హైదరాబాద్‌లోనే ప్రప్రథమంగా ఏర్పాటైన ఐఏఎంసీ..
-
మాజీ చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ
ఆలోచనే.. ఐఏఎంసీ
-
ఆర్బిట్రేషన్ అండ్
మీడియేషన్ సెంటర్
-
కార్పొరేట్, వ్యాపార, రియల్
సమస్యలకు పరిష్కారం
-
ఫీజు నామమాత్రం..
-
పరిష్కారం వేగవంతం
కార్పొరేట్ సంస్థలే కాదు రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ అనేక వివాదాలు నెలకొంటాయి. కాకపోతే, వాటి పరిష్కారానికి కోర్టుల చుట్టూ తిరిగితే ఎన్నేళ్లు పడుతుందో ఎవరికీ తెలియదు. పైగా, ఆయా వివాదం బయటికొస్తే సంస్థల ప్రతిష్ఠ మసకబారుతుంది. అలా కాకుండా, ఇద్దరు వ్యక్తులు లేదా కాంట్రాక్టర్లు లేదా సంస్థల మధ్య నెలకొన్న వివాదాలను.. కేవలం నాలుగు గోడల మధ్యలో.. న్యాయ నిపుణుల సమక్షంలో.. వేగంగా పరిష్కారమైతే ఎంత బాగుంటుంది కదూ! అవును.. ఇలాంటి సంస్థే హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో ఇటీవల కాలంలో ఆరంభమైంది. అదే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ). భారత సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వీ రమణ ఉన్నతమైన ఆలోచనలతో పురుడు పోసుకున్న ఐఏఎంసీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందించింది.
కేంద్ర, రాష్ట్రాల పరిధిలోని పలు కార్పొరేట్, పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో, కుటుంబం వ్యవస్థలో నెలకొన్న పలు వివాదాలను మధ్యవర్తిత్వం, సంధి మార్గాల్ని అనుసరించి ఐఏఎంసీ పరిష్కరిస్తుంది. ముఖ్యంగా సమాజంలో వివిధ సంస్థల కాంట్రాక్టుల్లో చోటు చేసుకున్న ఆర్థికపరమైన వివాదాల్ని సంప్రదాయంగా న్యాయస్థానాల పరిధిలోనికి వెళ్లకుండా.. త్వరితగతిన నామమాత్రపు ఖర్చుతో ఇరుపక్షాల అనుమతితో ఐఏఎంసీ పరిష్కరిస్తుంది. ఎమ్మెస్ఎంఈ గొడవలైన, భార్యాభర్తల వ్యవహారమైన ఐఏఎంసీ మీడియేషన్ ద్వారా చక్కని పరిష్కారం లభిస్తుంది.
ఇదో స్వచ్ఛంద సంస్థ..
వాస్తవానికి, ఐఏఎంసీ ఒక పబ్లిక్ చారిటీ సంస్థ. సమాజంలో బాధ్యత గల హోదాలో పని చేసిన నిపుణులు ఈ సంస్థలో ఉన్నారు. ఇందులో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరావు, అర్వీ రవీంద్రన్, సీమా కోహ్లీ, ట్రస్టీస్ గా చీఫ్ జస్టిస్, లా మినిస్టర్ ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరంతా ఎటువంటి జీతభత్యాలు తీసుకోకుండా ఐఏఎంసీకి తలమానికంగా నిలుస్తున్నారు. వీరిని కేంద్రం నియమించదు. ఐఏఎంసీ సంస్థ గవర్నింగ్ కౌన్సిల్ లో సభ్యులుగా అంతర్జాతీయంగా అర్బీట్రేషన్, మీడియేషన్ రంగంలో అనుభవం గల నిష్ణాతులు సంస్థ కార్యకలాపాల్లో నిబంధనలకు అనుగుణంగా తగిన సమయాల్లో అర్బీట్రేషన్, మీడియేషన్ జరిగేలా వ్యవహారిస్తారు.
ఫీజెంత?
ఐఏఎంసీలో నామమాత్రంగా ఐదు వేల రుసుముతో కేసు రిజిస్టర్ చేసుకోవచ్చు. మీడియేషన్ విధానానికి ఒప్పుకున్న పార్టీల సమ్మతితో మీడియేషన్ టీమ్ కార్యాచరణను ప్రారంభిస్తుంది. మీడియేషన్ తంతు మూడు నెలలకు ఎక్కువ వ్యవధి కాకుండా పరిష్కారమయ్యేలా చర్యల్ని తీసుకుంటారు. నిజానికి రెండు నెలల లోపే పూర్తయ్యేలా చూస్తారు. కోర్టుల్లో ఎక్కువ గడువు తీసుకున్న ఒక విషయంలో ఈ సంస్థ మీడియేషన్ ద్వారా రెండు నెలల్లో సమస్యను పరిష్కరించింది. అది ఐఏఎంసీ విజయాల్లో ఒకటి. కాకపోతే ఆర్బిట్రేషన్ అంశాలపై నిబంధనలకు అనుగుణంగా మొత్తం ఏడాదిన్నరలోనే సమస్యలు పరిష్కరించాలనేది సంస్థ ప్రయత్నం. ఆ దిశగానే ఐఏఎంసీ పనిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో కొంత టైం ఎక్కువ పట్టొచ్చు. ప్రస్తుతం అలాంటి కేసు ఒకటి ఉంది.
వేగంగా పరిష్కారం..
మీడియేషన్ అంశాన్ని తీసుకున్నట్టయితే ఆ విధానం కోర్టుల కంటే, అర్బీట్రేషన్ కంటే సులువైన ప్రక్రియ. ఐఏఎంసీ న్యాయ నిపుణులు మీడియేషన్లో వివాదాలను తొందరగా, సులువుగా ఇరు పార్టీలు ఒప్పుకునేలా చేస్తారు. తద్వారా వివాదాలు సమసిపోయి పార్టీల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. అదే మీడియేషన్లో ఉన్న గొప్పతనం. ఇవి కొన్ని సార్లు రెండు మూడు రోజుల్లోనే పరిష్కారం అవుతాయంటే నమ్మండి. అర్బీట్రేషన్లో అనేక అంశాలు చోటు చేసుకొని ఉంటాయి. కంపెనీల వ్యవహారాల్లో ఇరువర్గాల చిక్కుముళ్లను అర్ధం చేసుకోవాలి. అర్బీట్రేషన్ కోసం నియమించిన వ్యక్తి అనేక అంశాల్ని సున్నితంగా పరిశీలన చేస్తూ.. ఏ పక్షానికి కొమ్ము కాయకుండా ఉండాలి. తన అనుభవాన్నీ క్రోడికరించి సమయం తీసుకున్న ఇరువర్గాలకు న్యాయం జరిగేలా చూడాలి. మీడియేషన్ తో చూసుకున్నట్టయితే అర్బీట్రేషన్ కొంత కష్టమైన ప్రక్రియ. ఐఏఎంసిని సంప్రదించిన పార్టీలను మీడియేషన్ వైపు వెళ్లాలని ఎప్పుడు బలవంతం చేయదని గుర్తుంచుకోవాలి.
రియల్ రంగంలోనూ..
రియల్ ఎస్టేట్ రంగాన్ని తీసుకున్నట్లయితే నిర్మాణ రంగంలోని వివాదాలను పరిశీలించడానికి నిర్మాణ రంగానికి సంబంధించిన అంశాలను లోతుగా, లీగల్ గా తెలిసిన వ్యకి నియమించడం ఎంతో అవసరం. అందులో కూడా న్యాయ వ్యవస్థలో బాగా అనుభవమున్న న్యాయమూర్తులను, అడ్వకేట్లను, శిక్షణ పొందిన వ్యక్తులను అర్బీట్రేటర్లుగా నియమిస్తాం. ఇందులో వ్యక్తుల నిజాయితీ, సత్వర నిర్ణయానుభవం వంటివి పరిగణలోకి తీసుకుంటాం. ఐఏఎంసీ సంస్థ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. రెరా చట్టంలో బిల్డర్లు, బయర్ల మధ్య సెక్షన్ 32కు సంబంధించిన అంశాలను పరిగణలోనికి తీసుకోవడం చాలా అవసరం. బిల్డర్లు, కాంట్రాక్టర్ల మధ్యలో అనేక ఆర్ధిక లావాదేవీలపై వివాదాలు నెలకొంటాయి. వీటిని ఐఏఎంసీ వేగంగా పరిష్కరిస్తుంది. అందుకే, నేడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి సమస్యలున్న వారంతా ఐఏఎంసీ ని ఆశ్రయిస్తున్నారు.
బిల్డర్లు కోర్టుల చుట్టు తిరగక్కర్లేదు!
హైదరాబాద్ మహానగరం నేడు దేశంలో అన్ని రంగాలకు పెద్దపెట వేస్తున్న నగరం. ప్రపంచ కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. దేశంలోనే రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్ర బిందువైంది. ఏ బిల్డరైనా, డెవలపర్ అయినా స్థలాలు కొనుక్కొని కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగరు. వారికీ కావాల్సింది ఆమోదయోగ్యమైన, మద్యేమార్గంగా న్యాయం చెప్పాల్సిన సంస్థ. అదే ఐఏఎంసీ. ఇప్పటికే నగరంలోని కొన్ని రియల్టీ కంపెనీలు ఐఏఎంసీ సేవల్ని వినియోగిస్తున్నాయి.
అవగాహన పెంచే దిశగా..
ఐఏఎంసీ సేవలపై ప్రజల్లో కూడా అవగాహన తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఇందుకు సంబంధించి ఇటీవల దుబాయ్‌లో ఐఏఎంసీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇంకా ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి కార్యక్రమాల్ని చేపడతాం. త్వరలోనే హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ అర్బీట్రేటర్స్, మీడియేషన్ నిపుణులతో వర్క్‌షాపును నిర్వహించాలని భావిస్తున్నాం. తెలంగాణలోని యువ న్యాయవాదులకు, ఔత్సహికులకు హైదరాబాద్లో ఉచితంగా శిక్షణా తరగతుల్ని నిర్వహిస్తాం. అంతేకాకుండా బ్యూరోక్రాట్స్, పోలీస్ ఆఫీసర్లు, రెరా అధికారులు, జ్యూడీషియల్ ఆఫీషియల్స్ ని కూడా ఇందులో భాగస్వామ్యులుగా చేయాలని భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాలకో రోల్ మోడల్‌గా నిలిచేందుకు ఐఏఎంసీ ముఖ్యభూమిక పోషిస్తుందని ఆశిస్తున్నాను. పారిశ్రామిక, వ్యాపార రంగాల అభివృద్ధికి కృషి చేసే ఫిక్కి, సీఐఐ, క్రెడాయ్ వంటి సంస్థలతో సమావేశాల్ని నిర్వహించాం. ఆ సంస్థల ప్రతినిధులు ఐఏఎంసీని ప్రోత్సాహిస్తున్నారు. – తారిక్ ఖాన్, రిజిస్ట్రార్, ఐఏఎంసీ.