-
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు
-
చెలరేగిపోతున్న అక్రమార్కులు
-
ఈ విల్లాల వల్ల రెరా ప్రాజెక్టులపై ప్రభావం!
-
అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయలేరా?
హైదరాబాద్లోని ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాల్లో.. భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. విలాసవంతమైన విల్లాలు, విశాలమైన గెస్ట్ హౌసుల నిర్మాణం ఊపందుకుంది. బడా బాబులు సైతం వీటిలో కొనేందుకు ముందుకొస్తున్నారు. కోట్లు పెట్టి నగరంలో కొనడం కంటే.. అంతకంటే సగం ధరకే ఇక్కడ మరింత విశాలమైన విల్లాలు వస్తుండటంతో.. అధిక శాతం మంది కొనుగోలుదారులు.. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాల్లో అక్రమ విల్లాల్ని కొనేందుకు పోటీ పడుతున్నారు. హెచ్ఎండీఏ, రెరా నుంచి ఎలాంటి అనుమతుల్ని తీసుకోకుండా.. కొందరు బడా బిల్డర్లు లగ్జరీ విల్లాల్ని కడుతుండటంతో.. కిస్మత్పూర్, బండ్లగూడ, మోకిలా, కొల్లూరు, నార్సింగి, మంచిరేవుల వంటి ప్రాంతాల్లో విల్లాలు, లగ్జరీ అపార్టుమెంట్ల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాక, రెరా బిల్డర్లు తలపట్టుకుంటున్నారు.
ఒకవైపు ప్రభుత్వమే రెరా అనుమతి తీసుకుని ప్రాజెక్టులను ఆరంభించమని చెబుతుంది. అయినా, కొందరు అక్రమార్కులు ప్రీలాంచుల్లో ఫ్లాట్లు, విల్లాల్ని విక్రయిస్తున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని.. ఎవరెన్ని అమ్మకాలు జరిపినా.. ఎన్ని కోట్లు వసూలు చేసినా.. ఆయా సంస్థ హెచ్ఎండీఏ లేదా డీటీసీపీ నుంచి అనుమతి తీసుకోగానే రెరా అనుమతిని జారీ చేస్తుంది. ఈ క్రమంలో ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయించినా.. టీఎస్ రెరా పెద్దగా పట్టించుకోవట్లేదు. అలాంటి తిమింగలాల మీద ఎలాంటి జరిమానాల్ని విధించట్లేదు. దీంతో, రెరా అంటే రాష్ట్రంలో బిల్డర్లకు భయం లేకుండా పోయింది. అందుకే, ఎంచక్కా ప్రీలాంచుల్లో అమ్ముతున్నారు.. ఆతర్వాత రెరా అనుమతిని తెచ్చుకుంటున్నారు.
అయితే, సమస్య ఎక్కడొస్తుందంటే.. గత ఏడాది నుంచి హెచ్ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే.. కొందరు ప్రబుద్ధులు ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాల్లో బడా విల్లాల్ని నిర్మిస్తున్నారు. ఎప్పుడో పాత తేదీలు వేసి పంచాయతీలు ఇచ్చిన అనుమతిని చూపెట్టి కొందరు అక్రమార్కులు లగ్జరీ విల్లాల్ని కడుతున్నారు. అయినా, హెచ్ఎండీఏ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇలాంటి బడా నిర్మాణాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు సైతం బినామీ పేర్లతో విల్లాల్ని కొంటున్నారని సమాచారం. అందుకే, ఈ బిల్డర్ల మీద ఈగ కూడా వాలనీయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదీఏమైనా, ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుగా.. రెరా అనుమతితో విల్లాల్ని కట్టే బిల్డర్లకు భారీ నష్టం వాటిల్లుతోంది.
మరేం చేయాలి?
- ట్రిపుల్ వన జీవో ప్రాంతాల్లోని నిర్మాణాలకు అనుమతినిస్తున్నారా? లేదా? అనే విషయంపై హెచ్ఎండీఏ అధికారికంగా స్పష్టతనివ్వాలి.
- ఒకవేళ హెచ్ఎండీఏ అనుమతిని మంజూరు చేయకపోతే.. ఆయా ప్రాంతాల్లో పలువురు బిల్డర్లు ఎలా విల్లాల్ని కడుతున్నారు? ఎవరి అండ చూసుకుని వీరంతా రెచ్చిపోతున్నారు?
- హెచ్ఎండీఏ, రెరా అనుమతి లేకుండా అక్రమంగా విల్లాల్ని బిల్డర్లు కడుతుంటే.. అధికారులేం చేస్తున్నారు?
- 111 జీవో ప్రాంతాల్లో అక్రమ నిర్మాణల్ని కడుతున్న విషయం అధికారులకు తెలియదా? తెలిసినా, తెలియనట్లు నటిస్తున్నారా?
- అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయకుండా హెచ్ఎండీఏ అధికారులెందుకు ఆలస్యం చేస్తున్నారు?
కట్టుకోమని హెచ్ఎండీఏ అధికారులు చెప్పారా?
ట్రిపుల్ వన్ జీవోను తొలగించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కాకపోతే, ఇందుకు సంబంధించిన జీవోను ఎక్కడా విడుదల చేయలేదు. అందుకే, అక్రమ నిర్మాణాల్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందా అనే సందేహం ప్రజల్లో నెలకొంది. ఎందుకంటే, ఇక్కడ రూపుదిద్దుకుంటున్న బడా విల్లాల్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అంత విశాలమున్న విల్లాల్ని కట్టాలంటే.. ప్రభుత్వ సాయం లేకుంటే సాధ్యం కాదని ప్రజలు భావిస్తున్నారు.