-
ఐదేళ్లకోసారి సర్వసాధారణం
-
ఎవరు అధికారంలోకి వచ్చినా
-
హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోదు
-
రెడీ టు ఆక్యుపై ఎంతో బెటర్!
ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదేళ్లకోసారి ఓట్ల పండగ జరగడం సర్వసాధారణమే. ఇందులో ఎవరు గెలిచినా, ఓడినా.. అంతిమంగా లాభపడేది హైదరాబాదే. ఎందుకంటే, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. భాగ్యనగరాన్ని డెవలప్ చేయాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే, ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కో స్టయిల్లో అభివృద్ధి పనుల్ని జరిపిస్తారు. కాకపోతే, అందుకు అలవాటు పడటానికి పాలక, అధికార వర్గానికి కొంతసమయం పడుతుంది. అయితే, అభివృద్ధి విషయంలో మాత్రం ఎలాంటి ఢోకా ఉండదు. అధికారంలోకి ఎవరొచ్చినా ఇప్పుడున్న ప్రగతి మాత్రం యధావిధిగా కొనసాగుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేదురమల్లి జనార్దన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఐటీ కట్టడాలకు అంకురార్పణ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక ఐటీ రంగాన్ని విస్తృతం చేశారు. ఆతర్వాతి వైఎస్సార్ ప్రభుత్వం శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు వంటివి ఆరంభించారు. కిరణ్ కుమార్ రెడ్డి హయంలోనూ అభివృద్ధి చోటు చేసుకుంది. తెలంగాణ ఏర్పాటయ్యాక అభివృద్ధి టాప్ గేరులోకి వెళ్లిన మాట వాస్తవం. కాబట్టి, గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారీ ఎన్నికలొచ్చాయి కాబట్టి, ఇదో సర్వసాధారణంగా జరిగే తంతుగానే భావించాలి. అందుకే, ఈ సమయంలో మీకు ఏదైనా ప్రాజెక్టు నచ్చితే గనక.. మీరు ఆనందంగా అందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోండి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుకట్ట పడే ప్రమాదమే లేదు.
బీఆర్ఎస్ గెలిస్తే..
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. హైదరాబాద్ అభివృద్ధికి పట్టాపగ్గాలుండవు. ఊహించిన దానికంటే మరింత వేగంగా నగరం వృద్ధి చెందుతుంది. ప్రస్తుతమున్న ప్రాజెక్టులన్నీ యధావిధిగా కొనసాగుతాయి. కోకాపేట్, బుద్వేల్ తో పాటు మిగతా ప్రాంతాల్లోనూ వేలం పాటలు జరుగుతాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలన్నీ వరుసగా నగరానికి విచ్చేస్తాయి. వచ్చే ఎన్నికల్లోపు హైదరాబాద్ ముఖచిత్రం సమూలంగా మారిపోతుందనడలో ఎలాంటి సందేహం లేదు.
కాంగ్రెస్ గెలిచినా..
తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో.. అలాంటి పరిస్థితులే ఎదురయ్యే అవకాశముంది. కాకపోతే, మార్కెట్ కొంతకాలం వేచి చూసే ధోరణీని అలవర్చుకుంటుంది. కొత్త పాలకులు విధానపరంగా ఎలాంటి నిర్ణయాల్ని తీసుకుంటారు.. ఏయే అంశాలకు పెద్దపీట వేస్తారనే అంశాలపై అభివృద్ధి ఆధారపడుతుంది. కాకపోతే, అధికార మార్పునకు అనుగుణంగా మారడానికి రియల్ మార్కెట్‌కు కొంత సమయం పడుతుంది. ఆతర్వాత, హైదరాబాద్ అభివృద్ధిని యధావిధిగానే ముందుకెళుతుంది. మనం గమనిస్తే.. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ, 2016 తర్వాతే అభివృద్ధి ఊపందుకుంది. అదే మళ్లీ పునరావృతమయ్యే అవకాశముంది.
ఇప్పుడే రేటు తక్కువ..
యాభై లక్షల జనాభా దాటిన నగరంలో.. నీటి సౌకర్యం మెరుగ్గా ఉండి.. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతూ.. ఉద్యోగ భద్రతకు ఢోకా లేకపోతే.. ఆయా నగరంలోకి అడుగు పెట్టేందుకు అనేక మంది ఉత్సాహం చూపిస్తారు. ఒకవేళ, అట్టి నగరంలో కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నట్టయితే.. దాన్ని అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. అలాంటిది, హైదరాబాద్ అభివృద్ధి కోటి జనాభాను దాటేసింది. ఒక మెట్రో నగరానికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉండటంతో.. దీన్ని అభివృద్ధిని ఎవరూ ఆపలేరు.
గత మూడేళ్లుగా భూముల ధరలు, నిర్మాణ సామగ్రి రేట్లు ఏ విధంగా పెరిగాయో అందరికీ తెలుసు. కాబట్టి, ఈ రోజు మొదలు పెట్టిన వెంచర్‌లో కొనడం కంటే, ప్రాజెక్టు పూర్తయిన వాటిలోనే రేట్లు తక్కువున్నాయి. అందుకే, ఎన్నికలతో సంబంధం లేకుండా.. ఇప్పుడైనా వీటిలో కొనడమే అన్నివిధాల ఉత్తమం. ఎందుకంటే, ప్రస్తుతం ఆరంభమయ్యే నిర్మాణాలు పూర్తవ్వడానికి ఎంతలేదన్నా మూడు, నాలుగేళ్లు పడుతుంది. కాబట్టి, ఎన్నికలతో సంబంధం లేకుండా.. స్థిరాస్తిని కొనుగోలు చేయాలని భావించేవారికిదే సరైన సమయం అని గుర్తుంచుకోవాలి. – చెరుకు రామచంద్రారెడ్డి, ఎండీ, ఆర్‌వీ నిర్మాణ్