టీఎస్ రెరా డా, ఎన్ సత్యనారాయణ హెచ్చరిక
రెరా’లో రిజిస్టర్ అయిన రియల్ ఎస్టేట్ ప్రమోటర్లు, బిల్డర్లు ఈ నెలాఖరులోగా.. త్రైమాసిక, వార్షిక ఆడిట్ నివేదికలు తప్పనిసరిగా సమర్పించాలని లేకపోతే రెరా చట్టం ప్రకారం తగిన చర్యల్ని తీసుకుంటామని.. రెరా చైర్మన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ ఒక ప్రకటనలో కోరారు. రెరా నిబంధనల మేరకు బిల్డర్లు, ప్రమోటర్లు తమ ప్రాజెక్టు త్రైమాసిక నివేదికను రెరా వెబ్‌సైటులో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. వార్షిక అకౌంట్ ఆడిట్ నివేదికలు ప్రతి సంవత్సరం విధిగా అప్‌లోడ్ చేయాలని తెలిపారు.
త్రైమాసిక నివేదికలను ప్రతిఏటా ఏప్రిల్, జులై, అక్టోబర్, జనవరి పదిహేనో తేదీలోపు సమర్పించాలన్నారు. వార్షిక సంవత్సరం ముగిసిన ఆరు నెలల్లోపు వార్షిక్ ఆడిట్ నివేదికలను సమర్పించాలని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే బిల్డర్లు, ప్రమోటర్లకు సమాచారాన్ని అందించామన్నారు. త్రైమాసిక నివేదికల కోసం ఫారం – 4, 5, 6, వార్షిక నివేదికల కోసం ఫారం – 7 ను వెబ్ సైటులో అందుబాటులో ఉన్నాయని.. వాటిని డౌన్‌లోన్ చేసుకుని నివేదికల్ని సమర్పించాలని తెలిపారు. నివేదికలు పంపని ప్రాజెక్టులపై రెరా’ చట్టంలోని నిబంధనల మేరకు తగిన చర్యల్ని తీసుకుంటామని హెచ్చరించారు.