంశంలోనూ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందని కితాబునిచ్చారు. కొన్నేళ్ల విరామం తర్వాత భాగ్యనగరానికి విచ్చేశానని.. ఊహించిన స్థాయిలో హైదరాబాద్‌ను డెవలప్ చేశారని ప్రశంసించారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
గృహరుణాలపై వడ్డీ రేట్లను పెంచడం వల్ల అందుబాటు గృహాల్ని కొనేవారి శాతం గణనీయంగా తగ్గిపోయిందని నేను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌కు చెప్పాను. ఆర్‌బీఐ పెంచిన గృహరుణాలపై వడ్డీ రేట్ల వల్ల అందుబాటు గృహాల్ని కొనేవారి శాతం తక్కువైంది. మధ్యస్థ మరియు సంపన్న గృహాలకు గిరాకీ అధికమైంది. అందుబాటు ఇళ్లతో పోల్చితే వీటి గ్రోత్ కనీసం డెబ్బయ్ శాతం దాకా ఉంది. కాబట్టి, వచ్చే ఏడాదిలో అయినా గృహరుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయనే ఆశాభావంతో ఉన్నాను. రియల్ రంగంలో అన్‌సోల్డ్ స్టాకు గురించి చాలామంది మాట్లాడుతుంటారు. వాస్తవానికి, అన్‌సోల్డ్ స్టాకు అనేది ప్రతిరంగంలోనూ ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఉదాహరణకు ఆటోమొబైల్ రంగాన్ని తీసుకుంటే.. అందులో అన్‌సోల్ట్ స్టాకు ఉండదని మీరు అనుకుంటున్నారా? మనదేశంలో నిర్మాణ రంగం ప్రత్యేకత ఏమిటంటే.. గృహరుణాల్లో మొండి బకాయిలనేవి పెద్దగా ఉండవు. ఇవి మహా అయితే రెండు శాతం కంటే ఎక్కువగా మించదని గుర్తుంచుకోవాలి.
1.25 కోట్ల అందుబాటు గృహాలు కావాలి
తినడానికి తిండి, వేసుకునే బట్టల విషయంలో మిగులు సాధించామని.. ఇప్పుడు మనదేశంలో ఏ స్థాయిలో ఉన్నవారికి ఆ స్థాయిలో ఈ రెండు లభిస్తున్నాయి. కాకపోతే, ఇంటి విషయంలోనే మనం ఇంకా చాలా చేయాల్సి ఉంది. వచ్చే ఐదేళ్లలో ఎంతలేదన్నా 1.25 కోట్ల అందుబాటు గృహాల్ని నిర్మించాలి. అప్పుడే, సామాన్య మరియు మధ్యతరగతి ప్రజానీకపు సొంతింటి కల సాకారం అవుతుంది. ఇదొక్కటే కాదు.. అద్దె గృహాల్ని విరివిగా నిర్మించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో అద్దె గృహాలకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఒక ప్రాంతం నుంచి నగరాలకు విచ్చేసేవారు.. రాగానే సొంతిల్లు కొనుక్కోలేరు కదా. కాబట్టి, అలాంటి వారందరికీ ఉపయోగపడేలా అద్దె గృహాల్ని నిర్మించాలి. మీరు గమనిస్తే కొన్ని నగరాల్లో.. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లోని బ్యాంకులు వంటివి తమ ఉద్యోగులకు ప్రత్యేకంగా క్వార్టర్లను నిర్మించడాన్ని మనకు తెలుసు. ఇలా ప్రతి నగరంలోనూ అద్దె గృహాలను నిర్మించేందుకు ప్రభుత్వ ప్రత్యేకంగా ఒక పాలసీని రూపొందించాలి. వీటిని నిర్మించేందుకు ముందుకొచ్చేవారికి విడిగా ప్రోత్సాహాకాల్ని ప్రకటించాలి. ఉదాహరణరకు ఐదేళ్లు పన్ను రాయితీ వంటివి కల్పిస్తే అద్దె గృహాల్ని కట్టేందుకు అనేక మంది ముందుకొచ్చి నిర్మిస్తారు.
స్కిల్డ్ లేబర్ కొరత
మనదేశంలో నిర్మాణ రంగం గణనీయంగా పెరుగుతోంది. ఐటీ భవనాలు, వాణిజ్య కట్టడాలు, బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాలు, జాతీయ రహదారులు, బ్రిడ్జీలు వంటి నిర్మాణాలు ఊపందుకున్నాయి. రానున్న రోజుల్లోనూ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అందుకే, నైపుణ్యం గల కార్మికులు సంఖ్య మన దేశానికెంతో అత్యవసరం. 37 లక్షల మంది కార్మికులు అవసరమైతే 37 వేల మంది మాత్రమే దొరుకుతున్నారు. ఈ సంఖ్యను పెంచుకోవడానికి భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
సంస్థ గురించి..
ముందునుంచీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాం. ఏటా 10 నుంచి 12 శాతం గ్రోత్ సాధిస్తున్నాం. ఇటీవల ఇతర రంగాల్లోకి అడుగుపెట్టాం. డేటా సెంటర్ల విభాగంలోకి ప్రవేశించాం. బ్లాక్ స్టోన్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నాం. గ్యాప్ పైప్ లైన్, స్కూళ్లు, కాలేజీలు తదితర విభాగాల్లోకి అడుగుపెట్టాం. ట్రాన్స్‌ప్లాంట్స్‌లో ఉన్నం. డయాబెటిస్‌ను తరిమివేసే ప్రయత్నం చేస్తున్నాం. మా అబ్బాయి దుబాయ్‌లో 23 మెరీనా అనే 88 అంతస్తుల అపార్టుమెంట్‌ని నిర్మించాడు. ప్రపంచంలోనే ఆరో అతి ఎత్తయిన రెసిడెన్షియల్ బిల్డింగ్ గా ఖ్యాతినార్జించింది. కూతురు ప్రియా లండన్‌లో ఉంటుంది.