కొనుగోలుదారులను రూ.11 కోట్లకు మోసం చేసిన కేసులో ఓ రియల్టీ సంస్థ భాగస్వామికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. రాయల్ రియల్టర్స్ భాగస్వామి రిజ్వాన్ దాదన్ 2012లో ముంబైలోని బైకులాలో ఓ ప్రాజెక్టును రీ డెవలప్ మెంట్ చేశారు. ముంబైకి చెందిన తల్లీ కొడుకులు అందులో వెయ్యి చదరపు గజాల ఫ్లాట్ ను రూ.57 లక్షలకు కొనుగోలు చేశారు. అయితే, రోజులు గడుస్తున్నా ఫ్లాట్ అప్పగించలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించడంతో దాదన్ పై కేసు నమోదైంది. అనంతరం కేసులోని వాస్తవాలను పరిశీలించి, 23 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం.. దాదన్ ను దోషిగా నిర్ధారించింది. కొనుగోలుదారులు చెల్లించిన దాదాపు రూ.10.9 కోట్ల మొత్తాన్ని తన సొంత అవసరాలకు వాడుకున్నట్టు తేల్చింది. అలాగే ఒకే ఫ్లాట్ ను పలువురికి విక్రయించినట్టు గుర్తించింది. దీంతో దాదన్ కు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 50వేల జరిమానా విధిస్తున్నట్టు న్యాయమూర్తి డీఎస్ పటాలే తీర్పు చెప్పారు.